టెస్టుల్లోనూ స్టాప్ క్లాక్
ABN , Publish Date - Jun 27 , 2025 | 06:12 AM
క్రికెట్‌ను మరింత ఆకర్షణీయంగా, పోటీతత్వం పెంచేందుకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తమ నిబంధనలను మార్చడం పరిపాటి. ఇటీవలే వన్డేల్లో ఒకే బంతి, బౌండరీ క్యాచ్‌లు...

స్లో ఓవర్ రేట్‌కు చెక్
ఐసీసీ నిర్ణయం
దుబాయ్: క్రికెట్‌ను మరింత ఆకర్షణీయంగా, పోటీతత్వం పెంచేందుకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తమ నిబంధనలను మార్చడం పరిపాటి. ఇటీవలే వన్డేల్లో ఒకే బంతి, బౌండరీ క్యాచ్‌లు, కంకషన్ సబ్‌స్టిట్యూట్ అంశాలపై రూల్స్‌ను సవరించిన విషయం తెలిసిందే. తాజాగా మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. దీనిలో భాగంగా టెస్టుల్లో స్లో ఓవర్ రేట్‌కు చెక్ పెట్టేందుకు స్టాప్ క్లాక్‌ను ప్రవేశపెట్టింది. ఒక రోజులో 90 ఓవర్లు పూర్తి కావాల్సి ఉండగా.. చాలాసార్లు అలా జరగకపోవడం చూస్తూనే ఉంటాం. అందుకే ఇక నుంచి ఓవర్ పూర్తయిన 60 సెకన్లలోపే తర్వాతి ఓవర్‌ను మొదలెట్టాలి. అలా జరగకపోతే ఫీల్డింగ్ జట్టు కెప్టెన్‌ను అంపైర్లు రెండుసార్లు హెచ్చరిస్తారు. మూడోసారి రిపీట్ అయితే మాత్రం పెనాల్టీ కింద ప్రత్యర్థి జట్టుకు అదనంగా ఐదు పరుగులను కోల్పోవాల్సి ఉంటుంది. 80వ ఓవర్ వరకు ఇలా ఎన్నిసార్లు జరిగినా కూడా పెనాల్టీ రన్స్ విధిస్తారు. డబ్ల్యూటీసీ కొత్త సీజన్ (2025-2027) నుంచే ఇది అమల్లోకి వస్తుందని ఐసీసీ వెల్లడించింది. వాస్తవానికి వన్డే, టీ20ల్లో గతేడాది జూన్ ఒకటి నుంచే ఈ స్టాప్ క్లాక్ రూల్ కొనసాగుతోంది.
ఉమ్మి పూసినా..
మ్యాచ్ సమయంలో బౌలర్లు బంతికి లాలాజలం పూయడంపై నిషేధం కొనసాగుతోంది. అయితే ఇక నుంచి బౌలర్లు తమ ఉమ్మి పూశారనే కారణంతో అంపైర్లు బంతిని మార్చాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కొత్త బంతి కోసం ఒక్కోసారి బౌలింగ్ జట్టు సభ్యులు కావాలనే ఉమ్మి పూస్తుంటారు. దీన్ని ఎదుర్కొనేందుకే కొత్త రూల్ తీసుకువచ్చారు. అయితే ఇంతకుముందులాగే బంతి పూర్తిగా దెబ్బతిన్నప్పుడు మాత్రమే దాన్ని మార్చాల్సి ఉంటుంది.
డీఆర్‌ఎస్ అవుట్ విషయంలో..
వికెట్ కీపర్ పట్టిన క్యాచ్ విషయంలో బ్యాటర్ రివ్యూకు వెళ్లినప్పుడు అలా్ట్రఎడ్జ్‌లో బంతి బ్యాట్‌కు తాకిందా? ప్యాడ్‌కు తాకిందా? అని పరిశీలిస్తారు. క్యాచ్ కాదని తెలియగానే థర్డ్ అంపైర్ వెంటనే ఎల్బీ కోసం కూడా చెక్ చేస్తాడు. అయితే బాల్ ట్రాకింగ్‌లో అవుట్‌గా తేలితే అంపైర్ కాల్ ప్రకారం బ్యాటర్ పెవిలియన్‌కు చేరాల్సిందే.
పూర్తి రన్ తీయాల్సిందే..
బ్యాటర్ ఉద్దేశపూర్వకంగా తన రన్ పూర్తి చేయకుండా (క్రీజులో బ్యాట్ పెట్టకుండా) మరో సింగిల్ కోసం వెళితే ఐదు పరుగుల పెనాల్టీ విధిస్తారు. అలాగే తర్వాత బంతిని ఏ బ్యాటర్ ఎదుర్కోవాలనేది ఫీల్డింగ్ జట్టు నిర్ణయించవచ్చు.
నోబాల్ క్యాచ్‌పై..
గతంలో నోబాల్‌కు ఫీల్డర్ క్యాచ్ పట్టుకుంటే దాన్ని సరిగ్గా పట్టుకున్నాడా? లేదా? అని రివ్యూ చేసేవారు కాదు. కానీ ఇప్పుడు థర్డ్ అంపైర్ పరిశీలించి సరైన క్యాచ్ అని తేలితే బ్యాటింగ్ జట్టుకు నోబాల్ రన్ మాత్రమే ఇస్తారు. అదే క్యాచ్ సరిగ్గా లేకపోతే బ్యాటర్లు ఎన్ని పరుగులు చేస్తే అన్ని రన్స్ పరిగణనలోకి తీసుకుంటారు.
ఇవీ చదవండి:
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి