IPL 2026: ఆ ఐదుగురు ఔట్!
ABN , Publish Date - Nov 09 , 2025 | 10:50 AM
ఐపీఎల్ 2026 మినీ వేలానికి ముందు ఢిల్లీ క్యాపిటల్స్ ఐదుగురు ఆటగాళ్లను రిలీజ్ చేయాలని నిర్ణయించిన్నట్లు తెలుస్తుంది. ఈ జాబితాలో మిచెల్ స్టార్క్, ఫాప్ డుప్లెసిస్, జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్, ముఖేశ్ కుమార్, నటరాజన్ ఉన్నట్లు సమాచారం.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026(IPL 2026)కు సన్నాహాలు మొదలయ్యాయి. వచ్చే నెలలో మినీ వేలం జరగనుంది. అయితే ఈ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals) ఫ్రాంచైజీ ఐదుగురు ప్లేయర్లను రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ లిస్ట్‌లో డేంజర్ బ్యాటర్స్, పేసర్ ఉన్నట్లు సమాచారం.
నిలకడలేమితో..
ఢిల్లీ క్యాపిటల్స్(DC) జట్టు చాలా కాలంగా నిలకడ లేమితో ఇబ్బంది పడుతుంది. ఆ జట్టుకు ఇదే అతిపెద్ద బలహీనత. రికీ పాంటింగ్ శిక్షణలో అద్భుతంగా రాణించిన ఢీసీ.. ఆ తర్వాత గాడీ తప్పింది. అయితే ఈ ఏడాది అయినా డీసీ సెమీస్ చేరాలంటే.. కొన్ని మార్పులు తప్పనిసరి అని ఐపీఎల్ 2025 ద్వారా స్పష్టమైంది. పేలవ ప్రదర్శన కనబర్చిన ఆటగాళ్లను రిలీజ్ చేసి.. ఆ ఖాళీ పర్సుతో ప్రభావవంతమైన ప్లేయర్లను జట్టులోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది.
గత సీజన్‌లో..
గత సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ చాలా కొత్తగా కనిపించింది. కొత్త యాజమాన్యం, కోచింగ్ సిబ్బందితో పాటు కెప్టెన్ కూడా మారాడు. గతేడాది డీసీకి అక్షర్ పటేల్ కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. లీగ్ దశలో తొలుత ఈ జట్టు అద్భుత ప్రదర్శన కనబర్చింది. వరుసగా నాలుగు మ్యాచ్‌లను గెలిచి.. ఐదో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ చేతిలో తృటిలో ఓటమి పాలైంది. ఆరో మ్యాచ్‌లో విజయాన్ని సాధించిన ఢిల్లీ.. ఆపై పూర్తిగా గాడి తప్పింది. తదుపరి ఎనిమిది మ్యాచ్‌ల్లో రెండు మాత్రమే గెలిచింది. అందులో ఒకటి వర్షం కారణంగా రద్దయింది. ఒక పాయింట్, నెట్ రన్ రేట్ కారణంగా టాప్-4 స్థానాన్ని కోల్పోయింది.
ఆ ఐదుగురు ఎవరంటే..?
* మిచెల్ స్టార్క్(Mitchell Starc).. ఐపీఎల్ 2025లో ఢిల్లీ క్యాపిటల్స్ అతడిని రూ.11.75కోట్లకు దక్కించుకుంది. అయితే స్టార్క్ ఇప్పటికే టీ20 ఫార్మాట్‌కు వీడ్కోలు పలికాడు. చివరి నిమిషంలో ఐపీఎల్ నుంచి వైదొలిగే ప్రమాదం లేకపోలేదు.
* జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్(Jake Fraser McGurk).. ఫామ్‌లో అతడిని ఆపడం కష్టమే. గతేడాది ఐదు ఇన్నింగ్స్‌లో 55 పరుగులు మాత్రమే చేశాడు. ప్రస్తుతం అతడి ఫామ్ అంతగా బాలేదు. దీంతో మెక్‌గుర్క్‌ను విడుదల చేసి.. రూ.9కోట్లతో మంచి ఆటగాడిని తీసుకోవాలని చూస్తోంది.
* ముఖేశ్ కుమార్(Mukesh Kumar).. ఈ టీమిండియా పేసర్‌ను గతేడాది వేలంలో డీసీ రూ.8కోట్లకు కొనుగోలు చేసింది. ముఖేశ్ 12 మ్యాచ్‌ల్లో 12 వికెట్లు తీసి 10.32 ఎకానమీతో పరుగులు ఇచ్చాడు. డెత్ ఓవర్లో పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో అతడిని రిలీజ్ చేసి మరో స్టార్ బౌలర్‌ను తీసుకోవాలని ఢిల్లీ చూస్తోంది.
* ఫాప్ డుప్లెసిస్(Faf du Plessis).. ఐపీఎల్ 2025 వేలంలో ఫాఫ్ డుప్లెసిస్‌ను ఢిల్లీ రూ.2 కోట్లకు దక్కించుకుంది. అయితే అతడు పూర్తిగా నిరాశపరిచాడు. 9 మ్యాచ్‌లు ఆడి 22.44 సగటు, 123.92 స్ట్రైక్ రేట్‌తో 202 రన్స్ మాత్రమే చేశాడు.
* నటరాజన్(T Natarajan).. తమిళనాడు ఫాస్ట్ బౌలర్ టి నటరాజన్ కోసం ఢిల్లీ రూ.10.75 కోట్లు ఖర్చు చేసింది. అయితే అతడు కేవలం రెండు మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. పేలవ ప్రదేశంగా కారణంగా నటరాజన్ జట్టులో చోటు సంపాదించలేకపోయాడు. ఇటీవల పలు గాయాలతో ఇబ్బంది పడ్డాడు. ఈ నేపథ్యంలో నటరాజన్‌ను రిలీజ్ చేసేందుకు ఢిల్లీ సిద్ధమైనట్లు సమాచారం.
ఇవి కూడా చదవండి:
ధోనీ రికార్డు సమం చేసిన డికాక్
ఆస్ట్రేలియా విధ్వంసం.. 6 ఓవర్లలో 149 పరుగులు
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి