BCCI: రో-కో దేశవాళీల్లో ఆడాల్సిందే: బీసీసీఐ
ABN , Publish Date - Nov 12 , 2025 | 03:21 PM
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వన్డేల్లో కొనసాగాలంటే దేశవాళీ క్రికెట్ ఆడాలని బీసీసీఐ స్పష్టం చేసింది. దీంతో వీరిద్దరూ త్వరలోనే జరగనున్న విజయ్ హజారే ట్రోఫీ, సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో పాల్గొనే అవకాశం ఉంది.
ఇంటర్నెడ్ డెస్క్: టీమిండియా స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇప్పటికే టీ20, టెస్టు ఫార్మాట్లకు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. వీరిద్దరూ ప్రస్తుతం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో రో-కోకి బీసీసీఐ ఓ సందేశం పంపింది. వన్డేల్లో కొనసాగాలంటే రోహిత్, విరాట్ దేశవాళీల్లో ఆడాల్సిందేనని స్పష్టం చేసింది.
ఫిట్‌నెస్ అవసరం..
బీసీసీఐ(BCCI) తాజా సందేశంతో రో-కో డిసెంబర్ 24 నుంచి ప్రారంభం కానున్న విజయ్ హజారే ట్రోఫీ(Vijay Hazare Trophy)లో పాల్గొనే అవకాశం ఉంది. ‘రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి బీసీసీఐ స్పష్టమైన సందేశం పంపింది. టీమిండియా తరఫున వారు ఆడాలి అనుకుంటే.. తప్పనిసరిగా దేశవాళీలో ఆడాల్సిందేనని తేల్చి చెప్పింది. వారిద్దరూ ఇప్పటికే టీ20, టెస్టు ఫార్మాట్లకు వీడ్కోలు పలికారు. వన్డేల్లో ఆడాలంటే.. మ్యాచ్ ఫిట్‌నెస్ కోసం వారు దేశవాళీల్లో ఆడాలి’ అని బీసీసీఐ అధికారి వెల్లడించారు.
హిట్‌మ్యాన్ సిద్ధం..
బీసీసీఐ ప్రకటన నేపథ్యంలో రోహిత్ శర్మ(Rohit Sharma) స్పందించాడు. తాను విజయ్ హజారే ట్రోఫీ ఆడేందుకు సిద్ధంగా ఉన్నానని ముంబై క్రికెట్ అసోసియేషన్(MCA)కు తెలిపాడు. అలాగే నవంబర్ 26 నుంచి ప్రారంభం కానున్న సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నమెంట్(Syed Mushtaq Ali)లో కూడా పాల్గొనేందుకు తాను ఆసక్తిగా ఉన్నానని ఎంసీఏకు వెల్లడించాడు. అయితే సౌతాఫ్రికా-భారత్ జట్ల మధ్య నవంబర్ 30 నుంచి వన్డే సిరీస్ ప్రారంభం కానున్న నేపథ్యంలో రోహిత్ సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో చాలా తక్కువ మ్యాచ్‌లు మాత్రమే ఆడే అవకాశం ఉంది. మరోవైపు దేశవాళీల్లో ఆడటంపై విరాట్ కోహ్లీ(Virat Kohli) స్పందించలేదు. మరి విరాట్ విజయ్ హజారే ట్రోఫీలో పాల్గొంటాడా? లేదా? అనే విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. కోహ్లీ చివరిసారిగా 2010లో ఢిల్లీ తరఫున ఈ టోర్నీలో పాల్గొన్నాడు.
సౌతాఫ్రికాతో టీమిండియా మూడు వన్డేలు ఆడనుంది. దీనికి సంబంధించిన తుది జట్టును ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఇటీవల ఆస్ట్రేలియాతో ముగిసిన వన్డే సిరీస్‌లో రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ, సెంచరీతో మెరిశాడు. అలాగే వన్డే ఫార్మాట్‌ల్లో నంబర్ 1 బ్యాటర్ స్థానాన్ని సొంతం చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మను వన్డే జట్టు నుంచి బీసీసీఐ తప్పించే సాహసం చేయకపోవచ్చు. ఆసీస్‌తో సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌ల్లో డకౌట్ అయిన విరాట్.. చివరి వన్డేలో మాత్రం హాఫ్ సెంచరీతో ఫామ్‌లోకి వచ్చాడు.
ఇవి కూడా చదవండి
సీఎస్కే వాళ్లిద్దరిని తీసుకోవాలి: అశ్విన్
కొనసాగుతున్న బాబర్ ఆజామ్ ఫ్లాప్ షో.. కోహ్లీ చెత్త రికార్డు సమం..
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి