Share News

Team India: వరుస ఓటములు.. గంభీర్ దిగిపోతాడా?

ABN , Publish Date - Nov 26 , 2025 | 04:08 PM

సౌతాఫ్రికా చేతిలో టీమిండియా సొంతగడ్డపై వైట్‌వాష్‌కు గురైంది. ఈ నేపథ్యంలో తప్పు ఎవరిది? అనే చర్చ మొదలైంది. నెలల వ్యవధిలోనే టీమిండియా సిరీస్‌లు ఓడిపోవడంపై నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. ప్రధాన కోచ్ గంభీర్ దీనికి కారణమనే చర్చ నడుస్తోంది.

Team India: వరుస ఓటములు.. గంభీర్ దిగిపోతాడా?
Gambhir

ఇంటర్నెట్ డెస్క్: సొంతగడ్డపై టీమిండియాను ఓడించడమంటే పర్యాటక జట్లు భయపడేవి. ఓటమి తథ్యమే అన్నట్లు బరిలోకి దిగేవి.. ఇవన్నీ ఒకప్పటి మాటలు. ప్రస్తుతం టెస్టు క్రికెట్‌లో టీమిండియా వెనకబడుతోంది. పర్యాటక జట్లు సైతం భారత్‌లో భారత్‌ను సులువుగా ఓడిస్తున్నాయి. అందుకు న్యూజిలాండ్ చేతిలో క్లీన్ స్వీప్.. తాజాగా సౌతాఫ్రికాతో వైట్ వాష్ పెద్ద ఉదాహరణలు. దీనికి కారణం.. కోచ్ నిర్ణయాలా? ఆటగాళ్ల పేలవ ప్రదర్శనా? సీనియర్ల లేమినా? అనేవి ప్రస్తుతం అందరి మదిలో మెదులుతున్న సందేహాలు.


కారణాలు ఎన్నో?

దక్షిణాఫ్రికాతో వైట్ వాష్ పరాభవానికి బాధ్యులు ఎవరు? ఎవరిపై వేటు పడుతుంది? అనే చర్చ జరుగుతోంది. గంభీర్(Gambhir) కోచ్ అయ్యాకే రెండు వైట్ వాష్‌లు. ఆస్ట్రేలియా సిరీస్ ఓటమి. ఇవి కాక వన్డేల్లో శ్రీలంక చేతిలో 27 ఏళ్ల తర్వాత గతేడాదే భారత్ ఓటమిని చవిచూసింది. ఈ ఏడాది ఆస్ట్రేలియా చేతిలోనూ వన్డే సిరీస్ పరాజయం తప్పలేదు. కిర్‌స్టన్ హయాం నుంచి మొదలుపెడితే.. ఇన్ని ఓటములు ఏ కోచ్ ఖాతాలోనూ లేవు. ఇవన్నీ కేవలం ఏడాది కాలంలో ఎదురైనవి కావడం గమనార్హం. గంభీర్ హయాంలో అనేక సెలక్షన్ నిర్ణయాలు వివాదాస్పదం అయ్యాయి. టెస్టు మ్యాచ్‌లకు పిచ్‌లను తయారు చేయించుకునే విషయంలోనూ ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నాడు. ఇవన్నీ కాక అశ్విన్, రోహిత్, కోహ్లిల రిటైర్‌మెంట్‌కు కారణం గంభీర్ అని ఆరోపణలూ ఉన్నాయి.


గతంలో ఏం జరిగిందంటే?

గత భారత క్రికెట్ చరిత్రను పరిశీలిస్తే.. ఎక్కువ మంది కోచ్‌లు టీమిండియాకు మంచి ఫలితాలే అందించారు. ఒక్క గ్రెస్ చాపెల్ మాత్రమే భారత క్రికెట్‌ను దెబ్బ తీశాడు. ఆ తర్వాత వచ్చిన కోచ్ గ్యారీ కిర్‌స్టన్ జట్టును గొప్ప స్థాయికి తీసుకెళ్లాడు. ఆయన తర్వాత రవిశాస్త్రి, అనిల్ కుంబ్లే, రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) సైతం మంచి ఫలితాలే రాబట్టారు. కానీ గౌతమ్ గంభీర్ కోచ్ అయ్యాక మాత్రం టీమ్ఇండియా ప్రదర్శన దారుణంగా దెబ్బతింది. కెప్టెన్లు మారినా, కోచ్‌లు మారినా, జట్టు మారినా.. పన్నెండేళ్ల పాటు సొంతగడ్డపై ఒక్కటంటే ఒక్క సిరీస్ ఓడిపోని జట్టు.. ఏడాది వ్యవధిలో రెండు టెస్టు సిరీస్‌ల్లో వైట్ వాష్‌కు గురి కావడం అన్నది మామూలు విషయం కాదు.


ఇవి కూడా చదవండి:

బీసీసీఐదే తుది నిర్ణయం.. కోచ్ పదవిపై గంభీర్ కీలక వ్యాఖ్యలు

అందుకే ఓడిపోయాం: పంత్

Updated Date - Nov 26 , 2025 | 04:12 PM