Rishabh Pant: సారీ చెప్పి ఫోర్ కొట్టిన పంత్.. వీడియో చూస్తే నవ్వాగదు!
ABN , Publish Date - Jun 23 , 2025 | 07:43 PM
భారత వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ బ్రేకుల్లేని బుల్డోజర్‌లా దూసుకెళ్తున్నాడు. ప్రత్యర్థుల మీద అతడు విరుచుకుపడుతున్నాడు. పంత్ బ్యాట్ గర్జన మామూలుగా లేదు.

లీడ్స్ టెస్ట్‌లో చెలరేగి బ్యాటింగ్ చేస్తున్నాడు పించ్ హిట్టర్ రిషబ్ పంత్. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ బాదిన టీమిండియా నయా వైస్ కెప్టెన్.. సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ తగ్గేదేలే అంటున్నాడు. ప్రస్తుతం 91 పరుగులతో నాటౌట్‌గా ఉన్న పంత్.. మరో సెంచరీ దిశగా దూసుకెళ్తున్నాడు. బౌండరీల మీద బౌండరీలు కొడుతూ ఇంగ్లండ్ బౌలర్లను ఓ ఆటాడుకుంటున్నాడు. ఇదే క్రమంలో ఆ జట్టు ప్రధాన పేసర్ క్రిస్ వోక్స్‌కు సారీ చెప్పి మరీ ఫోర్ బాదాడు పంత్. ఈ సీన్ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. అసలేం జరిగిందంటే..
క్షమించమంటూ..
రెండో సెషన్ ఆరంభంలో భారీ షాట్లు బాదాలని పంత్ ప్రయత్నించినా ఇంగ్లండ్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో అది కుదర్లేదు. దీంతో టీమిండియా స్టార్ ఎక్కువగా డిఫెన్స్‌కే మొగ్గుచూపాడు. ఈ తరుణంలో వోక్స్ బౌలింగ్ వేయడానికి రాగా.. మధ్యలోనే ఆపేశాడు పంత్. బంతిని ఆడేందుకు సిద్ధంగా లేనంటూ అతడ్ని క్షమాపణ కోరాడు. సారీ వోక్సీ.. అని చెప్పాడు. అయితే ఆ తర్వాతి బంతి గుడ్ లెంగ్త్‌లో పడి లోపలకు దూసుకురావడంతో డిఫెన్స్ చేయలేకపోయాడు రిషబ్. కానీ నెక్స్ట్ డెలివరీకి మాత్రం స్టంప్స్‌ను వదిలేసి ముందుకొచ్చి బౌలర్ పక్క నుంచి బౌండరీ కొట్టాడు. పంత్ టైమింగ్‌కు బంతి బుల్లెట్ వేగంతో ఫోర్ లైన్ దిశగా దూసుకెళ్లింది. ఈ వీడియో చూసిన నెటిజన్స్.. సారీ చెప్పి బౌండరీ కొట్టాడు, పంత్ వెరీ ఫన్నీ అని కామెంట్స్ చేస్తున్నారు. కాగా, ఈ టెస్ట్ నాలుగో రోజు ఆటలో భారత్ ప్రస్తుతం 3 వికెట్లకు 253 పరుగులతో పటిష్ట స్థితిలో ఉంది. జట్టు ఆధిక్యం 259 పరుగులకు చేరుకుంది.
ఇవీ చదవండి:
దంచికొట్టిన సన్‌రైజర్స్ స్టార్
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి