CM Chandrababu: జగన్ హయాంలో విధ్వంస విధానాలతో పరిశ్రమలు వెనక్కి వెళ్లాయి: చంద్రబాబు
ABN , Publish Date - Nov 11 , 2025 | 12:56 PM
మెంథా తుఫానులో సమర్థవంతంగా పనిచేశామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి సమష్టిగా పనిచేశారని ప్రశంసించారు. మెంథా తుఫాను నేపథ్యంలో ప్రాణ, ఆస్తి నష్టం జరుగకుండా చర్యలు చేపట్టామని నొక్కిచెప్పారు.
ప్రకాశం, నవంబరు11 (ఆంధ్రజ్యోతి): క్వాంటం కంప్యూటర్స్‌ని అమరావతికి తీసుకువచ్చామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) వ్యాఖ్యానించారు. క్వాంటం కంప్యూటర్స్ జనవరిలో ప్రారంభమవుతుందని స్పష్టం చేశారు. భావితరాల భవిష్యత్ కోసం తమ ప్రభుత్వం పనిచేస్తోందని ఉద్ఘాటించారు. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనతో ఏపీ బ్రాండ్‌ని బిల్డ్ చేస్తామని పేర్కొన్నారు. ఇష్టపడి స్మార్ట్‌గా పనిచేస్తే ఏదైనా సాధ్యమవుతుందని చెప్పుకొచ్చారు. భవిష్యత్‌లో ప్రభుత్వ విధాన నిర్ణయాల్లో యువత భాగస్వాములు అవుతారని స్పష్టం చేశారు. ఇవాళ(మంగళవారం) ప్రకాశం జిల్లాలోని లింగన్నపాలెంలో సీఎం చంద్రబాబు పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి పాల్గొని ప్రసంగించారు. జగన్ హయాంలో విధ్వంస విధానాలతో పరిశ్రమలు వెనక్కి వెళ్లాయని ఆరోపించారు. వైసీపీ హయాంలో ప్రజా వేదిక కూల్చడంతో ప్రారంభమైన విధ్వంసం రాష్ట్ర వ్యాప్తంగా జరిగిందని ఆక్షేపించారు.
కనిగిరి కనకపట్నం అవుతుందని బ్రహ్మంగారు చెప్పారని గుర్తుచేశారు. కనిగిరి కనకపట్నం కావడానికి ఎంతోకాలం పట్టదని తెలిపారు. మెంథా తుఫానులో సమర్థవంతంగా పనిచేశామని పేర్కొన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి సమష్టిగా పనిచేశారని ప్రశంసించారు. మెంథా తుఫాను నేపథ్యంలో ప్రాణ, ఆస్తి నష్టం జరుగకుండా చర్యలు చేపట్టామని నొక్కిచెప్పారు. చదువుకుంటున్న విద్యార్థులకు చదువులు పూర్తయ్యేలోపు స్థానికంగా ఉపాధి కల్పించే బాధ్యత తనదని ఉద్ఘాటించారు. 1987 ప్రాంతాల్లో అందరికీ ఉద్యోగాలు ఇస్తామని కొంతమంది రాజకీయ నేతలు చెప్పేవారని...కానీ తాను మాత్రం ఇంటికొక వ్యాపారవేత్తని తయారు చేస్తానని హామీ ఇచ్చి అమలు చేశానని తెలిపారు. తాను చేసిన పనులే సాక్ష్యాలుగా ఉన్నాయని స్పష్టం చేశారు. 25 ఏళ్ల క్రితం తాను అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తే హైదరాబాద్ దేశానికి ఆదర్శంగా నిలిచిందని నొక్కిచెప్పారు. 17 నెలల నుంచి భిన్నమైన పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం ఏపీలో పని చేస్తోందని వెల్లడించారు. చాలా సుడిగుండాల నడుమ తాము పని చేస్తున్నామని పేర్కొన్నారు సీఎం చంద్రబాబు.
రెవెన్యూ సమస్యలు పరిష్కరించే బాధ్యత తనదని భరోసా కల్పించారు. ఇంటికో ఎంట్రప్రెన్యూర్ ఉండాలనేది తన లక్ష్యమని ఉద్ఘాటించారు. MSME వ్యవస్థాపకుల రుణాలకు ప్రభుత్వాలు గ్యారెంటీ ఇస్తున్నాయని వివరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి 95 శాతానికి గ్యారెంటీ ఇస్తున్నాయని తెలిపారు. ఈ ఏడాది లక్ష మంది మహిళలను వ్యవస్థాపకులుగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. ఏపీ అభివృద్ధిలో ప్రజలను భాగస్వామ్యం చేస్తున్నామని అన్నారు. ఒకప్పుడు ఏపీ అంటే పలువురు ఇష్టపడేవారు కాదని... ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే భలేభలే అంటున్నారని చెప్పుకొచ్చారు.
కేంద్ర ప్రభుత్వం తెచ్చే పాలసీలను రాష్ట్రానికి తీసుకువస్తున్నామని స్పష్టం చేశారు. జపాన్, అమెరికా సరసన ఏపీ చేరబోతుందని స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో తనను ఎవరూ మోసం చేయలేరని అన్నారు. వారసత్వంగా వచ్చిన సమస్య రెవెన్యూని వెంటాడుతోందని తెలిపారు. ఈ సమస్యపైనే తాను శ్రద్ధ పెట్టానని.. అవసరమైతే కొరడా తీసుకుంటానని హెచ్చరించారు. పెట్టుబడులు తెచ్చి 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామని అన్నారు. ఏపీ వ్యాప్తంగా ఈవారం పెట్టుబడులు రానున్నాయని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
సంస్కరణలతో దేశ విద్యా వ్యవస్థకు పునాది వేశారు.. మౌలానా ఆజాద్‌కి నివాళి అర్పించిన చంద్రబాబు, లోకేష్
ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
Read Latest AP News And Telugu News