Minister Satya Prasad: జగన్ హయాంలో టిడ్కో ఇళ్లను తాకట్టు పెట్టి పేదలను అప్పుల్లోకి నెట్టారు
ABN , Publish Date - Nov 12 , 2025 | 12:31 PM
పేదలకు ఇళ్లు ఇవ్వకుండా జగన్ హయాంలో రోడ్లు, డ్రైనేజీ, నీరు, విద్యుత్ ఇళ్లకు గృహ ప్రవేశాలు చేసి చేతులు దులుపుకున్నారని మంత్రి అనగాని సత్యప్రసాద్ విమర్శించారు. సొంత స్థలం ఉండి ఇళ్లు నిర్మించుకోలేని పేదలకి కూడా తమ ప్రభుత్వం సాయం చేస్తోందని భరోసా కల్పించారు.
అమరావతి, నవంబరు12 (ఆంధ్రజ్యోతి): మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mahon Reddy) హయాంలోని గత ఐదేళ్లలో భారీ దోపిడీకి పాల్పడ్డారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ , స్టాంప్స్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ (Minister Anagani Satya Prasad) సంచలన వ్యాఖ్యలు చేశారు. పేదలందరికీ ఇళ్లు ఇస్తానని చెప్పి సెంటు పట్టా పేరుతో జగన్, ఆయన అనుచరులు భారీ దోపిడికి తెర లేపారని ఆరోపించారు.
పేదవాడి ఇంటికి సెంటు స్థలం ఇచ్చి తాను మాత్రం విలాసవంతమైన ప్యాలెస్‌లో జగన్ సేదతీరేవారని ఎద్దేవా చేశారు.సెంటు పట్టా పేరుతో జగన్ అండ్ కో రూ.7,500 కోట్లు దోచుకున్నారని ధ్వజమెత్తారు. గత టీడీపీ ప్రభుత్వం పూర్తి చేసిన టిడ్కో ఇళ్లను కూడా పంచకుండా వాటిని తాకట్టు పెట్టి పేదలను అప్పుల ఊబిలోకి జగన్ అండ్ కో నెట్టారని మండిపడ్డారు. ఇవాళ (బుధవారం) ఏపీ సచివాలయంలో మీడియాతో మాట్లాడారు అనగాని సత్యప్రసాద్.
ఈ రోజు పేదల సొంతింటి కల సాకారమవుతున్న చారిత్రాత్మక రోజు అని ఉద్ఘాటించారు. ప్రతి ఒక్కరికీ సొంతిళ్లు ఉండాలనేది దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు ఆశయమని.. దీనిని కూటమి ప్రభుత్వం నెరవేరుస్తోందని నొక్కిచెప్పారు. సీఎం చంద్రబాబు దూరదృష్టితో 16 నెలల్లోనే మూడు లక్షల ఇళ్లు పూర్తి చేసి పేదలకు అందిస్తున్నామని వ్యాఖ్యానించారు.
ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ఇళ్ల నిర్మాణంలో జాప్యం లేకుండా మూడు లక్షల ఇళ్లను పూర్తి చేశామని స్పష్టం చేశారు. 2014 నుంచి 2019లోపు పట్టణాల్లో సెంటున్నర, గ్రామాల్లో 2 సెంట్లు ఇచ్చి పేదల పెన్నిదిగా చంద్రబాబు నిలిచారని పేర్కొన్నారు. కానీ జగన్ మాత్రం దాన్ని సెంటుకు కుదించి పేదల ద్రోహిగా మారారని విమర్శించారు. 2014 నుంచి 2019లో టిడ్కోతో కలిపి 12 లక్షల గృహాలను గత టీడీపీ ప్రభుత్వం పూర్తి చేసి పేదలకు అందించిందని స్పష్టం చేశారు. ఇళ్లు కాదు, ఊళ్లే నిర్మిస్తామని జగన్ చెప్పారని.. కానీ ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నల వర్షం కురిపించారు మంత్రి అనగాని సత్యప్రసాద్.
పేదలకు ఇళ్లు ఇవ్వకుండా జగన్ హయాంలో రోడ్లు, డ్రైనేజీ, నీరు, విద్యుత్ ఇళ్లకు గృహ ప్రవేశాలు చేసి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. సొంత స్థలం ఉండి ఇళ్లు నిర్మించుకోలేని పేదలకి కూడా తమ ప్రభుత్వం సాయం చేస్తోందని భరోసా కల్పించారు. పేద, మధ్య తరగతి వారి కోసం రూ.4 లక్షలు ఇంటి నిర్మాణానికి అందజేస్తామని ప్రకటించారు. 2029 నాటికి ప్రతి అర్హుడికి పక్కా ఇల్లు ఇవ్వడమే తమ ప్రభుత్వం లక్ష్యమని అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
ఏపీలో కిడ్నీ రాకెట్ ముఠా గుట్టురట్టు.. సంచలన విషయాలు వెలుగులోకి...
వైసీపీ ర్యాలీకి అనుమతుల్లేవ్.. పోలీసుల వార్నింగ్
Read Latest AP News And Telugu News