Share News

Rishabh Pant Century: చరిత్ర సృష్టించిన పంత్.. 148 ఏళ్లలో ఇదే తొలిసారి!

ABN , Publish Date - Jun 23 , 2025 | 08:24 PM

టీమిండియా స్టార్ వికెట్ కీపర్, వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ చరిత్ర సృష్టించాడు. 148 ఏళ్లలో ఎవ్వరూ చేయలేనిది అతడు సాధించి చూపించాడు.

Rishabh Pant Century: చరిత్ర సృష్టించిన పంత్.. 148 ఏళ్లలో ఇదే తొలిసారి!
Rishabh Pant

భారత జట్టు వికెట్ కీపర్, నయా వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ చరిత్ర సృష్టించాడు. లీడ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మొదటి టెస్ట్‌లో అతడు మరో శతకం బాదాడు. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన పంత్.. రెండో ఇన్నింగ్స్‌లోనూ మూడంకెల మార్క్‌ను అందుకొని రికార్డు సృష్టించాడు. 148 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఒక మ్యాచ్‌లో రెండు సెంచరీలు బాదిన తొలి ఆసియా వికెట్ కీపర్‌‌గా పంత్ నిలిచాడు. కుమార సంగక్కర దగ్గర నుంచి మహేంద్ర సింగ్ ధోని వరకు.. ఏ ఆసియా కీపర్ కూడా ఇది సాధించలేని రికార్డును పంత్ అందుకున్నాడు.


దిగ్గజాల సరసన..

ఓవరాల్‌గా టెస్టుల్లో ఒకే మ్యాచ్‌లో 2 సెంచరీలు బాదిన రెండో వికెట్ కీపర్‌గా రిషబ్ పంత్ నిలిచాడు. అతడి కంటే ముందు జింబాబ్వే దిగ్గజం ఆండీ ఫ్లవర్ ఈ ఘనత సాధించాడు. సౌతాఫ్రికాతో 2001లో జరిగిన టెస్ట్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 142 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 199 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు ఆండీ ఫ్లవర్. టెస్ట్ మ్యాచ్‌లో ద్విశతకాలు బాదిన ఏడో భారత బ్యాటర్‌గానూ పంత్ మరో ఘనతను అందుకున్నాడు. ఈ క్లబ్‌లో ఉన్న దిగ్గజాలు సునీల్ గవాస్కర్, విజయ్ హజారే, రాహుల్ ద్రవిడ్, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, అజింక్యా రహానె సరసన రిషబ్ స్థానం సంపాదించాడు. కాగా, కెరీర్‌లో 44 టెస్టుల్లో 8 సెంచరీలు కొట్టాడు రిషబ్. ఇందులో 6 విదేశాల్లో బాదినవే కావడం విశేషం.


గేర్లు మార్చి..

సెంచరీ తర్వాత గేర్లు మార్చిన పంత్.. మరింత వేగంగా ఆడే క్రమంలో ఔట్ అయ్యాడు. మొత్తంగా 140 బంతుల్లో 15 బౌండరీలు, 3 సిక్సుల సాయంతో 118 పరుగులు చేశాడు. కేఎల్ రాహుల్ (120 నాటౌట్)తో కలసి నాలుగో వికెట్‌కు ఏకంగా 198 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు పంత్. లీడ్స్ టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో భారత్ ప్రస్తుతం 4 వికెట్లకు 298 పరుగులతో పటిష్టంగా ఉంది. జట్టు ఆధిక్యం 304 పరుగులకు చేరుకుంది. చివరి సెషన్‌ను కూడా విజయవంతంగా ముగిస్తే టీమిండియాకు తిరుగుండదనే చెప్పాలి.


ఇవీ చదవండి:

సారీ చెప్పి ఫోర్ కొట్టాడు

కేఎల్ రాహుల్ క్రేజీ రికార్డ్

దంచికొట్టిన సన్‌రైజర్స్ స్టార్

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 23 , 2025 | 08:24 PM