Temba Bavuma: ఈ క్రెడిట్ మా టీమ్ మొత్తానిది.. విజయంపై సౌతాఫ్రికా కెప్టెన్ బావుమా
ABN , Publish Date - Nov 26 , 2025 | 03:20 PM
గువాహటి టెస్టులో టీమిండియాతో జరిగిన రెండో టెస్టులో సౌతాఫ్రికా ఘన విజయం సాధించింది. రెండు టెస్టులు గెలిచి 2-0తో ఆతిథ్య భారత్‌ను క్లీన్ స్వీప్ చేసింది. జట్టు విజయంపై సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బావుమా మాట్లాడాడు.
ఇంటర్నెట్ డెస్క్: గువాహటి టెస్టులో టీమిండియా ఘోరంగా విఫలమైంది. భారీ లక్ష్య ఛేదనకి దిగి.. అదే భారీ తేడాతో ఓటమి పాలైంది. బ్యాటర్లు ఏ ఒక్కరూ క్రీజులో నిలబడలేకపోయారు. రెండు టెస్టుల్లోనూ ఓడి స్వదేశంలో సౌతాఫ్రికా చేతిలో వైట్ వాష్‌కు గురైంది. తొలి నుంచే గెలవాలన్న కసితో సఫారీలు ఆటకు దిగారు. అదే తమ ప్రణాళిక అన్నట్లు గెలుపులో ఆధిక్యాన్ని ప్రదర్శించారు. అనుకున్నదే అయినట్టు 2-0 తేడాతో సిరీస్‌ను సొంతం చేసుకున్నారు. ఈ గెలుపుపై దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బావుమా(Temba Bavuma) మాట్లాడాడు. జట్టు ప్రదర్శనపై ఉప్పొంగిపోయాడు.
‘ఇది మా జట్టుకి మహా విజయం. వ్యక్తిగతంగా నాకు కూడా ఇది ఎంతో ప్రత్యేకం. గాయం బారిన పడిన కొన్ని నెలల పాటు ఆటకు దూరంగా ఉన్నాను. ఆ తర్వాత భారత్‌కు వచ్చి భారత్‌ను 2–0తో ఓడించి సిరీస్ గెలవడం అంటే మాటలు కాదు. గతంలో మా జట్టుకు ఎన్నో చీకటి రోజులు ఉన్నాయి. ఎన్నో పరాభవాలను ఎదుర్కొన్నాం. కానీ, అదే శాశ్వతం కాదు అని అనుకున్నాం. ‘ఓడిపోతాం’ అనే ఆలోచననే లేకుండా మమ్మల్ని మేము తయారు చేసుకున్నాం. జట్టులో ప్రతి ఒక్కరికి మ్యాచ్ దశను మార్చే సామర్థ్యం ఉందన్న నమ్మకంతో బరిలోకి దిగాం. అదే చేసి చూపించాం’ అని బావుమా వెల్లడించాడు.
హర్మర్ వల్లే..
‘పెద్ద శతకాలేవీ లేవు.. కానీ మా బ్యాటర్లు టీమిండియా బౌలర్లను కట్టడి చేయగలిగారు. సైమన్‌కి 2015లో ఇండియాలో ఆడిన అనుభవం ఉంది. కేశవ్‌తో కలిసి స్పిన్ జంటగా అద్భుత ప్రదర్శన చేశాడు. ఈ సిరీస్ అసలు హీరో సైమనే!’ అని బావుమా సైమన్ హర్మర్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు.
ఇవి కూడా చదవండి:
బీసీసీఐదే తుది నిర్ణయం.. కోచ్ పదవిపై గంభీర్ కీలక వ్యాఖ్యలు