Share News

DGP Harish Kumar Gupta: డ్రగ్స్ రవాణా చేస్తే ఉపేక్షించేది లేదు: డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా

ABN , Publish Date - Nov 23 , 2025 | 08:42 AM

ఏపీలో మత్తు పదార్థాల రవాణాను చాలా వరకు నివారించామని ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా పేర్కొన్నారు. ఏపీలో గంజాయి సాగును పూర్తిగా నిర్మూలించామని తెలిపారు.

DGP Harish Kumar Gupta: డ్రగ్స్ రవాణా చేస్తే ఉపేక్షించేది లేదు: డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా
DGP Harish Kumar Gupta

విజయవాడ, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): మత్తు పదార్థాలతో యువత జీవితాలను బలి చేసుకుంటున్నారని ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా (DGP Harish Kumar Gupta) వ్యాఖ్యానించారు. డ్రగ్స్ రవాణా చేసే వారిని ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. డ్రగ్స్ విషయంలో ఏపీ ప్రభుత్వం చాలా సీరియస్‌గా ఉందని పేర్కొన్నారు. ఏపీ ఈగల్ ఆధ్వర్యంలో ‘ఫిట్ ఇండియా- సండే ఆన్ సైకిల్ ర్యాలీ’ ఇవాళ(ఆదివారం) నిర్వహించారు.


‘డ్రగ్స్ వద్దు బ్రో... సైకిల్ తొక్కు బ్రో’ అనే థీమ్‌తో ప్రజల్లో అవగాహన కల్పించారు పోలీసులు. సింగ్‌నగర్ డాబా సెంటర్ నుంచి పైపుల రోడ్డు వరకు ఈ ర్యాలీ సాగింది. ఈ కార్యక్రమంలో డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా, పోలీసు కమిషనర్ రాజశేఖర్ బాబు, కలెక్టర్ లక్ష్మి షా, ఈగల్ చీఫ్ రవికృష్ణ, పలువురు ఐపీఎస్ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా మీడియాతో మాట్లాడారు. డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చాలని సీఎం చంద్రబాబు ఆదేశించారని అన్నారు.


పోలీసు పరంగా ఎన్ని చర్యలు తీసుకున్నా... ప్రజల సహకారం చాలా అవసరమని చెప్పుకొచ్చారు. మత్తు పదార్థాల రవాణాను చాలా వరకు నివారించామని పేర్కొన్నారు. ఏపీలో గంజాయి సాగును పూర్తిగా నిర్మూలించామని అన్నారు. ముఖ్యంగా యువత వీటకి బానిస కాకుండా చూడాలని సూచించారు. డ్రగ్స్ గురించి ఎక్కడ ఎటువంటి సమాచారం ఉన్నా పోలీసులకు వెంటనే అందించాలని కోరారు డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా.


ఈగల్ ఆధ్వర్యంలో మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నామని తెలిపారు. ప్రజలు కూడా వీటిపై అవగాహన పెంచుకోవాలనే సైకిల్ ర్యాలీ నిర్వహించామని చెప్పుకొచ్చారు. విదేశాల నుంచి వచ్చే డ్రగ్స్‌కు యువత ఎక్కువగా బానిసలుగా మారతున్నారని పేర్కొన్నారు. యువతతో పాటు వారి కుటుంబాలు కూడా నాశనం అవుతున్నాయని వివరించారు. డ్రగ్స్ రహిత రాష్ట్రంగా ఏపీని మార్చడంలో ప్రజలంతా భాగస్వామ్యం కావాలని కోరారు డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా.


డ్రగ్స్ వినియోగం, రవాణాపై దృష్టి పెట్టాం: విజయవాడ సీపీ రాజశేఖర్ బాబు

ఏపీ ప్రభుత్వం డ్రగ్స్ మీద ఒక యుద్దమే ప్రకటించిందని విజయవాడ సీపీ రాజశేఖర్ బాబు తెలిపారు. డ్రగ్స్ రవాణపై ఉక్కు పాదం‌ మోపుతున్నామని హెచ్చరించారు. డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా ఆధ్వర్యంలో శాటిలైట్ ఇమేజ్, డ్రోన్స్ ద్వారా గంజాయి సాగుని పూర్తిగా నియంత్రణ చేశామని అన్నారు. అంతకుముందు తొమ్మిది వేల ఎకరాల్లో గంజాయి సాగు జరిగేదని వివరించారు. ఇప్పుడు ఒక్క సెంట్ భూమిలో‌ కూడా గంజాయి సాగు లేకుండా డీజీపీ ఆదేశాలతో పని చేయగలిగామని పేర్కొన్నారు. డ్రగ్స్ వినియోగం, రవాణాపై దృష్టి పెట్టామని చెప్పుకొచ్చారు. క్విట్ ఎన్టీపీఎస్ అనే చట్టాన్ని ఉపయోగించి 27 మందిని జైలుకు‌ పంపామని వివరించారు.


డ్రగ్స్ విషయంలో ఏడాది పాటు జైల్లో ఉంచే కఠిన చట్టం ఉందని తెలిపారు. డ్రగ్స్ వినియోగం, సేవించే ప్రాంతాలను గుర్తించామని తెలిపారు. అన్ని‌జిల్లాల్లో డ్రోన్ల ద్వారా పటిష్ఠమైన నిఘా పెట్టామని అన్నారు. ఎన్టీఆర్‌ జిల్లా పోలీసు కమిషనరేట్ పరిధిలో పది వేల‌ కెమెరాలు పెట్టామని తెలిపారు. అసాంఘిక శక్తులపై దృష్టి పెట్టి చర్యలు తీసుకుంటున్నామని చెప్పుకొచ్చారు. 43 డ్రోన్స్ ఏర్పాటు చేసి అనుమానాస్పద ప్రాంతాలను జల్లెడ పడుతున్నామని వివరించారు. బైకులు దొంగిలించి గంజాయి రవాణా చేస్తున్న వారిని పట్టుకున్నామని తెలిపారు. యువత మత్తు పదార్థాలకు‌ బానిస ‌కావద్దని విజ్ఞప్తి చేశారు. ప్రజల్లో‌ కూడా డ్రగ్స్‌పై అవగాహన కల్పించేందుకు ఈగల్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా సైకిల్ ర్యాలీలు నిర్వహిస్తున్నారని విజయవాడ సీపీ రాజశేఖర్ బాబు పేర్కొన్నారు.


ఆపరేషన్ గరుడ పేరుతో చర్యలు తీసుకున్నాం:ఈగల్ చీఫ్ రవికృష్ణ

గంజాయి, డ్రగ్స్ రవాణా, సేవించే ప్రాంతాలను గుర్తిస్తూ ప్రజల్లో చైతన్యం తీసుకువస్తున్నామని ఈగల్ చీఫ్ రవికృష్ణ వ్యాఖ్యానించారు. యువత జీవితాలు కూడా ఈ మత్తు పదార్థాలతో నాశనం అవుతున్నాయని పేర్కొన్నారు. ఆయా ‌ప్రాంతాల్లో వీటికి సంబంధించిన సమాచారం ఉంటే 1972 నెంబర్‌కి సమాచారం ఇవ్వాలని సూచించారు. డీజీజీ ఆధ్వర్యంలో ఐదు ఆపరేషన్లను విజయవంతంగా నిర్వహించామని గుర్తుచేశారు. గంజాయి సాగును ఏపీలో లేకుండా నిర్మూలించామని చెప్పుకొచ్చారు. రైళ్లల్లో డ్రగ్స్, గంజాయి సరఫరా కాకుండా అనేక‌ ఆపరేషన్‌లు నిర్వహించామని తెలిపారు. మెడికల్ షాపుల్లో కూడా ఎన్‌ఆర్‌ఎక్స్ డ్రగ్స్ అమ్మకుండా ఆపరేషన్ గరుడ పేరుతో చర్యలు తీసుకున్నామని వివరించారు.


ఏపీలో 70 లక్షల మంది‌ విద్యార్థులు ఉన్నారని... వారికి అవగాహన కల్పిస్తున్నామని చెప్పుకొచ్చారు. ‘ఆపరేషన్ సేఫ్.. క్యాంపస్ జోన్’ పేరుతో విద్యా సంస్థలకు వంద మీటర్ల లోపు విక్రయాలు చేయకూడదని నిబంధనలు పెట్టామని గుర్తుచేశారు. స్మగ్లర్‌ల‌ ఆస్తులు రూ.15 కోట్లు వరకు సీజ్ చేశామని తెలిపారు. క్విట్ ఎన్టీపీఎస్‌ చట్టం ద్వారా డ్రగ్స్ రవాణా చేసే వారిని ఏడాది‌పాటు జైల్లో ఉంచామని అన్నారు. డ్రగ్స్ వినియోగం టెర్రరిస్టుల చర్యలకు ఊతమిస్తుందని తెలిపారు. డ్రగ్స్‌పై ఖర్చు పెట్టె దానిలో‌ కొంత డబ్బు ఉగ్రవాద దేశాలకు వెళ్తుందని అన్నారు. భారతదేశం‌పై‌ ప్రేమ‌ అభిమానం‌ ఉన్న వారు ఎవరూ ఈ డ్రగ్స్ జోలికి వెళ్లరని చెప్పుకొచ్చారు. యువత కూడా ఈ అంశాలు తెలుసుకుని మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ఈగల్ చీఫ్ రవికృష్ణ సూచించారు.


ఈ వార్తలు కూడా చదవండి...

సత్యసాయి చూపిన మార్గంలో కోట్లాది భక్తులు నడుస్తున్నారు: మంత్రి నారా లోకేశ్

ఏపీలో భారీ పేలుడు.. ఏమైందంటే..

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 23 , 2025 | 08:53 AM