Ind vs SA: ఫామ్‌లో ధ్రువ్ జురెల్.. నితీశ్‌పై వేటు?
ABN , Publish Date - Nov 09 , 2025 | 11:37 AM
సౌతాఫ్రికాతో స్వదేశంలో జరగనున్న టెస్టు సిరీస్‌కు టీమిండియా ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డిని పక్కన పెట్టనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అతడి స్థానంలో సూపర్ ఫామ్‌లో ఉన్న ధ్రువ్ జురెల్‌ను తీసుకోనున్నట్లు సమాచారం.
ఇంటర్నెట్ డెస్క్: నవంబర్ 14 నుంచి స్వదేశంలో సౌతాఫ్రికాతో రెండు టెస్టుల సిరీస్ జరగనుంది. ఈ ఏడాది ఇంగ్లండ్ గడ్డపై జరిగిన టెస్టు సిరీస్‌లో గాయపడిన రిషభ్ పంత్(Rishabh Pant) కోలుకున్నాడు. దీంతో తుది జట్టులో స్థానం ఖాయం అనే అనిపిస్తుంది. మరోవైపు పంత్ లేనప్పుడు వికెట్ కీపర్‌గా ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కించుకున్న ధ్రువ్ జురెల్(Dhruv Jurel) ఫామ్‌లో ఉన్నాడు. అయితే.. టీమిండియా ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి(Nitish Kumar)ని తుది జట్టు నుంచి తప్పిస్తారా? అనే సందేహం మొదలైంది.
ధ్రువ్ జురెల్‌కు బంపరాఫర్..
దక్షిణాఫ్రికా-ఏతో జరుగుతున్న రెండో అనధికార టెస్టులో జురెల్ రెండు సెంచరీలు(132*, 127*) బాదాడు. అంతకు ముందు వెస్టిండీస్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లోనూ ఓ సెంచరీ చేశాడు. దీంతో ఇప్పుడు తుది జట్టు ఎంపిక టీమ్ మేనేజ్‌మెంట్‌కు సవాలుగా మారింది. ఫామ్‌లో ఉన్న జురెల్‌ను ఆడించకపోతే విమర్శలు ఎదుర్కోక తప్పదు. ఈ నేపథ్యంలోనే టీమ్ మేనేజ్‌మెంట్ నితీశ్ కుమార్ రెడ్డిని తుది జట్టు నుంచి తప్పించి ధ్రువ్ జురెల్‌ను స్పెషలిస్ట్ బ్యాటర్‌గా ఆడించాలని నిర్ణయించినట్లు సమాచారం.
‘జురెల్ స్పెషలిస్ట్ బ్యాటర్‌గా ఆడే అవకాశం ఉంది. అతడు టాప్, లోయర్ ఆర్డర్లలో ఆడటానికి సరిపోతాడు. కానీ ప్రస్తుతం ఆ స్థానంలో ఉన్న సాయి సుదర్శన్ గత టెస్టులో హాఫ్ సెంచరీ చేశాడు. అంతే కాకుండా మూడో స్థానం కోసం ప్రయోగాలు చేయొద్దని టీమ్ మేనేజ్‌మెంట్ కోరుకుంటుంది. మరొక స్థానం నితీశ్ కుమార్ రెడ్డిది. భారత గడ్డపై జరిగే మ్యాచుల్లో అతని బౌలింగ్ పెద్దగా అవసరం లేదు. కాబట్టి జురెల్‌ను కాదని నితీశ్‌ను ఆడించలేము’ అని బీసీసీఐ వర్గాలు తెలిపినట్లు సమాచారం.
Ind Vs SA: భారత తుది జట్టు(అంచనా)
యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్), ధ్రువ్ జురేల్, రవీంద్ర జడేజా , వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా.
ఇవి కూడా చదవండి:
ధోనీ రికార్డు సమం చేసిన డికాక్
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి