Share News

HarishRao VS CM Revanth: ఢిల్లీలో భట్టి ఇంట్లో ఐటీ రైడ్స్.. హరీశ్‌రావు షాకింగ్ కామెంట్స్

ABN , Publish Date - Nov 08 , 2025 | 07:23 PM

బీజేపీతో ఒప్పందంలో భాగంగానే మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బయట ఉన్నారని ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు షాకింగ్ కామెంట్స్ చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిల మధ్య చీకటి ఒప్పందం ఉందని ఆరోపించారు. రేవంత్‌రెడ్డి ఢిల్లీ పోతే ఎవర్ని కలిసేది.. ఎవరి కారులో తిరిగేది బయటకు వస్తున్నాయని ఎద్దేవా చేశారు.

HarishRao VS CM Revanth: ఢిల్లీలో భట్టి ఇంట్లో ఐటీ రైడ్స్.. హరీశ్‌రావు షాకింగ్ కామెంట్స్
HarishRao VS CM Revanth Reddy

హైదరాబాద్, నవంబరు8 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy)పై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు (HarishRao) సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి, బీజేపీది ఫెవికాల్ బంధమని ఆరోపించారు. ఢిల్లీలో మల్లు భట్టి విక్రమార్క ఇంట్లో ఐటీ రైడ్స్ జరిగితే ఎందుకు బయటకు రాలేదని ప్రశ్నించారు. భట్టి ఢిల్లీ వెళ్తే తెలంగాణ భవన్‌లో ఉండరని... గురుగాంలోని అత్తగారింట్లో ఎందుకు ఉంటారని నిలదీశారు. బీజేపీతో ఒప్పందంలో భాగంగానే భట్టి ఇంట్లో ఐటీ రైడ్స్ బయటకు రాలేదని ఆరోపించారు. భట్టి ఇంట్లో హార్డ్ డిస్క్‌లు కూడా ఐటీ అధికారులు తీసుకెళ్లారని విమర్శించారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఇవాళ(శనివారం) మీడియాతో మాట్లాడారు హరీశ్‌రావు.


రేవంత్‌రెడ్డి, కిషన్‌రెడ్డిల మధ్య చీకటి ఒప్పందం

బీజేపీతో ఒప్పందంలో భాగంగానే మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బయట ఉన్నారని షాకింగ్ కామెంట్స్ చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిల మధ్య చీకటి ఒప్పందం ఉందని ఆరోపించారు. రేవంత్‌రెడ్డి ఢిల్లీ పోతే ఎవర్ని కలిసేది.. ఎవరి కారులో తిరిగేది బయటకు వస్తున్నాయని ఎద్దేవా చేశారు. తెలంగాణ సచివాలయానికి అంబేద్కర్ పేరు ఉండటం రేవంత్‌రెడ్డికి ఏమాత్రం ఇష్టం లేదని విమర్శించారు. అందుకే కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సీఎం కూర్చుంటున్నారని ఎద్దేవా చేశారు. పీజేఆర్ కొడుకుకు టికెట్ ఇవ్వని రేవంత్‌రెడ్డికి ఆయన పేరు తీసే నైతికత లేదని ధ్వజమెత్తారు. పీజేఆర్‌ను మానసికంగా వేధించి చనిపోయేలా చేసిందే కాంగ్రెస్ అని సంచలన వ్యాఖ్యలు చేశారు హరీశ్‌రావు.


అనుమానంగా రేవంత్‌రెడ్డి మానసికస్థితి..

‘ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మానసికస్థితిపై మాకు అనుమానంగా ఉంది. మాట తప్పటం రేవంత్‌రెడ్డి నైజం. జూబ్లీహిల్స్ బైపోల్స్‌లో బీఆర్ఎస్ విజయం ఖాయమైంది. రేవంత్‌రెడ్డి భూదందాలు, వసూళ్లు, హైడ్రాతో తెలంగాణ ఆదాయం పడిపోయింది. జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ ఓటమి ఖాయమని రేవంత్‌రెడ్డి ఒప్పుకున్నారు. ప్రభుత్వాన్ని నడపటం చేతకావటం లేదని రేవంత్ చేతులెత్తేశాడు. హైదరాబాద్ అభివృద్ధిలో కేసీఆర్ ముద్రను రేవంత్‌రెడ్డి చెరపలేరు. రేవంత్ ఇంటి కిటికీ నుంచి కనిపించే తీగల వంతెనను కట్టింది కేసీఆరే. రేవంత్‌రెడ్డి తన అసమర్థతను తానే బయట పెట్టుకున్నారు. రెండేళ్లల్లో ఏమీ చేయలేదు కాబట్టే.. 2004 నుంచి 2014 వరకు గత కాంగ్రెస్ పాలన చూసి జూబ్లీహిల్స్ బైపోల్స్‌లో ప్రజలని ఓటేయమంటున్నారు’ అని హరీశ్‌రావు ఎద్దేవా చేశారు.


వైఎస్సార్‌ని రేవంత్‌రెడ్డి విమర్శించలేదా..?..

‘రేవంత్‌రెడ్డి 2014 వరకు టీడీపీలో ఉన్నారు. కాంగ్రెస్ పాలనను రేవంత్‌రెడ్డి ఎలా క్లెయిమ్ చేసుకుంటారు..?. వైఎస్ఆర్ ని రేవంత్‌రెడ్డి విమర్శించలేదా..? వైఎస్ఆర్ జలయజ్ఞాన్ని.. ధనయజ్ఞం అని రేవంత్‌రెడ్డి అనలేదా..?. గతంలో వైఎస్ఆర్ రూ.లక్ష కోట్ల అవినీతికి పాల్పడ్డారని రేవంత్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పాలనలో ఆరు గంటలు కూడా కరెంట్ రాలేదు. కేసీఆర్ కట్టిన ప్రతి దాన్ని ఉపయోగించుకుంటూ.. అబద్ధాలు చెబుతున్నారు. అప్పుల మీద ముఖ్యమంత్రి పూటకో మాట మాట్లాడుతున్నారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రిలా కాకుండా దారిన పోయే దానయ్యలా రేవంత్ మాట్లాడుతున్నారు. రూ.30 కోట్ల అంచనాలతో MCHRDలో ప్రారంభమైన సీఎం క్యాంపు ఆఫీస్ రూ.100కోట్లకు ఎందుకు పెంచారు..? కాలేజీ యాజమాన్యాలను బెదిరించటం ముఖ్యమంత్రికి తగదు. రెండేళ్లలో రేవంత్ .. రెండు రూపాయల ఫీజు రీయింబర్స్‌మెంట్ కూడా ఇవ్వలేదు. తన కమీషన్ కోసమే.. సీఎం రేవంత్‌రెడ్డి పెద్ద కాంట్రాక్టర్లకు బిల్లులు విడుదల చేస్తున్నారు. కేసీఆర్ కట్టిన నిర్మాణాలకి రేవంత్‌రెడ్డి రిబ్బన్ కత్తిరిస్తున్నారు’ అని హరీశ్‌రావు విమర్శలు చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఫీజు రీయింబర్స్‌మెంట్ అడిగితే వీధి రౌడీలాగా మాట్లాడుతారా.. సీఎం రేవంత్‌పై కవిత ఫైర్

ఓటు హక్కుని బీజేపీ కాలరాస్తోంది.. మహేష్ గౌడ్ షాకింగ్ కామెంట్స్

Read Latest Telangana News and National News

Updated Date - Nov 08 , 2025 | 07:47 PM