Share News

KTR: జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక.. కాంగ్రెస్ నేతలు నిబంధనలని తుంగలో తొక్కారు: కేటీఆర్‌

ABN , Publish Date - Nov 14 , 2025 | 02:21 PM

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో అధికార కాంగ్రెస్‌కు తాము గట్టి పోటీ ఇచ్చామని మాజీ మంత్రి కేటీఆర్ ఉద్ఘాటించారు. బీఆర్ఎస్‌కి 38 శాతం పైగా ఓటింగ్‌ వచ్చిందని వివరించారు. ఉపఎన్నికలో కాంగ్రెస్ నేతలు నిబంధనలని తుంగలో తొక్కారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

KTR: జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక..  కాంగ్రెస్ నేతలు నిబంధనలని తుంగలో తొక్కారు: కేటీఆర్‌
KTR

హైదరాబాద్, నవంబరు14 (ఆంధ్రజ్యోతి): జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక ఫలితాల (Jubilee Hills Bye Election Results)పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (KTR) కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఉప ఎన్నిక తీర్పును తాము స్వాగతిస్తున్నామని వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో గెలుపోటములు సహజమని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తమకు ఓటేసిన జూబ్లీహిల్స్‌ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికలు ఎలా జరిగాయో అందరికీ తెలుసునని చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత చివరి వరకు పోరాటం చేశారని ప్రశంసించారు. ఇవాళ(శుక్రవారం) తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు మాజీమంత్రి కేటీఆర్.


రాజకీయాలకు కొత్త అయినా సునీత గట్టిగా నిలబడ్డారని కొనియాడారు. బీఆర్ఎస్ గెలుస్తుందని పలు సర్వేలు చెప్పాయని గుర్తుచేశారు. ఆఖరి మూడు రోజులు ఏం జరిగిందో అందరికీ తెలుసునని విమర్శించారు. కాంగ్రెస్‌కి ప్రత్యామ్నాయం బీఆర్ఎస్ అని ఈ ఉపఎన్నిక ద్వారా స్పష్టమైందని పేర్కొన్నారు. ఈ ఉపఎన్నిక తమకు కొత్త ఉత్సాహం, బలం ఇచ్చిందని నొక్కిచెప్పారు. తాము ఉప ఎన్నికలో ఆశించింది దక్కలేదని.. అలాగని నిరుత్సాహం లేదని తెలిపారు మాజీమంత్రి కేటీఆర్.


ఉప ఎన్నికలో అధికార కాంగ్రెస్‌కు తాము గట్టి పోటీ ఇచ్చామని ఉద్ఘాటించారు. బీఆర్ఎస్‌కి 38 శాతం పైగా ఓటింగ్‌ వచ్చిందని వివరించారు. డిపాజిట్‌ కోల్పోయిన పార్టీ కూడా ఉంది కదా..? అని ఎద్దేవా చేశారు. దొంగ ఓట్లు వేస్తున్నారని ఎన్నికల కమిషన్‌కి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా.. ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నల వర్షం కురిపించారు. ఉపఎన్నికలో కాంగ్రెస్ నేతలు నిబంధనలని తుంగలో తొక్కారని మాజీమంత్రి కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.


ఓటమితో కుంగిపోం..

‘బైపోల్స్ ఓటమితో కుంగిపోయేది లేదు. ప్రతిపక్షపాత్ర పోషిస్తున్నందున ప్రజా సమస్యలపై పోరాటం కొనసాగిస్తాం. గులాబీ పార్టీ కేడర్‌కు ధన్యవాదాలు. మా అభ్యర్థి మాగంటి సునీత ధైర్యంగా కొట్లాడారు. బైపోల్స్‌లో నిజాయతీగా గెలవటానికే కొట్లాడాం. ఉప ఎన్నిక ఉత్సాహాన్ని ఇచ్చింది. 2014 నుంచి 2023 వరకు జరిగిన ఏడు ఉప ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ గెలవలేదు. కానీ 2023 సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ప్రభుత్వంలో ఉన్నవారు అసభ్యంగా మాట్లాడినా సంయమనం పాటించాం. అన్ని రకాల అక్రమాలకు అధికార కాంగ్రెస్ పాల్పడింది. ఉప ఎన్నికల నేపథ్యంలో ఆర్ఎస్ బ్రదర్స్ మిత్రమండలి వర్కౌట్ అయింది. కాంగ్రెస్, బీజేపీలు ఎలా సహకరించుకున్నాయో చూశాం. గులాబీ కేడర్ నిరాశ పడాల్సిన అవసరం లేదు. గోడకు కొట్టిన బంతి‌ మాదిరిగా వెనక్కి వస్తాం. కాంగ్రెస్ బిహార్‌లో ఉనికి కోల్పోయింది’ అని ఎద్దేవా చేశారు మాజీ మంత్రి కేటీఆర్.


హరీశ్‌రావు‌కి ప్రత్యేక ధన్యవాదాలు..

‘తండ్రిని కోల్పోయి కూడా ఇంటి నుంచి పనిచేసిన మాజీ మంత్రి హరీశ్‌రావు‌కి ప్రత్యేక ధన్యవాదాలు. మా ఎమ్మెల్సీ రవీందర్‌రావు సొంత అన్న చనిపోయినా బైపోల్స్ కోసం గట్టిగా పనిచేశారు. బైపోల్స్‌లో ఓటమిని సమీక్షించుకుంటాం. లిస్ట్‌లో ఉండి .. స్థానికంగా లేని ఓటర్లే జూబ్లీహిల్స్‌లో ఎక్కువగా ఉన్నారు. దొంగ ఓట్లను కట్టడి చేయటానికి ఎలక్షన్ కమిషన్ ఏమీ చేయలేకపోయింది. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరి మార్చుకుంటుందో లేదో చూడాలి. శని, ఆదివారాల్లో హైడ్రా పేదల ఇళ్లు కూలగొట్టడం ఆపాలి. పార్టీ ఫిరాయించిన బెంగాల్ ఎమ్మెల్యే ముకుల్ రాయ్‌ను హైకోర్టు డిస్ క్వాలిఫై చేసింది. తెలంగాణలో కూడా ఫిరాయింపు ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రావడం ఖాయం. ఉప ఎన్నికలను ఎదుర్కోవడానికి బీఆర్ఎస్ రెడీగా ఉంది. ఒక ఉప ఎన్నికకే వెంకటగిరి గల్లీల్లో తిరిగిన ముఖ్యమంత్రి.. పది ఉప ఎన్నికలు వస్తే ఎక్కడ తిరుగుతారో చూద్దాం’ అని మాజీ మంత్రి కేటీఆర్ సెటైర్లు గుప్పించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. బీఆర్ఎస్ గెలుపు ఖాయం: మాగంటి సునీత

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. తొలి మూడు రౌండ్లలో ముందంజలో కాంగ్రెస్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Nov 14 , 2025 | 02:42 PM