MS Dhoni: క్రేజీ మూమెంట్.. ఫ్యాన్ బైక్‌పై ధోనీ ఆటోగ్రాఫ్
ABN , Publish Date - Nov 09 , 2025 | 03:51 PM
భారత క్రికెట్ దిగ్గజం ధోనీ ఏ పని చేసినా ఇట్టే వైరల్ అవుతూ ఉంటుంది. తాజాగా తన అభిమాని బైక్‌తో పాటు అతడి చేతిపై ఆటోగ్రాఫ్ చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇంటర్నెట్ డెస్క్: మహేంద్ర సింగ్ ధోనీ.. క్రికెట్ నుంచి దూరంగా ఉన్నా తన క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు పలికిన మాహీ.. ఐపీఎల్ మాత్రం ఆడుతున్నాడు. అతడు చెన్నై సూపర్‌కింగ్స్ (సీఎస్‌కే) జెర్సీ వేసుకున్నప్పుడల్లా అభిమానులు ఎప్పటిలాగే ఉర్రూతలూగిపోతారు. తాజాగా ధోనీ ఒక వీడియోతో మళ్లీ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాడు.
బైక్‌పై ఆటోగ్రాఫ్..
ఒక అభిమాని తన బైక్‌పై ధోనీ(MS Dhoni) ఆటోగ్రాఫ్ అడిగాడు. కెప్టెన్ కూల్ వెంటనే సంతకం చేశాడు. అంతటితో ఆగకుండా ఆ ఫ్యాన్ తన చేతిపైన కూడా ఆటోగ్రాఫ్ ఇవ్వమని కోరాడు. ‘ఎలా అయినా పర్లేదు సర్.. సైన్ చేయండి చాలు’ అని ఆ ఫ్యాన్ అడిగాడు. ధోనీ మాత్రం ‘లేదు.. నువ్వే చెప్పు ఎలా కావాలో. నువ్వు చెప్పినట్లే చేస్తా’ అంటూ ఆత్మీయంగా స్పందించాడు. ఆపై ఆ అభిమాని చెప్పినట్లుగా ఆటోగ్రాఫ్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా(Social Media)లో తెగ వైరల్ అవుతోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన 24 గంటల్లోనే రెండు లక్షల మంది లైక్స్ కొట్టారు.
ఐపీఎల్‌లో ఆడనున్నాడు..
ఐపీఎల్(IPL)లో మాత్రమే కొనసాగుతున్న ధోనీ.. ప్రతి సీజన్ తర్వాత దీనికి కూడా రిటైర్‌మెంట్ ప్రకటిస్తాడంటూ వార్తలు వస్తుంటాయి. గత సీజన్ తర్వాత ధోనీ గాయపడటం ఈ వార్తలకు బలానిచ్చింది. అయితే ఈ విషయంపై తాజాగా సీఎస్కే(CSK) సీఈవో కాశీ విశ్వనాథన్ ఓ క్లారిటీ ఇచ్చాడు. ‘ఐపీఎల్ 2026లో ధోనీ ఆడతాడు. ఈ విషయం తలా స్వయంగా నాతో చెప్పాడు. ధోనీ ఆట ఇంకా ముగియలేదు. ఇప్పుడే అతడు రిటైర్ అయ్యే అవకాశాలు లేవు’ అని తెలిపాడు. 2025 ఐపీఎల్‌లో రుతురాజ్ గైక్వాడ్ గాయపడటంతో జట్టు పగ్గాలు మళ్లీ ధోనీనే తీసుకున్న విషయం తెలిసిందే. జట్టు ఆశించిన స్థాయిలో ఆడకపోయినా అభిమానుల గుండెల్లో తన స్థానం పదిలం.
ఇవి కూడా చదవండి:
అన్నీసార్లు దూకుడు పనికిరాదు: ఇర్ఫాన్ పఠాన్
గంగూలీ ఐసీసీ ఛైర్మన్ అవుతాడు: మమతా బెనర్జీ
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి