Share News

Mamata Banerjee: గంగూలీ ఐసీసీ ఛైర్మన్ అవుతాడు: మమతా బెనర్జీ

ABN , Publish Date - Nov 09 , 2025 | 01:11 PM

పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ.. భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన భవిష్యత్తులో ఐసీసీ ఛైర్మన్ పదవిని చేపడతారనే నమ్మకం ఉందని తెలిపారు.

Mamata Banerjee: గంగూలీ ఐసీసీ ఛైర్మన్ అవుతాడు: మమతా బెనర్జీ
Mamata Banerjee

ఇంటర్నెట్ డెస్క్: ఐసీసీ మహిళల వన్డే ప్రపంచ కప్ 2025లో టీమిండియా(Team India) ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన రిచా ఘోష్‌ను పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ(Mamata Banerjee) సన్మానించారు. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన ఈ కార్యక్రమానికి భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ(Sourav Ganguly) కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా సౌరవ్ గంగూలీ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.


ఆ పదవికి దాదా అర్హుడు..

‘సౌరవ్ గంగూలీ భారత జట్టు కెప్టెన్‌గా ఎక్కువ కాలం కొనసాగాలని మేము ఎప్పుడూ కోరుకునే వాళ్లం. ఈరోజు ఐసీసీ అధ్యక్షుడిగా గంగూలీ ఉండాల్సింది. దాదా ఈ పదవికి పూర్తిగా అర్హుడు. ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులో ఏదో ఒక రోజు ఈ పదవిలో గంగూలీ ఉంటారని ఆశిస్తున్నా’ అని సీఎం మమతా బెనర్జీ అన్నారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యాయి.


ఐసీసీ అధ్యక్ష రేసులో గంగూలీ..

గతంలో గంగూలీకే తదుపరి ఐసీసీ అధ్యక్ష పదవి దక్కుతుందని అంతా భావించారు. అయితే అనూహ్యంగా ఆ పదవిని జై షా చేపట్టారు. బీసీసీఐ కార్యదర్శిగా నాలుగేళ్ల పదవీకాలం పూర్తి చేసుకున్న షా.. డిసెంబర్ 2024లో అత్యంత పిన్న వయస్కుడు అయిన ఐసీసీ అధ్యుక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. అక్టోబర్ 2019 నుంచి సెప్టెంబర్ 2022 వరకు సౌరవ్ గంగూలీ, షా బీసీసీఐలో కలిసి పని చేశారు. గంగూలీ బీసీసీఐ అధ్యక్ష పదవి రేసు నుంచి వైదొలిగిన తర్వాత.. షా గ్లోబల్ క్రికెట్ బాడీకి నాయకత్వం వహించారు. గంగూలీ తదుపరి ఛైర్మన్ అవుతారని భావించినప్పటికీ.. ఆయన అకస్మాత్తుగా ఆ రేసు నుంచి వైదొలగడం అప్పట్లో రాజకీయ చర్చకు దారి తీసింది.


రిచా ‘డీఎస్పీ’

మహిళా ప్రపంచ కప్ గెలిచిన తొలి పశ్చిమ బెంగాల్ క్రికెటర్‌గా రిచా ఘోష్(Richa Ghosh) రికార్డు సృష్టించింది. దీంతో మమత ప్రభుత్వం రిచాకు ‘బంగభూషణ్’ పురస్కారంతో పాటు డీఎస్పీ(DSP) పదవి నియామక పత్రంతో సత్కరించింది.ప్రపంచ కప్ ఫైనల్‌లో రిచా చేసిన ప్రతి పరుగుకు రూ.లక్ష చొప్పున.. మొత్తం రూ.34లక్షల నగదును అందించారు.


ఇవి కూడా చదవండి:

‘ఇంపాక్ట్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ ఎవరంటే?

ఫామ్‌లో ధ్రువ్ జురెల్.. నితీశ్‌పై వేటు?

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Nov 09 , 2025 | 01:19 PM