ICC: వన్డే ర్యాంకింగ్స్.. టాప్-5లో విరాట్ కోహ్లీ
ABN , Publish Date - Nov 12 , 2025 | 05:23 PM
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ టాప్-5లోకి దూసుకొచ్చాడు. రోహిత్ శర్మ అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. శుభ్‌మన్ గిల్ నాలుగో స్థానంలో ఉన్నాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఐసీసీ(ICC) తాజాగా వన్డే ర్యాంకింగ్స్ జాబితాను విడుదల చేసింది. దీంట్లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ(Virat Kohli) టాప్-5లోకి దూసుకొచ్చాడు. కోహ్లీ(725) రెండు స్థానాలు మెరుగై ఐదో ర్యాంక్‌కు చేరుకున్నాడు. ఇప్పటి వరకు ఐదో స్థానంలో ఉన్న పాకిస్తాన్ క్రికెటర్ బాబర్ అజామ్(709) ఏడో ర్యాంక్‌కు పడిపోయాడు. అయితే ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లో అద్భుతంగా రాణించిన రోహిత్ శర్మ(781) అగ్రస్థానాన్ని నిలబెట్టుకోగా.. శుభ్‌మన్ గిల్(745) నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు.
ఆ ఇద్దరూ..
ఆసీస్‌తో సిరీస్‌లో ఓ హాఫ్ సెంచరీతో రాణించిన టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్(Shreyas Iyer) తన తొమ్మిదో స్థానాన్ని కాపాడుకున్నాడు. అయితే తాజాగా ర్యాంకింగ్స్‌లో ఇద్దరు పాక్ ఆటగాళ్లు భారీగా లబ్ధి పొందారు. సౌతాఫ్రికాతో సిరీస్‌లో రాణించిన యువ ఆల్‌రౌండర్ సైమ్ అయూబ్ ఏకంగా 18 స్థానాలు మెరుగుపర్చుకుని 36వ స్థానానికి ఎగబాకాడు. శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్‌లో శతక్కొట్టిన పాక్ టీ20 కెప్టెన్ సల్మాన్ అఘా 14 స్థానాలు మెరుగుపర్చుకుని 16వ స్థానానికి చేరాడు.
బౌలర్లలో ఎవరంటే..
అఫ్గానిస్తాన్ స్టార్ బౌలర్ రషీద్ ఖాన్(710) అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఇంగ్లండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్(670) రెండు స్థానాలు మెరుగుపర్చుకుని మూడో స్థానానికి చేరాడు. భారత్ నుంచి టాప్-10లో కుల్దీప్ యాదవ్ ఒక్కడే ఉన్నాడు. అతడు 634 పాయింట్లతో ఆరో స్థానంలో కొనసాగుతున్నాడు. ఆల్‌రౌండర్స్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా ప్లేయర్ అక్షర్ పటేల్ తన ఎనిమిదో స్థానాన్ని నిలబెట్టుకున్నాడు.
ఇవి కూడా చదవండి
రెండో పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన రషీద్ ఖాన్
రో-కో దేశవాళీల్లో ఆడాల్సిందే: బీసీసీఐ
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి