Dr Namrata custody: రెండో రోజు కస్టడీకి డాక్టర్ నమ్రత.. ఈ రోజైనా మౌనం వీడుతుందా..?
ABN , Publish Date - Aug 02 , 2025 | 10:12 AM
సృష్టి కేసు వ్యవహారంలో ఏ1 నిందితురాలు డాక్టర్ నమ్రతను రెండవ రోజు కస్టడీలో భాగంగా పోలీసులు విచారించనున్నారు. మొదటి రోజున విచారణకు సహకరించకుండా తప్పించుకునే ప్రయత్నం చేసిన డాక్టర్ నమ్రత నుంచి కీలక విషయాలు రాబట్టేందుకు పోలీసులు సిద్ధమయ్యారు.

Srushti Fertility Case Dr Namrata: సృష్టి ఫెర్టిలిటీ కేసు వ్యవహారంలో ఏ1 నిందితురాలు డాక్టర్ నమ్రతను రెండవ రోజు కస్టడీలో భాగంగా పోలీసులు విచారించనున్నారు. అక్రమంగా అండాలు, స్మెర్మ్ రవాణా, చైల్డ్ ట్రాఫికింగ్ గురించి పోలీసులు ఎన్ని ప్రశ్నలు గుప్పించినా తొలిరోజు విచారణలో నోరు విప్పలేదు డాక్టర్ నమ్రత. తన ఏజెంట్లు ఏఎన్ఎం ఆశా వర్కర్ల పాత్ర పై ఆరా తీసినప్పటికీ మౌనం వహించింది. గత నేర చరిత్ర, జైలు జీవితం అనుభవం ఉండడంతో తప్పించుకునే తరహాలో నాకు తెలియదంటూ సమాధానాలు దాటవేసింది. అలాగే రాజస్థాన్ దంపతులకు తాను దత్తత ఇచ్చానే తప్ప సరోగసీ అని చెప్పలేదని.. తాను చైల్డ్ ట్రాఫికింగ్ చేయలేదంటూ అడ్డంగా వాదిస్తోంది. మొదటి రోజున విచారణకు సహకరించని డాక్టర్ నమ్రత నుంచి రెండో రోజున కీలక విషయాలు రాబట్టేందుకు పోలీసులు సిద్ధమయ్యారు.
అలాగే సృష్టి కేసు వ్యవహారంలో కీలక నిందితులుగా ఉన్న మేనేజర్ కళ్యాణి, ఏజెంట్ సంతోషిలను చంచల్‌గూడ జైలు నుంచి కస్టడీకి తరలించనున్నారు. ఇప్పటికే కస్టడీలో ఉన్న నమ్రతతో పాటు.. వీరిని ఐదు రోజుల పాటు గోపాలపురం పోలీసులు విచారణ జరపనున్నారు. ఏజెంట్ సంతోషి ఇప్పటివరకు ఎంతమంది దంపతులను సృష్టి హాస్పిటల్ కు తీసుకొచ్చింది? వైజాగ్ సృష్టి మేనేజర్ కళ్యాణి ఎంతమంది పిల్లలను నమ్రత వద్దకు తీసుకువచ్చింది? ఎంత మందిని అమ్మింది? అనే విషయాల గురించి ఆరా తీయనున్నారు. పేద, గిరిజన ప్రాంతాలకు చెందిన మహిళ డబ్బు ఆశచూపి పిల్లలను తీసుకొని వచ్చి కళ్యాణి విక్రయించినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది.
సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ కేర్ సెంటర్ యజమాని డాక్టర్ నమ్రత తొలి రోజు కస్టడీలో పోలీసులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేదు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ విచారించినా పోలీసులు సరైన వివరాలు రాబట్టలేకపోయారు. అయితే, తాను బిడ్డను దత్తతకు మాత్రమే ఇచ్చానని చైల్డ్ ట్రాఫికింగ్ చేయలేదంటూ డాక్టర్ నమ్రత వాంగ్మూలం ఇచ్చింది. ఆస్పత్రి నుంచి సేకరించిన రికార్డుల్లో పలు అనుమానిత కేసుల గురించి పోలీసులు అడిగినప్పుడు.. నాకు తెలియదు.. గుర్తు లేదంటూ సమాధానం దాటవేసింది. అంతేగాక, డాక్టర్ నమ్రత మాజీ ఐఏఎస్ అధికారి అజయ్ కల్లాం, ఐపీఎస్ సీతా రామాంజనేయులుపై తీవ్ర ఆరోపణలు చేయడం సంచలనం రేపుతోంది. ఆమె చేసిన ఆరోపణలపై పోలీసులు ఇప్పటికే దర్యాప్తు మొదలుపెట్టారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఐటీమంత్రి శ్రీధర్‌బాబు ఆసక్తికర కామెంట్స్.. ఆయన ఏమన్నారంటే..
అవగాహనతోనే సైబర్ నేరాలకు అడ్డుకట్ట..
Read Latest Telangana News and National News