Bandi Sanjay :టెన్త్ పిల్లలకు ఎందుకీ లంచ్ ‘‘పరీక్ష’’.. రేవంత్ ప్రభుత్వంపై బండి సంజయ్ సూటి ప్రశ్నలు
ABN , Publish Date - Mar 01 , 2025 | 09:54 PM
Bandi Sanjay Kumar:రంజాన్ సందర్భంగా ముస్లింలకు సాయంత్రం 4 గంటల తర్వాత విధుల నుంచి ప్రభుత్వం మినహాయింపు ఇచ్చిందని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ గుర్తుచేశారు. పాఠశాలల వేళలు సైతం ఉదయం 9.15 గంటలకు ప్రారంభమై సాయంత్రం 4.15 గంటలకు ముగుస్తాయని తెలిపారు.

హైదరాబాద్: రంజాన్ కోసం ఇష్టం వచ్చినట్లుగా పరీక్ష టైం టేబుల్ మారుస్తారా అని రేవంత్ ప్రభుత్వాన్ని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రశ్నించారు. ఒక వర్గం కోసం మరో వర్గం వారిని ఇబ్బందికి గురిచేయడమేందని నిలదీశారు. టెన్త్ పిల్లలకు ఎందుకీ లంచ్ ‘‘పరీక్ష’’ అని ప్రశ్నల వర్షం కురిపించారు. ఇదేనా కాంగ్రెస్ మార్క్ సమానత్వం అని అడిగారు. తక్షణమే టెన్త్ పరీక్షల టైం టేబుల్ మార్చాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఓ పత్రిక ప్రకటన విడుదల చేశారు. రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని ఈనెల 6వ తేదీ నుంచి నిర్వహించే పదోతరగతి ప్రీ ఫైనల్ పరీక్షలను మధ్యాహ్నం 12.15 నుంచి 3.15 గంటలకు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సమంజసం కాదని చెప్పారు. ఆ సమయంలో విద్యార్థులు, అధ్యాపకులతో సహా ప్రతి ఒక్కరూ లంచ్ చేసే సమయమని గుర్తుచేశారు. ఈ సమయంలో పరీక్షలు నిర్వహించి విద్యార్థులను ఇబ్బందులకు గురిచేయడం సరికాదని బండి సంజయ్ కుమార్ చెప్పారు.
రంజాన్ సందర్భంగా ముస్లింలకు సాయంత్రం 4 గంటల తర్వాత విధుల నుంచి ప్రభుత్వం మినహాయింపు ఇచ్చిందని బండి సంజయ్ కుమార్ గుర్తుచేశారు. పాఠశాలల వేళలు సైతం ఉదయం 9.15 గంటలకు ప్రారంభమై సాయంత్రం 4.15 గంటలకు ముగుస్తాయని తెలిపారు. అయినప్పటికీ మళ్లీ రంజాన్ పేరుతో వేళాపాళా లేకుండా పరీక్షలు నిర్వహించి విద్యార్థులను ఇబ్బందులకు గురిచేయడం ఎంత వరకు సరైనదని బండి సంజయ్ కుమార్ ప్రశ్నించారు. ఒక వర్గం వారిని మెప్పించేందుకు యావత్ విద్యార్థుల కడుపు మాడ్చడం న్యాయమా అని నిలదీశారు. తబ్లిగీ జమాతే వంటి విదేశాల్లో నిషేధిత సంస్థ తెలంగాణ రాష్ట్రంలో సభలు నిర్వహించుకుంటే ఏకంగా ప్రభుత్వ సొమ్మును ఖర్చు చేస్తున్నారని బండి సంజయ్ కుమార్ ఆరోపించారు.
రంజాన్‌కు డ్యూటీ మినహాయింపు ఇస్తున్నారని బండి సంజయ్ కుమార్ చెప్పారు. రంజాన్‌కు బహమతులు అందిస్తారని... మక్కా వెళ్లేందుకు ఉచిత వసతి, రవాణా సదుపాయాలు కల్పిస్తారని... కానీ అయ్యప్ప, భవానీ, హనుమాన్ భక్తులకు మాత్రం ఎలాంటి మినహాయింపులూ ఎందుకు ఇవ్వడం లేదని బండి సంజయ్ కుమార్ ప్రశ్నించారు. హిందూ పండుగలకు ప్రత్యేక నిధులూ ఎందుకు కేటాయించరని నిలదీశారు. శివరాత్రి పండుగ సందర్బంగా హిందువులంతా ఉపవాసం, జాగరణ చేస్తారని... మరుసటి రోజూ విశ్రాంతి తీసుకుంటారని చెప్పారు. కనీసం అప్షనల్ హాలీడే కూడా ఎందుకు ఇవ్వలేదని... పైగా హిందూ పండుగల సమయంలో నిబంధనల పేరుతో అనేక అడ్డంకులు సృష్టిస్తున్నారని బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టిలో ఇదేనా సమానత్వమంటే అని ప్రశ్నించారు. హిందువులంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి అంత చులకనా అని నిలదీశారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన సర్క్యులర్‌ను ఉపసంహరించుకోవాలని కోరారు. విద్యార్థులకు, అధ్యాపకులకు ఇబ్బంది లేకుండా 10వ తరగతి ప్రీఫైనల్ పరీక్షా టైం టేబుల్‌ను మార్చాలని బండి సంజయ్ కుమార్ కోరారు.