AP CM Delhi Visit: కేంద్రమంత్రి మన్సుఖ్‌తో సీఎం చంద్రబాబు భేటీ.. ఏం చర్చించారంటే
ABN , Publish Date - Jul 16 , 2025 | 01:06 PM
AP CM Delhi Visit: కృష్ణానదీ తీరంలో వాటర్ స్పోర్ట్స్ శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు విస్తృత అవకాశాలున్నాయని కేంద్రమంత్రికి సీఎం చంద్రబాబు వివరించారు. క్రీడలకు సంబంధించి వివిధ మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధి ప్రాజెక్టులపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం వివిధ ప్రతిపాదనలను మంత్రిత్వశాఖకు పంపినట్టు కేంద్రమంత్రికి సీఎం తెలిపారు.

న్యూఢిల్లీ, జూలై 16: దేశ రాజధాని ఢిల్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) రెండో రోజు పర్యటన కొనసాగుతోంది. ఈరోజు (బుధవారం) ఉదయం కేంద్ర యువజన సర్వీసులు, క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయతో (Union Minister Mansukh Mandaviya) సీఎం భేటీ అయ్యారు. ఏపీలో స్టేడియంల నిర్మాణం, క్రీడా ప్రాంగణాల అభివృద్ధికి రూ. 341 కోట్లు కేటాయింపుల అంశంపై చర్చించారు. అమరావతిలో అంతర్జాతీయ ప్రమాణాలతో బ్యాడ్మింటన్ శిక్షణా కేంద్రం ఏర్పాటుకు సహకారం అందించాలని కేంద్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో క్రీడాభివృద్ది కోసం చేపట్టాల్సిన ప్రాజెక్టులు, మౌలిక సదుపాయాల కల్పనపై కేంద్ర మంత్రితో సీఎం చర్చించారు. అమరావతిలో జాతీయ జల క్రీడల శిక్షణా హబ్ ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
కృష్ణానదీ తీరంలో వాటర్ స్పోర్ట్స్ శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు విస్తృత అవకాశాలున్నాయని సీఎం వివరించారు. క్రీడలకు సంబంధించి వివిధ మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధి ప్రాజెక్టులపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం వివిధ ప్రతిపాదనలను మంత్రిత్వశాఖకు పంపినట్టు కేంద్రమంత్రికి సీఎం తెలిపారు. నాగార్జునా యూనివర్సిటీ, కాకినాడలలో నేషనల్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ల ఏర్పాటుకు ప్రతిపాదించినట్టు వెల్లడించారు. తిరుపతి, రాజమహేంద్రవరం, కాకినాడ, నరసరావుపేటలలో ఖేలో ఇండియా కింద మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టులను పూర్తి చేయాలని పేర్కొన్నారు. విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియం అభివృద్ధికి రూ.27 కోట్లు, గుంటూరు బీఆర్ స్టేడియంలో మల్టీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఏర్పాటుకు రూ.170 కోట్లు, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో క్రీడల అభివృద్ధికి రూ.341 కోట్లు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు.
జిల్లాల్లో ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించేందుకు అదనంగా ఖేలో ఇండియా కేంద్రాలు మంజూరు చేయాలని వినతి చేశారు. రాయలసీమలోని తిరుపతిలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా శిక్షణా కేంద్రం ఏర్పాటును పరిశీలించాలని ముఖ్యమంత్రి కోరారు. 2024-29 స్పోర్ట్స్ పాలసీలో భాగంగా ఏపీలో స్పోర్ట్స్ ఎకో సిస్టం అభివృద్దికి చర్యలు చేపట్టినట్టు సీఎం వెల్లడించారు. ఖేలో ఇండియా మార్షల్ ఆర్ట్స్ గేమ్స్ 2025ను ఏపీలో నిర్వహించేందుకు అవకాశం ఇవ్వడంపై కేంద్ర మంత్రి మాండవీయకు ముఖ్యమంత్రి ధన్యవాదాలు తెలియచేశారు. విజయవాడ, విశాఖ తదితర నగరాల్లో అత్యుత్తమ క్రీడా వేదికలపై వీటిని నిర్వహిస్తామని సీఎం స్పష్టం చేశారు. ఖేలో ఇండియా మార్షల్ ఆర్ట్స్ గేమ్స్ నిర్వహణకు రూ.25 కోట్లు విడుదల చేయాలని కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరారు.
ఇవి కూడా చదవండి..
అవన్నీ జగన్‌కు వెన్నతో పెట్టిన విద్య: ధూళిపాళ్ల నరేంద్ర
పోలీసులకు సవాల్ విసిరిన దొంగలు.. ఏకకాలంలోనే
Read Latest AP News And Telugu News