Share News

Somireddy: తెలుగువారు బాధపడేలా మాట్లాడకండి: సోమిరెడ్డి

ABN , Publish Date - Aug 01 , 2025 | 06:53 PM

తెలంగాణలో ఎన్నో ప్రాజెక్టులు కట్టారని, తామేమైనా అభ్యంతరం చెప్పామా? అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ బాగుంటే తాము ఆనందిస్తామని వ్యాఖ్యానించారు.

Somireddy: తెలుగువారు బాధపడేలా మాట్లాడకండి: సోమిరెడ్డి
Somireddy Chandramohan Reddy

నెల్లూరు: మిగులు జలాల్లో ఆంధ్రప్రదేశ్ కు హక్కు ఉందని మాజీ మంత్రి, సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి (Somireddy Chandramohan Reddy) ఉద్ఘాటించారు. తెలంగాణ మాజీ మంత్రి హరీష్‌రావు ఏపీని ఎందుకంత ద్వేషిస్తున్నారని ప్రశ్నించారు సోమిరెడ్డి. కలిసి పెరిగాం, ఎందుకు పాకిస్థాన్ ఉగ్రవాదుల్ని చూసినట్లుగా ఏపీని చూస్తున్నారని ఫైర్ అయ్యారు‌. తమ అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లు మీరని చెప్పుకొచ్చారు. మంత్రి నారా లోకేశ్ తప్పేం మాట్లాడారని... ఎందుకు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ప్రశ్నించారు. పహల్గాం ఉగ్రవాదుల్లా తమను ఎందుకు చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాళేశ్వరం కట్టుకుంటే తాము ఏమైనా మాట్లాడామా? అని నిలదీశారు. తెలంగాణలో నీరు ఆపితే.. కింద బాధపడేది ఏపీ ప్రజలని చెప్పుకొచ్చారు. ఇవాళ(శుక్రవారం) నెల్లూరులో మీడియాతో సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మాట్లాడారు.


తెలంగాణలో ఎన్నో ప్రాజెక్టులు కట్టారని, తామేమైనా అభ్యంతరం చెప్పామా? అని సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ బాగుంటే తాము ఆనందిస్తామని వ్యాఖ్యానించారు. సముద్రతీరం, ఓడరేవులు తెలంగాణకు లేవని తెలిపారు. ఏపీలో పరిశ్రమలు వస్తే మీరు సంతోషించాలని కోరారు. ఇప్పటికీ తాము హైదరాబాద్‌లో రెండు, మూడు రోజులు అద్దె ఇళ్లల్లో ఉండివచ్చినా ఆనందంగా ఉందని పేర్కొన్నారు. మనమంతా మిత్రులుగా కలిసి పెరిగామని.. ఒకే కేబినెట్‌లో పనిచేశామని గుర్తుచేశారు. కృష్ణానదిలో జలాల పరిస్థితి చూశామని.. కరవు వచ్చినా, వరద వచ్చినా తీవ్రంగా నష్టపోయేది తామేనని ఆవేదన వ్యక్తం చేశారు. సంవత్సరానికి మూడువేల టీఎంసీల నీరు వృథాగా పోతోందని.. 200 టీఎంసీల ప్రాజెక్ట్ కట్టుకుంటామని, మిగులు జలాలు వాడుకుంటామని అడిగితే వద్దంటే ఎలా? అని ప్రశ్నల వర్షం కురిపించారు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి.


బనకచర్ల ప్రాజెక్ట్ పూర్తయితే రాయలసీమకి మేలు జరుగుతుందని... రాయలసీమ ఒకప్పుడు రత్నాలసీమగా ఉండి ఇప్పుడు రాళ్లసీమలా మారిందని సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి వాపోయారు. మాజీ మంత్రి, వైసీపీ నేత ఆర్కే రోజా ఇంట్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భోజనం చేసి అప్పట్లో మీడియాతో ఏం మాట్లాడారని ప్రశ్నించారు. గోదావరి నీళ్లని రాయలసీమకి తెస్తా, రత్నాల సీమని చేస్తానని అనలేదా? అని నిలదీశారు. సముద్రానికి పోయే నీటిని మాత్రమే తాము వాడుకుంటామని అడుగుతున్నామని తెలిపారు. ప్రకాశం, నెల్లూరు, రాయలసీమలో 80లక్షల మందికి తాగునీరు, 7లక్షల ఎకరాలకి సాగునీరు అందుతోందని చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్ నేతలు కేసీఆర్, కేటీఆర్, హరీష్‌రావు తమతో చర్చించాలని సూచించారు. మంచి మనస్సుతో మంచి నిర్ణయం తీసుకుని చెప్పాలని.. తోటి తెలుగువారు బాధపడేలా దయచేసి మాట్లాడకండి... చేతులెత్తి వేడుకుంటున్నానని సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఏపీ లిక్కర్ స్కామ్‌ నిందితులకు రిమాండ్ పొడిగింపు

చేనేతలకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్

For More AP News and Telugu News

Updated Date - Aug 01 , 2025 | 08:18 PM