Share News

CM Revanth Reddy: కేసీఆర్ పాలనలో విధ్వంసం జరిగింది.. సీఎం రేవంత్‌రెడ్డి షాకింగ్ కామెంట్స్

ABN , Publish Date - Nov 09 , 2025 | 12:27 PM

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొని ప్రసంగించారు. ఈ క్రమంలో కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీపై సంచలన కామెంట్స్ చేశారు సీఎం రేవంత్‌రెడ్డి.

CM Revanth Reddy: కేసీఆర్ పాలనలో విధ్వంసం జరిగింది.. సీఎం రేవంత్‌రెడ్డి షాకింగ్ కామెంట్స్
CM Revanth Reddy

హైదరాబాద్, నవంబరు9 (ఆంధ్రజ్యోతి): మాజీ సీఎం కేసీఆర్ (KCR), బీఆర్ఎస్ (BRS) పార్టీపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ పాలనలో విధ్వంసం జరిగిందని ఆరోపించారు. గతంలో కాంగ్రెస్ (Congress) తెచ్చిన ప్రాజెక్టుకు పేరు, ఊరు మార్చి కేసీఆర్ హయాంలో లక్షలాది రూపాయలు కొల్లగొట్టారని విమర్శించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో ఇవాళ(ఆదివారం) హైదరాబాద్‌లో మీట్ ది ప్రెస్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొని ప్రసంగించారు. తెలంగాణ ఇస్తానని సోనియాగాంధీ మాట ఇచ్చి నిలుపుకున్నారని ఉద్ఘాటించారు. రాజకీయంగా ఇబ్బంది కలిగినా సోనియాగాంధీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇచ్చారని స్పష్టం చేశారు సీఎం రేవంత్‌రెడ్డి.


పేదల గుండె ధైర్యం పీజేఆర్..

పేదల గుండె ధైర్యం పీజేఆర్ అని అభివర్ణించారు. 2004 నంచి 2014 వరకు కాంగ్రెస్ హయాంలోని పదేళ్లలో జరిగిన అభివృద్ధిని గుర్తు చేసుకోవాలని సూచించారు. 2014 నుంచి 2023 డిసెంబర్ వరకు జరిగిన విధ్వంసాన్ని మర్చిపోలేమని విమర్శించారు. రైతుల సంక్షేమం కోసం ఉచిత కరెంట్ ఇచ్చామని ఉద్ఘాటించారు. రైతులపై పెట్టిన కేసులు ఎత్తివేశామని స్పష్టం చేశారు. వ్యవసాయం దండగ కాదు పండుగ అని నిరూపించామని నొక్కిచెప్పారు. రైతులు దళారుల చేతిలో, మిల్లర్ల చేతిలో మోసపోకుండా జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపారు. రైతుల వలస సమస్యలు, కరువు సమస్యల పరిష్కారానికి జలయజ్ఞం తెచ్చామని పేర్కొన్నారు సీఎం రేవంత్‌రెడ్డి.


కేసీఆర్ పాలనలో రాష్ట్ర గీతమే లేకుండా చేశారు..

కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రానికి రాష్ట్ర గీతమే లేకుండా చేశారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పాలనలో తెలంగాణకి రాష్ట్ర గీతాన్ని, తెలంగాణ తల్లిని రాష్ట్ర ప్రజలకు అంకితం చేశామని ఉద్ఘాటించారు. కేసీఆర్ తెచ్చిన పథకాల్లో ఒక్కటి కూడా తాను రద్దు చేయలేదని స్పష్టం చేశారు. కేసీఆర్ తెచ్చిన వాటి కంటే అదనపు పథకాలను తమ ప్రభుత్వంలో తెచ్చామని నొక్కిచెప్పారు. వర్గీకరణ సమస్యకు శాశ్వత పరిష్కారం చేశామని తెలిపారు. కులగణన చేసి దేశానికి ఆదర్శంగా నిలిచామని పేర్కొన్నారు సీఎం రేవంత్‌రెడ్డి.


ఆర్టీసీని లాభాల బాట పట్టించాం..

ఫిబ్రవరి 4వ తేదీని సోషల్ జస్టిస్ డేగా ప్రకటించామని గుర్తుచేశారు. నష్టాల్లో ఉన్న ఆర్టీసీని లాభాల బాట పట్టించామని స్పష్టం చేశారు. కోటి మంది మహిళలకి రెండు నాణ్యమైన చీరలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని అన్నారు. రేషన్ కార్డులు, సన్నబియ్యం, రూ. 500 గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఇచ్చామని స్పష్టం చేశారు. కేసీఆర్ పదేళ్లలో నగరానికి ఒక్క చుక్క నీరైనా అదనంగా తెచ్చారా..? అని ప్రశ్నల వర్షం కురిపించారు. మోదీ ప్రభుత్వం సబర్మతి, యమునా, గంగా నది రివర్ ఫ్రంట్ కట్టుకుంటారని... కానీ తాము మూసీ రివర్ ఫ్రంట్ కట్టుకుంటే అడ్డుకుంటారా..? అని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం రేవంత్‌రెడ్డి.


కాంగ్రెస్ వల్లే హైదరాబాద్ నాలెడ్జ్ హబ్‌గా మారింది..

‘పార్టీ జెండాను తీసి గాలిలో ఊపుతారా..?. ఒక లీడర్ చేయాల్సిన పద్ధతి ఇదేనా?. నక్సల్బరీ నినాదాన్ని కాంగ్రెస్ కొనసాగించింది. హైదరాబాద్ నగర విస్తరణకు కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయాలే కారణం. కాంగ్రెస్ వల్లే హైదరాబాద్ నాలెడ్జ్ హబ్‌గా మారింది. ఫార్మా, ఐటీ రంగం హైదరాబాద్ నగరానికి రావడంలో కాంగ్రెస్ పాత్ర ఉంది. కాంగ్రెస్ పాలసీలు తెలంగాణ గ్రోత్ ఇంజన్‌గా మారాయి. పేదలకు ఇందిరమ్మ ఇళ్లు ఇస్తున్నాం. అభివృద్ధిని, సంక్షేమాన్ని బ్యాలెన్స్ చేసి కాంగ్రెస్ పాలించింది. కేటీఆర్ చేతిలో ముఖ్యమంత్రి రేఖ లేదు. దశనే లేని ఆయనకి దిశ మారిస్తే ఏం వస్తుంది. సొంత చెల్లికి, మాగంటి తల్లికి కేటీఆర్ న్యాయం చేయలేదు. తెలంగాణ ఉద్యమ ఆత్మను కేసీఆర్ చంపేశారు. తెలంగాణపై 1.29 లక్షల కోట్ల అప్పు కేసీఆర్ చేశారు’ అని సీఎం రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు.


కేసీఆర్ తెలంగాణని దివాళా తీయించారు..

‘జీతాలు ఇవ్వడానికి కూడా డబ్బులు లేకుండా కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని దివాళా తీయించారు. పదేళ్లలో కేసీఆర్ చేసింది ఏంటి.?. అమరవీరుల స్థూపం, అంబేడ్కర్ విగ్రహం, సెక్రటేరియట్, కమాండ్ కంట్రోల్ రూం అన్నింటిలో అవినీతి జరిగింది. కాళేశ్వరం ఎందుకు పనికి రాకుండా అయింది. సెక్రటేరియట్, ప్రగతి భవన్, కమాండ్ కంట్రోల్ రూమ్ వల్ల ఒక్క కొత్త ఉద్యోగమైన వచ్చిందా..?. ఉమ్మడి ఏపీలో కూడా చేయనంత వరి ఉత్పత్తి తెలంగాణలో అయింది. సింగిల్ టీచర్ ఉన్న 5000 పాఠశాలలను కేసీఆర్ మూసివేశారు. మహిళలను రాజ్యాధికారానికి దూరం చేశారు. బీఆర్ఎస్ మొదలుపెట్టిన ఒక్క ప్రాజెక్టునైనా పూర్తి చేశారా’ అని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నల వర్షం కురిపించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

నేటితో ముగియనున్న జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారం

రేవంత్ పాలనలో రియల్ ఎస్టేట్ కుప్పకూలింది.. హరీశ్‌రావు ఫైర్

Read Latest Telangana News and National News

Updated Date - Nov 10 , 2025 | 06:47 AM