Share News

రెండో టెస్ట్‌ కూర్పుపై మల్లగుల్లాలు

ABN , Publish Date - Jun 26 , 2025 | 06:11 AM

హెడింగ్లీ టెస్ట్‌లో చాలావరకూ ఆధిపత్యం ప్రదర్శించి.. పటిష్ట స్థితిలో ఉన్నట్టుగా కనిపించిన టీమిండియా అనూహ్యంగా పరాజయంపాలు కావడం నిజంగా జీర్ణించుకోలేనిదే. కొత్త కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ సేన ఓటమికి...

రెండో టెస్ట్‌ కూర్పుపై మల్లగుల్లాలు

శార్దూల్‌పై వేటు

కుల్దీప్ రాక ఖరారేనా?

కరుణ్‌ నాయర్‌ స్థానంలో నితీశ్‌?

స్వదేశానికి రాణా

న్యూఢిల్లీ: హెడింగ్లీ టెస్ట్‌లో చాలావరకూ ఆధిపత్యం ప్రదర్శించి.. పటిష్ట స్థితిలో ఉన్నట్టుగా కనిపించిన టీమిండియా అనూహ్యంగా పరాజయంపాలు కావడం నిజంగా జీర్ణించుకోలేనిదే. కొత్త కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ సేన ఓటమికి పేస్‌ బౌలర్లే కారణమన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పేస్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌గా జట్టులోకి వచ్చిన శార్దూల్‌ ఠాకూర్‌ తన ఎంపికకు న్యాయం చేయలేకపోయాడు. బ్యాటింగ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 5 పరుగులు మాత్రమే చేసిన శార్దూల్‌, రెండే వికెట్లు పడగొట్టాడు. ఇక ఎనిమిదేళ్ల తర్వాత జట్టులోకి వచ్చిన కరుణ్‌ నాయర్‌ విఫలమయ్యాడు. ఈ నేపథ్యంలో వచ్చే బుధవారం నుంచి బర్మింగ్‌హామ్‌లో జరిగే రెండో టెస్ట్‌లో పాల్గొనే భారత జట్టు కూర్పు మేనేజ్‌మెంట్‌కు పెద్ద సవాల్‌గా మారింది. పని భారం కారణంగా బుమ్రాకు విశ్రాంతినిస్తే బౌలింగ్‌ మరింత బలహీనపడే అవకాశం ఉంది. భారత బౌలర్లలో క్రమశిక్షణ, నిలకడ లోపించిందని పలువురు మాజీలు ఆరోపిస్తున్నారు. ఒకవైపు బుమ్రా తీవ్రంగా శ్రమిస్తున్నా.. ప్రసిద్ధ్‌ కృష్ణ, శార్దూల్‌ చెత్త బంతులతో ఇంగ్లండ్‌కు పుంజుకొనే అవకాశం కల్పించారు. ఈ నేపథ్యంలో రెండో టెస్ట్‌కు శార్దూల్‌ స్థానంలో కుల్దీ్‌పను తీసుకోవాలనే వాదన బలంగా వినిపిస్తోంది. ఒకవేళ కరుణ్‌ నాయర్‌ను పక్కనబెడితే.. నితీశ్‌ కుమార్‌కు చాన్స్‌ దక్కవచ్చు.


అతడే ఎందుకు?

ఎన్నో ఏళ్లుగా జట్టులో కీలకంగా ఉన్న రోహిత్‌, కోహ్లీ, అశ్విన్‌ లేకుండా భారత్‌ తొలిసారి బరిలోకి దిగింది. అయితే, బ్యాటింగ్‌ విభాగం ఫర్వాలేదనిపించినా.. అశ్విన్‌ లేని లోటు కనిపించింది. జడేజా కూడా పెద్దగా ప్రభావం చూపలేక పోయాడు. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్‌ బ్యాటర్లను కట్టడి చేయాలంటే ఏదో మ్యాజిక్‌ చేయగల స్పిన్నర్‌ అవసరం. అనుభవంతోపాటు వికెట్లు పడగొట్టగల నేర్పు కూడా ఉన్న కుల్దీ్‌ప యాదవ్‌తోనే అది సాధ్యమని మాజీలు సూచిస్తున్నారు. అవసరమైతే అతడి కోసం పేసర్‌నైనా త్యాగం చేయాలని చెబుతున్నారు. కాగా, బుమ్రాకు విశ్రాంతినిచ్చే పక్షంలో అర్ష్‌దీ్‌పను తీసుకోవచ్చని చెబుతున్నారు.

సుదర్శన్‌కు గాయం?

తొలి టెస్టులో ఓడిన భారత్‌కు మరో చేదు వార్త. హెడింగ్లీలో అరంగేట్రం చేసిన బ్యాటర్‌ సాయి సుదర్శన్‌కు గాయమైనట్టు సమాచారం. ఫీల్డింగ్‌ చేస్తుండగా అతడి భుజానికి దెబ్బతగిలినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బర్మింగ్‌హామ్‌లో జరిగే రెండో టెస్ట్‌కు అతడు ఫిట్‌గా లేడట. కాగా, కవర్‌గా ఇంగ్లండ్‌లోనే ఉంచిన పేసర్‌ హర్షిత్‌ రాణాను మేనేజ్‌మెంట్‌ విడుదల చేసింది. రెండో టెస్ట్‌కు అతడు జట్టుతో ఉండబోడని బోర్డు అధికారి ఒకరు చెప్పారు.

బుమ్రాపై మరో ఆలోచన లేదు

తొలి టెస్ట్‌లో ఓటమితో భారత జట్టు ప్రణాళికల్లో మార్పులుంటాయని భావించారు. బుమ్రా మూడు కంటే ఎక్కువ టెస్ట్‌లు ఆడే అవకాశం ఉందనే టాక్‌ వినిపిస్తోంది. అయితే, అలాంటిదేమీ లేదని విలేకరుల సమావేశంలో కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌ స్పష్టం చేశాడు. ‘మా ప్రణాళికల్లో ఎటువంటి మార్పు లేదు. పనిభారం పడకుండా బుమ్రాను కాపాడుకోవడం ఎంతో ముఖ్యం. అతడు జట్టులో ఉంటే పరిస్థితులు ఎలా ఉంటాయో తెలిసిందే. బుమ్రా మూడు మ్యాచ్‌లే ఆడతాడని ముందుగానే నిర్ణయం తీసుకొన్నామ’ని గంభీర్‌ తెలిపాడు. బుమ్రా గైర్హాజరీలో మిగతా బౌలర్లు ఆ బాధ్యత తీసుకొంటారని తాను భావిస్తున్నట్టు చెప్పాడు. ప్రతి టెస్ట్‌కు బౌలర్లపై తీర్పులు ఇచ్చుకొంటూ పోతే.. వారు మెరుగుపడేది ఎలా? అని ఎదురు ప్రశ్నించాడు. రెండు ఇన్నింగ్స్‌లోనూ శతకాలు బాదిన రిషభ్‌ పంత్‌ను ప్రత్యేకంగా ప్రశంసించేందుకు గౌతీ ఆసక్తి చూపలేదు. మరో ముగ్గురు కూడా సెంచరీలు చేశారన్నాడు. జట్టు ఓడినప్పుడు దేనికీ విలువ ఉండదని చెప్పాడు.


కుల్దీప్ ను తీసుకోవాల్సిందే!

బుమ్రా ఫిట్‌గా ఉన్నా..లేకపోయినా? కుల్దీ్‌పను మాత్రం తుది జట్టులోకి తీసుకోవాలి. బర్మింగ్‌హామ్‌ పిచ్‌ ఎంతో కొంత స్పిన్నర్లకు అనుకూలం. శార్దూల్‌ స్థానంలో కుల్దీ్‌పకు చోటిస్తారని విశ్వసిస్తున్నా. సుందర్‌కు కూడా చాన్సిస్తే బాగుంటుంది.

నాలుగో పేసర్‌గా నితీశ్‌ కష్టం : మంజ్రేకర్‌

శార్దూల్‌ బయటకెళ్లాలి.. కుల్దీప్‌ జట్టులోకి రావాలి. ఈ మార్పు జరిగి తీరాల్సిందే. ఆస్ట్రేలియా ప్రదర్శన ఆధారంగానే తొలి టెస్ట్‌లో నితీశ్‌ కుమార్‌కు నా మద్దతు తెలిపా. వాస్తవంగా అయితే అది అంత మంచి నిర్ణయం కాదు. ఎందుకంటే నాలుగో సీమర్‌ తరహాలో నితీశ్‌ బౌలింగ్‌ చేయలేడు. ఇంగ్లండ్‌ వికెట్‌పై నాణ్యమైన బౌలర్లు కావాల్సిందే.

బుమ్రా స్థానంలో అర్ష్‌దీప్‌: సిద్ధూ

మణికట్టు స్పిన్నర్‌ కుల్దీప్‌ భారత బౌలింగ్‌లో వైవిధ్యాన్ని తీసుకురాగలడు. బుమ్రాకు విశ్రాంతినిస్తే అర్ష్‌దీ్‌పను తీసుకోవాలి. అతడైతే కుల్దీప్‌ కోసం పిచ్‌పై ప్యాచ్‌లు చేయగలడు. లియాన్‌ కోసం ఆస్ట్రేలియా పేసర్‌ స్టార్క్‌ ఇలాగే చేస్తాడు.

గిల్‌ కెప్టెన్సీ ఆ స్థాయిలో లేదు: నాసిర్‌

రోహిత్‌, కోహ్లీ వారసుడిగా సారథ్యాన్ని అందుకొన్న శుభ్‌మన్‌ గిల్‌ ఆ స్థాయిలో జట్టు పై పట్టు సాధించలేదు. పరిస్థితులకు అనుగుణంగా అతడిలో స్పందన కనిపించడంలేదు. జట్టు కెప్టెన్‌ ఎవరు అంటే ఇద్దరో ముగ్గురో అన్నట్టుగా ఉంది. కోహ్లీ, రోహిత్‌ ఉన్నప్పుడు పరిస్థితి అలా ఉండేదా? వారి బ్యాటింగ్‌ ఇలా ఒక్కసారిగా కుప్పకూలితే సిరీస్‌ కోల్పోతారు.

ఈ సిరీస్‌లో కోహ్లీ ఆడివుంటేనా...

ఈ సిరీస్‌లో కోహ్లీ ఆడి ఉంటే భారీగా పరుగులు సాధించేవాడని టీమిండియా మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ అన్నాడు. అతడి వయసు, ఫిట్‌నెస్‌ రీత్యా టెస్ట్‌లకు రిటైర్మెంట్‌ ప్రకటించడం ఎంతో ఆశ్చర్యం కలిగించిందని చెప్పాడు. ‘ఐదేళ్లుగా అతడి ప్రదర్శన అంతంత మాత్రంగానే ఉన్నా.. విరాట్‌ లాంటి వాళ్లు తమను తాము కొత్తగా ఆవిష్కరించుకోగలరు. ఇంగ్లండ్‌ టూర్‌కు అతడు వచ్చుంటే తప్పకుండా పరుగుల వరద పారించేవాడు. కానీ, విరాట్‌ మాత్రం ఇక చాలు అని అనుకొన్నాడ’ని గంగూలీ అన్నాడు.

ఇవీ చదవండి:

రిషభ్ పంత్ సెంచరీ చేస్తే అదే జరుగుతుందా.. టీమిండియా ఓటమికి అతడే కారణమా..

బుమ్రా రెండో టెస్ట్ ఆడతాడా.. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఏం చెప్పాడంటే..

శుభ్‌మన్ గిల్ చెత్త రికార్డు.. టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే టీమిండియా ఓటమి ఎలాంటిదంటే..

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 26 , 2025 | 06:15 AM