IND vs SA: ఈ టూర్ కఠినమైనదే: కేశవ్ మహరాజ్
ABN , Publish Date - Nov 12 , 2025 | 04:50 PM
టీమిండియాతో టెస్ట్ సిరీస్ నేపథ్యంలో సౌతాఫ్రికా స్టార్ స్పిన్నర్ కేశవ్ మహరాజ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. భారత్‌లో భారత్‌ను ఓడించడం కష్టమేనని.. కానీ మేం ఈసారి సిరీస్ గెలుస్తామని ఆశాభావం వ్యక్తం చేశాడు.
ఇంటర్నెట్ డెస్క్: సౌతాఫ్రికా ప్రస్తుతం భారత పర్యటనలో ఉంది. టీమిండియా(Team India)తో రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడనుంది. అయితే గత 15 ఏళ్లుగా సఫారీ సేన భారత గడ్డపై ఒక్క టెస్ట్ మ్యాచ్ కూడా గెలవలేదు. దీంతో ఈసారి ఎలాగైనా టీమిండియాను ఓడించి.. భారత్‌లో సత్తా చాటాలని సౌతాఫ్రికా చూస్తోంది. ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికా స్టార్ స్పిన్నర్ కేశవ్ మహరాజ్(Keshav Maharaj) మాట్లాడాడు.
‘భారత్‌లో భారత్‌ను ఓడించడం అంత సులువైన విషయం కాదు. కానీ మేము ఈ సిరీస్ గెలవడానికి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం. మాకు తెలుసు.. ఈ టూర్ చాలా కఠినమైనది అని. భారత్‌లో ఆడటం మాకు పెద్ద పరీక్షే. అయినా మమ్మల్ని మేం నిరూపించుకోవడానికి ఇదో అద్భుత అవకాశం. పాకిస్తాన్‌లో ఉన్నట్లుగా ఇక్కడ పూర్తి స్పిన్ ఫ్రెండ్లీ పిచ్ ఉంటుందని నేను అనుకోవడం లేదు. భారత్‌లో మంచి పిచ్‌లు ఉంటాయి. ఆట సాగుతున్న కొద్దీ వాటి స్వభావాలు మారుతుండొచ్చు’ అని కేశవ్ వెల్లడించాడు. అయితే ఇటీవల పాకిస్తాన్‌తో జరిగిన టెస్టు సిరీస్‌ను సఫారీ సేన 1-1తో డ్రా చేసుకున్న సంగతి తెలిసిందే.
టీమిండియా అద్బుతమైన జట్టు..
‘వెస్టిండీస్ సిరీస్‌లో కూడా మంచి పిచ్‌ల మీదే మ్యాచ్‌లు జరిగాయి. ఆట నాలుగు నుంచి ఐదు రోజుల వరకు సాగింది. అలాగే టీమిండియా అద్భుతమైన జట్టు. వారు క్రికెట్‌లో ఎంతో దూరం ప్రయాణించారు. వెస్టిండీస్ సిరీస్‌ను చూసి.. ఇప్పుడు కూడా మంచి పిచ్‌లే ఉంటాయని అనుకుంటున్నా. అయితే మేం పాకిస్తాన్‌తో జరిగిన రెండో టెస్టు స్ఫూర్తితో భారత్‌లో అడుగు పెట్టాం. టాస్‌తో సంబంధం లేకుండా మేం విజయం కోసం పోరాడాం. గత డబ్ల్యూటీసీ సైకిల్‌లో ఎలాంటి పోరాటపటిమ కనబరిచామో.. ఇప్పుడు కూడా అదే దారిలో ముందుకు సాగుతున్నాం’ అని కేశవ్ మహరాజ్ తెలిపాడు. అయితే కోల్‌కతా వేదికగా టీమిండియా-సౌతాఫ్రికా మధ్య తొలి టెస్ట్ నవంబర్ 14న, గువాహటి వేదికగా రెండో టెస్ట్ నవంబర్ 22న ప్రారంభం కానున్నాయి.
ఇవి కూడా చదవండి
రెండో పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన రషీద్ ఖాన్
రో-కో దేశవాళీల్లో ఆడాల్సిందే: బీసీసీఐ
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి