Share News

Gill-Gambhir: మాట తప్పిన గిల్-గంభీర్.. బుమ్రాతో ఆడుకుంటున్నారు!

ABN , Publish Date - Jun 26 , 2025 | 05:18 PM

తొలి టెస్ట్‌ ఓటమితో నిరాశలో ఉన్న భారత్.. రెండో మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ను చావుదెబ్బ తీయాలని చూస్తోంది. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగే ఈ టెస్ట్‌లో నెగ్గి సిరీస్‌ను సమం చేయాలని అనుకుంటోంది.

Gill-Gambhir: మాట తప్పిన గిల్-గంభీర్.. బుమ్రాతో ఆడుకుంటున్నారు!
Jasprit Bumrah

ఏస్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా విషయంలో భారత టీమ్ మేనేజ్‌మెంట్ వ్యవహరిస్తున్న తీరు వివాదాస్పదంగా మారింది. టీమిండియాకు బుమ్రా చాలా కీలకమని.. అతడి సేవల్ని జాగ్రత్తగా వాడుకుంటామని చెబుతూ వచ్చిన కొత్త కెప్టెన్ శుబ్‌మన్ గిల్, హెడ్ కోచ్ గౌతం గంభీర్ మాట తప్పడం చర్చనీయాంశంగా మారింది. అతడి కెరీర్‌తో వాళ్లిద్దరూ ఆడుకుంటున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి కారణం బుమ్రాను హ్యాండిల్ చేస్తున్న తీరు అనే చెప్పాలి. వెన్ను నొప్పి కారణంగా కొన్ని నెలల పాటు అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమైన బుమ్రా.. ఇటీవల ఐపీఎల్‌-2025తో రీఎంట్రీ ఇచ్చాడు. ఇంగ్లండ్ సిరీస్‌లో అతడు ఆడతాడా? లేదా? అనే అనుమానాలు నెలకొన్నాయి. అయితే ఎట్టకేలకు బుమ్రాను ఈ పర్యటనకు ఎంపిక చేసింది బీసీసీఐ. కానీ 3 టెస్టులు మాత్రమే ఆడతాడని సెలెక్టర్లు స్పష్టం చేశారు.


మాటలు వేరు.. రియాలిటీ వేరు..

బుమ్రా కూడా ఈ సిరీస్‌లో 3 టెస్టులే ఆడతానని క్లారిటీ ఇచ్చాడు. దీంతో అతడు లేకుండా మిగిలిన మ్యాచుల్లో భారత బౌలింగ్ దళం ఎలా రాణిస్తుందోనని అంతా ఆలోచనల్లో పడ్డారు. అయితే గిల్-గంభీర్ మాత్రం బుమ్రాను గాయాల బారిన పడకుండా చూసుకుంటామని, అతడితో పరిమితంగా బౌలింగ్ చేయిస్తామని, అవసరమైనప్పుడే బరిలోకి దించుతామని చెబుతూ వచ్చారు. కుదిరితే అన్ని మ్యాచులు ఆడించే అవకాశాలను పరిశీలిస్తున్నామని కూడా పేర్కొన్నారు. కానీ వాస్తవంలో పరిస్థితులు మరోలా ఉన్నాయి. లీడ్స్ టెస్ట్‌లో రెండు ఇన్నింగ్స్‌లు కలిపి భారత్ 182 ఓవర్లు వేస్తే అందులో బుమ్రా సంధించినవి దాదాపుగా 45 ఓవర్లు ఉన్నాయి. పొదుపుగా వాడుకుంటామని చెప్పి మాట తప్పారు గిల్-గంభీర్.


ఇక అంతే సంగతులు..

లీడ్స్ టెస్ట్‌లో 45 ఓవర్లు వేసిన బుమ్రా.. ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా జరిగే రెండో టెస్ట్‌లో బరిలోకి దిగే అవకాశాలు కనిపించడం లేదు. తొలి మ్యాచ్‌లో ఓటమి ఎదురైనందున గెలవాలనే ఉద్దేశంతో ఒకవేళ అతడ్ని ఆడించొచ్చు. అయితే మళ్లీ 40 నుంచి 50 ఓవర్లు వేస్తే బుమ్రా శరీరం ఎంతవరకు తట్టుకుంటుంది? అనేది ప్రశ్నార్థకమే. వెన్ను నొప్పి తిరగబెడితే అతడి కెరీర్‌కే డేంజర్. దీంతో గిల్-గంభీర్‌పై సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. బుమ్రాను ఇలా వాడుకుంటే అతడి కెరీర్ త్వరలో ముగుస్తుందని, గాయాలతో సతమతమయ్యే ఆటగాడ్ని పొదుపుగా వినియోగించాలని సూచిస్తున్నారు. కుదిరితే రెండో టెస్ట్‌కు దూరంగా ఉంచాలని, ఒకవేళ ఆడిస్తే మాత్రం 20 నుంచి 25 ఓవర్ల కంటే ఎక్కువ బౌలింగ్ చేయించొద్దని సూచిస్తున్నారు.


ఇవీ చదవండి:

జైస్వాల్‌ను బద్నాం చేయొద్దు

ఆస్పత్రి బెడ్‌పై సూర్యకుమార్

పంత్‌ 7 కెరీర్‌ అత్యుత్తమ ర్యాంక్‌

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 26 , 2025 | 05:21 PM