Mahesh Kumar Goud: ఓటు హక్కుని బీజేపీ కాలరాస్తోంది.. మహేష్ గౌడ్ షాకింగ్ కామెంట్స్
ABN , Publish Date - Nov 08 , 2025 | 04:20 PM
హర్యానా, మహారాష్ట్ర, కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం ఓటు చోరీ చేసిందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. బీజేపీ చేస్తున్న ఓటు చోరీపై ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు. యూపీ వంటి ఇతర రాష్ట్రాల వారికి కూడా హర్యానాలో ఓట్లు ఉన్నాయని ఆరోపించారు మహేష్ కుమార్ గౌడ్.
హైదరాబాద్, నవంబరు8 (ఆంధ్రజ్యోతి): బీజేపీ ప్రభుత్వం (BJP Govt) దేశంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) సంచలన ఆరోపణలు చేశారు. దేశంలో జరుగుతున్న ఓటు చోరీపై ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ఎనలేని పోరాటం చేస్తున్నారని ఉద్ఘాటించారు. ఇవాళ(శనివారం) గాంధీభవన్‌లో మహేష్ కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడారు. ఓటు చోరీపై కాంగ్రెస్ చేపట్టిన సంతకాల సేకరణకు 5 కోట్ల మందికిపైగా మద్దతు తెలిపారని స్పష్టం చేశారు. లోక్‌సభ ఎన్నికలతోపాటు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అవకతవకలను కాంగ్రెస్ ఆధారాలతో సహా నిరూపిస్తోందని పేర్కొన్నారు మహేష్ కుమార్ గౌడ్.
కర్ణాటకలోని మహదేవ్‌పురం నియోజకవర్గంలో ఓటర్ల జాబితాలో తప్పులను, బీజేపీ మోసాలను రాహుల్ గాంధీ ఆధారాలతో సహా నిరూపించినా ఎన్నికల సంఘం ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఫైర్ అయ్యారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ చేసిన కుట్రలను కూడా రాహుల్ గాంధీ పలు రుజువులతో సహా నిరూపించారని తెలిపారు. హర్యానాలో 25 లక్షలకు పైగా నకిలీ ఓటర్లు ఉన్నారని తెలిపారు. హర్యానాలో 5 లక్షలకు పైగా ఉన్న డూప్లికేట్ ఓటర్లు, 93 ఓటర్ల తప్పుడు చిరునామాలు, లక్ష మందికిపైగా ఓటర్ల ఫొటోల వివరాలు తప్పులు ఉండటం, తదితర వివరాలను రాహుల్ గాంధీ నిరూపించారని వెల్లడించారు మహేష్ కుమార్ గౌడ్.
అక్కడ ఒకే మహిళ ఫొటోతో 22 ఎంట్రీలు ఉన్నాయని వివరించారు. ఒకే మహిళ ఫొటోతో 100 ఓటరు కార్డులు ఉన్నాయని వెల్లడించారు. తమకు సంబంధించని ఓట్లను బీహార్‌లో సర్ పేరుతో బీజేపీతో తొలగించిందని ఆరోపించారు. ఓటు చోరీ ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించేదని తెలిపారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా బీజేపీ మద్దతుగా పనిచేస్తోందని విమర్శించారు. ఎలక్షన్ కమిషన్ ఏక పక్షంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ప్రజలను జాగృత పరిచేందుకు రాహుల్ గాంధీ బీహార్‌లో ‘ఓట్ అధికార్ ర్యాలీ’ చేపట్టడంతో బీజేపీలో వణుకు మొదలైందని విమర్శించారు. బీజేపీ ఇప్పుడు బీహార్‌లో హర్యానా ఫార్ములాతో గెలవాలని చూస్తోందని ఆక్షేపించారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో పక్కా జిల్లాల ఓటర్లు నమోదు చేసుకొని గతంలో బీజేపీ సహకారంతో బీఆర్ఎస్ గెలుస్తూ వచ్చిందని ఆరోపించారు మహేష్ కుమార్ గౌడ్.
హర్యానాలో కాంగ్రెస్‌కు దక్కాల్సిన ఘన విజయాన్ని బీజేపీ అడ్డుకున్న తీరును, అందుకు ఎన్నికల సంఘం అందించిన సహకారాన్ని రాహుల్ గాంధీ ఆధారలతో సహా నిరూపించడంతో దేశం విస్తుపోయిందని పేర్కొన్నారు. హర్యానా, మహారాష్ట్ర, కర్ణాటకలో ఓటు చోరీపై ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు. యూపీ వంటి ఇతర రాష్ట్రాల వారికి కూడా హర్యానాలో ఓట్లు ఉన్నాయని ఆరోపించారు. ఇందిరా గాంధీ ఏనాడు అవకతవకలకు పాల్పడలేదని స్పష్టం చేశారు. ఓటు హక్కు కాలరాసే హక్కు ఎవరికీ లేదని మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. గాంధీభవన్‌లో జరిగిన సమావేశంలో ఏఐసీసీ ఇన్‌చార్జీ మీనాక్షి నటరాజన్, అల్లం భాస్కర్, హనుమంతురావు, లింగం యాదవ్, గజ్జి భాస్కర్,తదితరులు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఫీజు రీయింబర్స్‌మెంట్ అడిగితే వీధి రౌడీలాగా మాట్లాడుతారా.. సీఎం రేవంత్‌పై కవిత ఫైర్
కిసాన్ డ్రోన్.. సాగు ఖర్చు డౌన్
Read Latest Telangana News and National News