Eden Gardens kolkata Test Match: పకడ్బందీగా
ABN , Publish Date - Nov 12 , 2025 | 05:54 AM
దక్షిణాఫ్రికాతో ఈనెల 14 నుంచి జరిగే తొలి టెస్టు కోసం టీమిండియా తమ సన్నాహకాలను ఆరంభించింది. మంగళవారం స్థానిక ఈడెన్ గార్డెన్స్‌లో భారత ఆటగాళ్లు నెట్స్‌లో చెమటోడ్చారు. ఆప్షనల్ అయినప్పటికీ...
భద్రత నడుమ జట్ల ప్రాక్టీస్
తొలి టెస్టు కోసం భారత్ సన్నాహకాలు
14 నుంచి దక్షిణాఫ్రికాతో మ్యాచ్
కోల్‌కతా: దక్షిణాఫ్రికాతో ఈనెల 14 నుంచి జరిగే తొలి టెస్టు కోసం టీమిండియా తమ సన్నాహకాలను ఆరంభించింది. మంగళవారం స్థానిక ఈడెన్ గార్డెన్స్‌లో భారత ఆటగాళ్లు నెట్స్‌లో చెమటోడ్చారు. ఆప్షనల్ అయినప్పటికీ కెప్టెన్ గిల్‌తో పాటు జైస్వాల్, సాయి సుదర్శన్, బుమ్రా, జడేజా, సుందర్, నితీశ్ ప్రాక్టీ్‌సలో కనిపించారు. ముందుగా కోచ్ గంభీర్, సహాయక కోచ్‌లు కోటక్, మోర్కెల్ పిచ్‌ను పరిశీలించారు. ఇక ఇటీవల పరిమిత ఓవర్ల ఫార్మాట్లలో రాణించలేకపోయిన గిల్ గంటన్నరపాటు మైదానంలోనే గడిపి తన టెక్నిక్‌పై దృష్టి సారించాడు. అలాగే సెంటర్ వికెట్‌పై సాయి సుదర్శన్ ఎక్కువగా లెగ్ సైడ్ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. దీంతో అతడిని వన్‌డౌన్‌లో ఆడించడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరో ఓపెనర్ జైస్వాల్‌కు స్పిన్నర్లు సుందర్, జడేజా బౌలింగ్ చేశారు. అయితే పేసర్ బుమ్రా మాత్రం ఎక్కువ సమయం నెట్స్‌లో గడపలేదు. మైదానంలోకి వచ్చాక అర్ధగంట వామప్, తర్వాత కాసేపు బౌలింగ్ ప్రాక్టీస్ చేసి డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లిపోయాడు. ఈ సమయంలో తన కుడి మోకాలికి పట్టీ వేసుకుని కనిపించాడు.
పిచ్‌పై అసంతృప్తి
తొలి టెస్టు జరిగే ఈడెన్ పిచ్‌పై భారత జట్టు కోచ్ గంభీర్, కెప్టెన్ గిల్ అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం. మంగళవారం జరిగిన నెట్ సెషన్‌కు ముందు పిచ్‌ను పరిశీలించిన గంభీర్, క్యూరేటర్ సుజన్ ముఖర్జీతో చాలాసేపు మాట్లాడడం కనిపించింది. అతడితో పాటు కెప్టెన్ గిల్, సహాయక కోచ్‌లు సితాంశు కోటక్, మోర్నీ మోర్కెల్ కూడా ఉన్నారు. పిచ్ గోధుమ రంగులో ఉండగా అక్కడక్కడా గడ్డి కనిపించింది. మరోవైపు టీమ్ మేనేజ్‌మెంట్ తమకు టర్నింగ్ వికెట్ కావాలనేమీ అడగలేదని బెంగాల్ క్రికెటట్ సంఘం (క్యాబ్) అధ్యక్షుడు గంగూలీ తేల్చాడు.
పోలీసుల పర్యవేక్షణలో..
ఢిల్లీ పేలుళ్ల నేపథ్యంలో తొలి టెస్టు వేదిక ఈడెన్ గార్డెన్స్ వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. అలాగే కోల్‌కతాలోనే ఉన్న భారత్-దక్షిణాఫ్రికా ఆటగాళ్లకు స్థానిక పోలీసులు పకడ్బందీగా రక్షణ ఏర్పాట్లు చేశారు. హోటల్ నుంచి స్టేడియానికి వెళ్లే సమ యంలో..అలాగే మ్యాచ్ జరిగే సందర్భంలోనూ నిరంతరం వీరి సెక్యూరిటీని పర్యవేక్షించనున్నారు. అటు మంగళవారం జరిగిన ప్రాక్టీస్ సెషన్ కూడా పోలీసుల భద్రత మధ్యే సాగింది. కోల్‌కతా పోలీస్ కమిషనర్ మనోజ్ వర్మ ఈడెన్ గార్డెన్స్‌లో ఏర్పాట్లను తనిఖీ చేశారు.
టాస్ కోసం బంగారు నాణెం
భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగే టెస్టు సిరీ్‌సలను ఫ్రీడమ్ ట్రోఫీగా పిలుచుకుంటారు. ఈ నేపథ్యంలో తొలి టెస్టు కోసం బెంగాల్ క్రికెట్ సంఘం (క్యాబ్) గాంధీ-నెల్సన్ మండేలా ముఖచిత్రాలతో కూడిన బంగారు నాణేన్ని తయారు చేయించింది. శుక్రవారం టాస్ వేసేందుకు ఈ నాణేన్నే వాడుతామని క్యాబ్ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తెలిపాడు.
స్పిన్‌పై సఫారీల దృష్టి
భారత్‌తో పాటు దక్షిణాఫ్రికా ఆటగాళ్లు కూడా మంగళవారం ప్రాక్టీ్‌సను ఆరంభించారు. ఇటీవలే పాక్‌తో టెస్టు సిరీ్‌సను 1-1తో డ్రాగా ముగించి భారత్‌కు వచ్చిన ఈ జట్టు ఆత్మవిశ్వాసంతో ఉంది. నెట్స్‌లో మొత్తం జట్టు ఆటగాళ్లంతా పాల్గొన్నారు. అయితే బ్యాటర్లు కెప్టెన్ బవుమా, మార్‌క్రమ్, రికెల్టన్, స్టబ్స్ స్పిన్‌ను దీటుగా ఎదుర్కోవడంపైనే దృష్టి సారించారు.
ఇవి కూడా చదవండి
అందుకే పాక్ ఆటగాళ్లతో కరచాలనం చేయలేదు: సూర్యకుమార్
పాక్ క్రీడాకారులతో మాట కలపని భారత ప్లేయర్లు.. సైలెంట్ బాయ్‌కాట్
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి