Irfan Pathan: అన్నీసార్లు దూకుడు పనికిరాదు: ఇర్ఫాన్ పఠాన్
ABN , Publish Date - Nov 09 , 2025 | 02:11 PM
టీమిండియా స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మను మాజీ ఆటగాడు ఇర్ఫాన్ పఠాన్ హెచ్చరించాడు. అన్నిసార్లు దూకుడుగా ఆడటం పనికి రాదని స్పష్టం చేశాడు. ఆ దూకుడుతనం ప్రత్యర్థి బౌలర్లకు అనుకూలంగా మారుతుందని తెలిపాడు.
ఇంటర్నెట్ డెస్క్: భారత క్రికెట్‌లో అభిషేక్ శర్మ(Abhishek Sharma) ఓపెనర్‌గా వచ్చి అదరగొడుతున్న విషయం తెలిసిందే. క్రీజులోకి వచ్చాడంటే తనదైన షాట్లతో బౌలర్లపై విరుచుకుపడుతున్నాడు. ఈ యువ ఆటగాడి దూకుడును ఆసీస్ బౌలర్లు వైవిధ్యభరితమైన బంతులతో కాస్త కట్టడి చేశారు. అయినా ఆసీస్‌తో ఐదు టీ20ల సిరీస్‌లో అభిషేక్ శర్మనే టాప్ స్కోరర్. 176.34 స్ట్రైక్‌రేట్‌తో 163 పరుగులు చేసి ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’గా నిలిచాడు. ఈ నేపథ్యంలో దూకుడు అన్ని సార్లు పనికి రాదంటూ భారత మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్(Irfan Pathan) అభిషేక్‌కు వార్నింగ్ ఇచ్చాడు.
‘అభిషేక్ శర్మ బ్యాటింగ్‌లో భయం కనపడదు. దూకుడు ప్రదర్శిస్తాడు. భారీ షాట్లు ఆడతాడు.. ఇంతవరకు బాగానే ఉంది. కానీ, ప్రస్తుతం జరుగుతున్నవి ద్వైపాక్షిక సిరీస్‌లు.. ప్రపంచ కప్ కాదు. వరల్డ్ కప్‌నకు జట్లు చాలా సన్నాహాలతో వస్తాయి. ఇప్పుడు అభిషేక్ ప్రతి బంతిని క్రీజు వదిలి బయటకు వచ్చి ఆడాలనుకుంటే ప్రత్యర్థి జట్టు బౌలర్లు దీనిపైనే దృష్టి పెడతారు. కాబట్టి, అభిషేక్ షాట్ల ఎంపికలో జాగ్రత్త వహించాలి. టీమ్ మేనేజ్‌మెంట్ కచ్చితంగా దీనిపై ఫోకస్ పెడుతుందని అనుకుంటున్నా. అతడి వ్యక్తిగత కోచ్ యువరాజ్ సింగ్ కూడా ఈ విషయంపై దృష్టి పెట్టాలి. యూవీతో నేను మాట్లాడతా. ఆ దూకుడు అన్నిసార్లూ పనికిరాదు. అందరి బౌలింగ్‌లో ఇన్నింగ్స్ తొలి బంతికే ముందుకు వచ్చి భారీ షాట్ ఆడటం కష్టం’ అని ఇర్ఫాన్ పఠాన్ హెచ్చరించాడు.
హై రిస్క్ క్రికెట్ ప్రమాదకరం..
ఆస్ట్రేలియాతో ఐదో టీ20 వర్షం కారణంగా రద్దయింది. టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన టీమిండియా.. 4.5 ఓవర్లు ఆడింది. అనంతరం వర్షం కురవడంతో మ్యాచ్‌ను నిలిపేశారు. ఈ ఇన్నింగ్స్‌లో 13 బంతుల్లో 23 పరుగులు చేసిన అభిషేక్.. రెండుసార్లు ఆసీస్ ఫీల్డర్లు సులువైన క్యాచ్‌లు వదిలేయడంతో ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఈ విషయంపై కూడా ఇర్ఫాన్ స్పందించాడు.
‘ఐదో టీ20లో రెండుసార్లు అభిషేక్‌కు లైఫ్ వచ్చింది. అందులో ఏ ఒక్క క్యాచ్ పట్టినా అతడి ఇన్నింగ్స్ ముగిసేది. అతడు హై రిస్క్ క్రికెట్ ఆడుతూనే ఉంటాడు. అది ఎప్పటికైనా ప్రమాదమే. కానీ దూకుడుకు కూడా ఓ హద్దు ఉండాలి. ఈ విషయంలో అతడికి కొంత ప్రణాళిక అవసరం. సిరీస్ ఆరంభం నుంచి నాథన్ ఎల్లిస్ తన బౌలింగ్‌లో మార్పులు చేస్తూ అభిషేక్‌ను ఇబ్బంది పెట్టాడు. ఇతర జట్లు కూడా అతడు క్రీజులో ఉన్నప్పుడు ఇదే వ్యూహాన్ని అనుసరించాలని చూస్తాయి’ అని ఇర్ఫాన్ వివరించాడు.
ఇవి కూడా చదవండి:
గంగూలీ ఐసీసీ ఛైర్మన్ అవుతాడు: మమతా బెనర్జీ
‘ఇంపాక్ట్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ ఎవరంటే?
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి