Share News

IPL 2026: సీఎస్కే వాళ్లిద్దరిని తీసుకోవాలి: అశ్విన్

ABN , Publish Date - Nov 12 , 2025 | 02:33 PM

ఐపీఎల్ 2026లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు జడేజా, సామ్ కరన్‌ను వదులుకోవడానికి సిద్ధపడినట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎస్కేకి అశ్విన్ కీలక సూచనలు చేశాడు. జడేజా, కరన్ స్థానంలో నితీశ్ రాణా, వెంకటేశ్ అయ్యర్‌లను ఎంపిక చేస్తే బాగుంటుందని సూచించాడు.

IPL 2026: సీఎస్కే వాళ్లిద్దరిని తీసుకోవాలి: అశ్విన్
Ashwin

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ (IPL 2026) సందడి ఇప్పటికే మొదలైంది. ఇందులో ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్(CSK) జట్టు స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాను వదులుకోవడానికి సిద్ధమైన్నట్లు వస్తున్న వార్తలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. రాజస్థాన్ రాయల్స్‌(RR)కు చెందిన సంజు శాంసన్‌ను జట్టులోకి తీసుకోవడానికి జడేజాతో పాటు సామ్ కరన్‌ను కూడా సీఎస్కే విడుదల చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ సీఎస్కే జట్టుకు కీలక సూచనలు చేశాడు.


‘రవీంద్ర జడేజా(Ravindra Jadeja), సామ్ కరన్ రాజస్థాన్ రాయల్స్‌కు వెళ్లిపోతే.. చెన్నై సూపర్ కింగ్స్ తన జట్టును బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. నితీశ్ రాణా ఐపీఎల్‌లో వేలానికి వచ్చే అవకాశం ఉంది. నితీశ్, వెంకటేశ్ అయ్యర్‌ను సీఎస్కే తమ జట్టులోకి తీసుకోవాలి. సంజు శాంసన్, రుతురాజ్ గైక్వాడ్ ఓపెనర్లుగా వస్తే బాగుంటుంది. మూడో స్థానంలో వెంకటేశ్ అయ్యర్ లేదా నితీశ్ రాణా బ్యాటింగ్‌కు రావాలి. బ్రెవిస్, శివమ్ దూబె నాలుగు, ఐదో స్థానాల్లో వస్తారు. కెమెరూన్ గ్రీన్‌ను ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు పంపాలి. ఎందుకంటే అతడు ఇటీవల ఆసీస్ తరఫున మిడిల్ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కు వచ్చాడు’ అని అశ్విన్ విశ్లేషించాడు.


అదే సరైన నిర్ణయం..

‘వెంకటేశ్ అయ్యర్ చెపాక్ వేదికగా ఒకటి, రెండు మంచి ఇన్నింగ్స్ ఆడాడు. అయితే అతడు శివమ్ దూబెకు ప్రతిరూపం. అయినప్పటికీ వెంకటేశ్ అయ్యర్ స్వీప్, రివర్స్ స్వీప్ చక్కగా ఆడతాడు. ఇక నితీశ్ రాణా అయితే స్వ్కేర్ బౌండరీలను బాదగలడు. అందుకే వీరిద్దరినీ ఎంపిక చేసుకోవడం సరైన నిర్ణయం అవుతుంది’ అని అశ్విన్ వివరించాడు. కాగా ఐపీఎల్ 2026 మినీ వేలం డిసెంబర్ మూడో వారంలో జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే ఫ్రాంచైజీలు తాము రిటైన్ చేసుకునే, వేలానికి వదిలేసే ప్లేయర్ల జాబితాను నవంబర్ 15లోపు సమర్పించాలని బీసీసీఐ(BCCI) గడువు విధించిన విషయం తెలిసిందే.


ఇవి కూడా చదవండి

అందుకే పాక్ ఆటగాళ్లతో కరచాలనం చేయలేదు: సూర్యకుమార్

పాక్ క్రీడాకారులతో మాట కలపని భారత ప్లేయర్లు.. సైలెంట్ బాయ్‌కాట్

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Nov 12 , 2025 | 02:43 PM