IND vs ENG: టీమిండియా తిరుగులేని స్కెచ్.. త్రీ-టూ ఫార్ములాతో బరిలోకి!
ABN , Publish Date - Jun 27 , 2025 | 02:55 PM
ఇంగ్లండ్ పని పట్టేందుకు సిద్ధమవుతోంది టీమిండియా. అందుకోసం త్రీ-టూ ఫార్ములాతో ముందుకెళ్లాలని చూస్తోంది. మరి.. ఈ ఫార్ములా ఏంటో ఇప్పుడు చూద్దాం..

లీడ్స్ టెస్ట్‌లో ఓటమితో నిరాశకు గురైన భారత జట్టు.. ఇంగ్లండ్‌ను దెబ్బకు దెబ్బ తీయాలని చూస్తోంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లాంటి దిగ్గజ బ్యాటర్లు లేకపోయినా బ్యాటింగ్‌లో కుర్రాళ్లు అదరగొట్టారు. యశస్వి జైస్వాల్, శుబ్‌మన్ గిల్, రిషబ్ పంత్, కేఎల్ రాహుల్.. ఇలా బ్యాటర్లు చెలరేగి ఆడారు. అయితే జస్‌ప్రీత్ బుమ్రా నేతృత్వంలోని బౌలింగ్ దళం మాత్రం అంచనాలను అందుకోలేకపోయింది. బౌలర్ల వైఫలమ్యే జట్టును ముంచేసింది. ఈ నేపథ్యంలోనే ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగే రెండో టెస్ట్ కోసం ప్లాన్‌ను పూర్తిగా మార్చేసిందట భారత్. త్రీ-టూ ఫార్ములాతో ఆతిథ్య జట్టుకు చెక్ పెట్టాలని నిర్ణయించిందట. మరి.. టీమిండియా వ్యూహం గురించి మరింతగా తెలుసుకుందాం..
ప్లాన్ చేంజ్..
తొలి టెస్ట్‌లో నలుగురు పేసర్లు, ఒక స్పిన్నర్‌తో బరిలోకి దిగింది భారత్. బుమ్రా, సిరాజ్, ప్రసిద్ధ్, శార్దూల్ పేస్ బాధ్యతల్ని పంచుకోగా.. జడేజా ఏకైక స్పిన్నర్‌గా ఆడాడు. కానీ ఈ వ్యూహం బెడిసికొట్టింది. తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లతో చెలరేగిన బుమ్రా.. రెండో ఇన్నింగ్స్‌లో వికెట్లు తీయలేకపోయాడు. అతడ్ని జాగ్రత్తగా ఆడిన ఇంగ్లండ్ బ్యాటర్లు.. ప్రసిద్ధ్, శార్దూల్ బౌలింగ్‌లో భారీగా పరుగులు పిండుకున్నారు. సిరాజ్, జడేజా కట్టుదిట్టంగా బౌలింగ్ చేసినా వికెట్లు తీయలేకపోయారు. ప్రసిద్ధ్-శార్దూల్ బ్రేక్‌త్రూలు అందించినా భారీగా పరుగులు సమర్పించుకోవడం జట్టుకు బిగ్ మైనస్‌గా మారింది. ఈ నేపథ్యంలో ఎడ్జ్‌బాస్టన్ టెస్ట్‌లో వీళ్ల స్థానాల్లో లెఫ్టార్మ్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్, చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్‌ను బరిలోకి దించాలని కెప్టెన్ గిల్-కోచ్ గంభీర్ భావిస్తున్నారట.
పర్ఫెక్ట్ లాజిక్‌తో..
తొలి టెస్ట్‌లో 45 ఓవర్లు వేసిన బుమ్రాను ఎడ్జ్‌బాస్టన్‌లో ఆడించడం అనుమానంగా మారింది. వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌లో భాగంగా అతడికి విశ్రాంతి ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. అదే జరిగితే రెండో టెస్ట్‌లో బుమ్రా స్థానంలో అర్ష్‌దీప్, శార్దూల్ బెర్త్‌లో కుల్దీప్‌ను రీప్లేస్ చేయొచ్చు. దీని వల్ల ప్రసిద్ధ్ సేఫ్ అవుతాడు. తద్వారా సిరాజ్-అర్ష్‌దీప్-ప్రసిద్ధ్‌తో పేస్ అటాక్, జడేజా-కుల్దీప్‌తో స్పిన్ అటాక్‌ను రంగంలోకి దింపొచ్చు. ఒకవేళ బుమ్రాను ఆడించాలని అనుకుంటే మాత్రం ప్రసిద్ధ్ స్థానంలో అర్ష్‌దీప్‌ను, శార్దూల్ ప్లేస్‌లో కుల్దీప్‌ను బరిలోకి దించే చాన్స్ ఉంది. అప్పుడు కూడా బుమ్రా-సిరాజ్-అర్ష్‌దీప్‌తో పేస్ దళం, కుల్దీప్-జడ్డూతో స్పిన్ యూనిట్ రెడీ అవుతుంది. మొత్తానికి 3-2 (ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లు) ఫార్ములాను భారత్ ప్రయోగించడం ఖాయంగా కనిపిస్తోంది. బ్రేక్‌త్రూల కోసం ఏ ఒక్క బౌలర్ మీదో ఆధారపడకుండా ఉండేందుకే కుల్దీప్-అర్ష్‌దీప్‌ను రంగలోకి దించుతున్నారని సమాచారం. అదే సమయంలో బుమ్రా మీద ఒత్తిడి తగ్గించేందుకు ఈ విధంగా ప్లాన్ చేస్తున్నారని వినిపిస్తోంది. ఒకవైపు పేసర్లు ఒత్తిడి పెడుతుండగానే మరోవైపు నుంచి స్పిన్నర్లతో దాడి చేయించి ఇంగ్లండ్ పని పట్టాలని చూస్తున్నారట. ఈ త్రిశూల వ్యూహం విజయవంతమైతే భారత్‌కు తిరుగుండదని విశ్లేషకులు అంటున్నారు.
ఇవీ చదవండి:
ఇది బీచా.. క్రికెట్ స్టేడియమా?
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి