Share News

Pahalgam Tourist: ఉగ్రవాదులు భయపెట్టినా వెనక్కి తగ్గలేదు.. దాల్ సరస్సులో షికారా ప్రయాణం..

ABN , Publish Date - Apr 26 , 2025 | 03:07 PM

Kashmir Travel After Terror Attack: పహల్గాంలో ఉగ్రవాదులు సృష్టించిన రక్తపాతం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో కాశ్మీర్ లో అడుగు పెట్టాలంటేనే పర్యాటకులు బెంబేలెత్తిపోతున్నారు. ఇలాంటి స్థితిలోనూ ఓ మహిళా టూరిస్ట్ చూపిన తెగువకు అంతా హ్యాట్సాఫ్ చెబుతున్నారు.

Pahalgam Tourist: ఉగ్రవాదులు భయపెట్టినా వెనక్కి తగ్గలేదు.. దాల్ సరస్సులో షికారా ప్రయాణం..
Woman Shikara Ride After Terror Attack

Woman Shikara Ride After Terror Attack: వేసవిలో కాశ్మీరీ అందాలను ఆస్వాదించేందుకు వెళ్లిన 26 మంది పర్యాటకులను ఘోరాతి ఘోరంగా కాల్చి చంపి రక్తపాతం సృష్టించిన ఉగ్రదాడి ఘటన ఇంకా దేశ ప్రజల గుండెల్లో మంటలు రేపుతూనే ఉంది. అమర్‌నాథ్ యాత్రకు వెళ్లాలని సిద్ధమవుతున్న భక్తులను ఈ ఘటన నిలువెల్లా వణికిస్తుంటే.. పర్యాటకుల్లో ధైర్యం నింపేందుకు ఓ మహిళా టూరిస్ట్ చేసిన ప్రయత్నం అందరినీ ఆకర్షిస్తోంది. మీ బెదిరింపులకు మేం బెదరం.. ఇది మా దేశం.. అని చాటి చెప్తూ.. దాల్ సరస్సులో షికారా రైడ్ చేసి అందుకు సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.


బెంగళూరుకు చెందిన ఇంటీరియర్ డిజైనర్ వినీతా చైతన్య పహల్గాం దాడి జరిగి కొన్ని రోజులు కూడా గడవకముందే ఓ సాహసం చేసింది. అందరూ ఈ విషాదాన్ని ఇంకా తేరుకోకముందే పర్యాటకుల్లో ధైర్యం నింపేలా దాల్ సరస్సులో షికారా రైడ్ చేసింది. 'సోల్‌ఫుల్ షికారా రైడ్' అనే ట్యాగ్ తో ఇన్‌స్టాగ్రామ్‌లో ఆ వీడియోను షేర్ చేసింది. ఈ పోస్ట్ లో "మేము శ్రీనగర్‌లో దిగడానికి ముందే ఈ షికారా రైడ్‌ను బుక్ చేసుకున్నాము. గత రెండు రోజులుగా ఇక్కడి వాతావరణం హృదయవిదారకంగా ఉంది. ప్రజలు అశాంతి, నిరాశ నిస్పృహల్లో మునిగిపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా నేను షికారాను రద్దు చేసుకోకూడదని నిర్ణయించుకున్నాను. నిన్న మధ్యాహ్నం స్థానిక డ్రైవర్‌తో కలిసి డ్రైవ్‌కి వెళ్ళాము. అక్కడ కేవలం రెండు పర్యాటక పడవలు మాత్రమే ఉన్నాయి. మమ్మల్ని చూసి రకరకాల వస్తువులు అమ్మేవాళ్లు చాలామంది అక్కడికి క్యూ కట్టారు. అందమైన పూలపడవల్లో సూర్యోదయాన్ని ఆస్వాదిస్తూ పూలు,కహావా టీ, ఇలా అనేక వస్తువులు కొనుక్కున్నాం. మా వల్ల వారి ముఖాల్లో చిరునవ్వు కనిపించడం ఆనందాన్ని కలిగిస్తోంది" అని రాసుకొచ్చింది."


ఈ వీడియో పోస్ట్ చేసినప్పటి నుండి 60 వేలకు పైగా వ్యూస్ వచ్చాయి. చాలా మంది నెటిజన్లు ఆమె ధైర్యాన్ని మెచ్చుకుంటూ కామెంట్లు పెడుతున్నారు. ఈ పోస్ట్ పర్యాటకులు, అక్కడి స్థానికుల్లో ధైర్యాన్ని నింపేలా ఉందని, మీరు వెనక్కి తగ్గకుండా ప్రయాణాన్ని కొనసాగించడం గ్రేట్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.


Read Also: Pahalgam Terror Attack: పహల్గాం ఘటనపై ఉగ్రవాద సంస్థ టీఆర్ఎఫ్ యూటర్న్..

Pahalgam Terror Attack: పహల్గాం దాడి.. స్పందించిన పాక్ ప్రధాని

Pahalgam Terror Attack: చెలరేగిపోయిన ఉగ్రవాదులు.. వెలుగులోకి మరో వీడియో..

Updated Date - Apr 26 , 2025 | 03:10 PM