Share News

IPL 2026: తొక్కిసలాట ఎఫెక్ట్.. ఆర్సీబీ సంచలన నిర్ణయం!

ABN , Publish Date - Nov 12 , 2025 | 06:17 PM

గతేడాది ఆర్సీబీ విజయోత్సవ ర్యాలీలో తొక్కిసలాట జరిగి 11 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆర్సీబీ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. హోం గ్రౌండ్‌ను చిన్నస్వామి స్టేడియం నుంచి మహారాష్ట్రకు మారుస్తున్నట్లు సమాచారం.

IPL 2026: తొక్కిసలాట ఎఫెక్ట్.. ఆర్సీబీ సంచలన నిర్ణయం!
IPL 2026

ఇంటర్నెట్ డెస్క్: జూన్ 3, 2025.. 17 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఆర్సీబీ ఐపీఎల్(IPL 2025) ట్రోఫీ గెలిచింది. ఆర్సీబీ అభిమానుల నుంచి ఒకే జట్టు తరఫున ఏళ్లుగా ఆడుతున్న కింగ్ కోహ్లీ వరకు.. తమ కల సాకారం అయిందని మురిసిపోయిన రోజది. బెంగళూరు జట్టు టైటిల్ కైవసం చేసుకుని సంబరపడిపోయే లోపు.. ఓ పెద్ద అలజడి. అదే విజయోత్సవ ర్యాలీలో జరిగిన తొక్కిసలాట. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాటలో 11 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన దేశవ్యాప్తంగా విషాదం నింపింది. ఈ ఘటనలో ఎంతో మంది గాయపడిన సంగతి తెలిసిందే.


అక్కడ సురక్షితం కాదు..

ఈ ఘోర విషాదంపై కర్ణాటక ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. రిటైర్డ్ జడ్జ్ జాన్ మైఖేల్ డికున్హా నేతృత్వంలో ఓ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ చిన్నస్వామి స్టేడియం మ్యాచ్‌ల నిర్వహణకు సురక్షితం కాదని తేల్చింది. ఈ స్టేడియం భారీగా జనం గూమిగూడటానికి అనర్హంగా ప్రకటించింది.


ఈ నేపథ్యంలో ఆర్సీబీ(RCB) సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. వచ్చే ఏడాది హోమ్ మ్యాచ్‌లను చిన్నస్వామి స్టేడియం(Chinnaswamy Stadium)లో ఆడొద్దని డిసైడ్ అయినట్లు సమాచారం. ఇందుకు బదులుగా మహారాష్ట్రలో పుణేలోని గహున్జే స్టేడియాన్ని ఎంచుకున్నట్లు క్రీడా వర్గాలు తెలిపాయి. ఈ అంశంపై చర్చలు ఇంకా కొలిక్కి రాలేదు. కొన్ని సాంకేతిక అంశాలు పరిష్కారమైతే ఆర్సీబీకి పుణే వేదికగా మారే అవకాశం ఉంది.


అభిమానులకు బ్యాడ్ న్యూస్!

మహారాష్ట్రలో మ్యాచ్‌లు జరిగే వార్త నిజమైతే ఆర్సీబీ తమ మ్యాచ్‌లను చిన్నస్వామి స్టేడియంలో ఆడకపోవడం ఇదే తొలిసారి కానుంది. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో హోం గ్రౌండ్‌లో మ్యాచ్‌లు ఆడలేమని తెలిసి అభిమానులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు.


ఇవి కూడా చదవండి

వన్డే ర్యాంకింగ్స్.. టాప్-5లో విరాట్ కోహ్లీ

రెండో పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన రషీద్ ఖాన్

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Nov 12 , 2025 | 06:27 PM