Minister Narayana: అమరావతి పనులపై జగన్‌కు అవగాహన లేదు.. మంత్రి నారాయణ ఫైర్
ABN , Publish Date - Dec 04 , 2025 | 07:22 PM
రాజధాని అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డికి అవగాహన లేదని మంత్రి నారాయణ ఫైర్ అయ్యారు. అమరావతికి వచ్చి చూస్తే ఆ పనులు కనిపిస్తాయని చెప్పుకొచ్చారు. భూ సమీకరణకు, సేకరణకు కూడా జగన్‌కు తేడా తెలియదని ఎద్దేవా చేశారు.
అమరావతి, డిసెంబరు 4 (ఆంధ్రజ్యోతి): సీఆర్డీఏ 55వ అధారిటీ సమావేశం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఇవాళ(గురువారం) ఏపీ సచివాలయంలో జరిగింది. ఈ సమావేశానికి సంబంధించిన వివరాలను మీడియాకు మంత్రి నారాయణ (Minister Narayana) వెల్లడించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో వివిధ ప్రాజెక్టులకు ఆమోదం తెలిపారని వివరించారు. జ్యుడిషియల్ అకాడమీకి రూ.163కోట్లతో పరిపాలనా అనుమతులకు ఆమోదం తెలిపామని వివరించారు మంత్రి నారాయణ.
సీడ్ యాక్సిస్ రహదారిని 16వ జాతీయ రహదారికి అనుసంధానించే పనులకు రూ. 532కోట్ల మేర ఆమోదం తెలిపామని అన్నారు. జనవరికల్లా సీడ్ యాక్సిస్ రహదారిని మంగళగిరి రోడ్డుకు కలుపుతామని వివరించారు. జాతీయ రహదారికి కలిపే ప్రక్రియా వేగంగా సాగుతోందన్నారు. మధ్యలో స్టీల్ వంతెనల ఏర్పాటు ద్వారా సీడ్ యాక్సిస్ రహదారి మంగళగిరి, జాతీయ రహదారికి అనుసంధానం కానుందని తెలిపారు. రెండోదశ భూ సమీకరణపై సీఎం వద్ద చర్చ జరిగిందని అన్నారు. తొలి దశ రైతులకు ఇచ్చిన ప్యాకేజీనే రెండో దశ రైతులకూ వర్తిస్తోందని స్పష్టం చేశారు. క్యాపిటల్ గెయిన్స్ మినహాయింపుపై కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ సానుకూలంగా స్పందించారని పేర్కొన్నారు మంత్రి నారాయణ.
రాజధానిలో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డికి అవగాహన లేదని.. ఇక్కడకు వచ్చి చూస్తే ఆ పనులు కనిపిస్తాయని చెప్పుకొచ్చారు. అవగాహన లేకుండా అమరావతి గురించి తమ ప్రభుత్వాన్ని జగన్ విమర్శిస్తున్నారని ధ్వజమెత్తారు. భూ సమీకరణకు, సేకరణకు కూడా జగన్‌కు తేడా తెలియదని ఎద్దేవా చేశారు. రాజధాని పనులను ముందుగా తెలుసుకుని.. ఆ తర్వాత ఆయన మాట్లాడాలని హితవు పలికారు. సీఆర్డీఏ అధారిటీ సమావేశంలో గవర్నర్ బంగళా లోక్ భవన్ నిర్మాణానికి టెండర్ వేయడానికి రూ.160కోట్లకు నిర్ణయం తీసుకున్నామని వివరించారు. యాన్యువల్ రిపోర్టులు 2024 నుంచి 2025 రిపోర్టులు ఇవ్వడానికి పర్మిషన్ ఇచ్చారని చెప్పుకొచ్చారు మంత్రి నారాయణ.
నాబార్డు అధికారులు ఇస్తామన్న లోన్ రూ.7380 కోట్లు తీసుకోవడానికి బోర్డు ఓకే చెప్పిందని పేర్కొన్నారు. సీడ్ యాక్సిస్ రోడ్డు రూ.530 కోట్లతో నేషనల్ హైవేను కలపడానికి అప్రూవల్ ఫర్ అవార్డు ఇచ్చారని తెలిపారు. అంతర్జాతీయ స్పోర్ట్స్ సిటీకి, ఇన్నర్ రింగ్ రోడ్డుకు 16666 ఎకరాలు తీసుకోవాలనుకోవడంపైనా ఈ సమావేశంలో చర్చించామని పేర్కొన్నారు. రైతులతో కూడా ఈ విషయంపై చర్చించామని గుర్తుచేశారు. క్యాపిటల్ గెయిన్స్ విషయంలో సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి నిర్మాలా సీతారామన్ దృష్టికి తెచ్చామని తెలిపారు మంత్రి నారాయణ.
ఇక్కడ మరికొంత కాలం పొడిగిస్తే భూములను కొత్తగా పూలింగ్‌కి ఇచ్చేవారికి కూడా వర్తించేలా చర్యలు తీసుకుంటామని వివరించారు. స్కూళ్లు, అంగన్‌వాడీ సెంటర్‌లు రాజధానిలో చాలా వరకూ సిద్ధం అయ్యాయని చెప్పుకొచ్చారు. మార్చి చివరి నాటికి అధికారుల భవనాలు పూర్తి చేసేలా చర్యలు చేపడుతామని తెలిపారు. కరకట్ట రోడ్డు ఇప్పుడు టేకప్ చేస్తే రాజధానిలోకి రావడానికి విజయవాడ నుంచి దారి ఉండదని క్లారిటీ ఇచ్చారు. అందుకే ముందు సీడ్ యాక్సిస్ రోడ్డు టేకప్ చేసిన తర్వాత కరకట్ట రోడ్డు ప్రారంభిస్తామని తెలిపారు. అనంతరం అన్ని ఎల్పీఎస్ రోడ్లు నిర్మాణం ప్రారంభం అవుతాయని వివరించారు. ల్యాండ్ పూలింగ్‌కు తీసుకోని ఇంటర్‌నేషనల్ లెవల్‌లో నగరం నిర్మించాలంటే మనవద్ద మిగిలేది 15శాతం మాత్రమేనని మంత్రి నారాయణ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
'తెలుగు చదువుకుంటేనే ఉద్యోగం'.. వెంకయ్యనాయిడు కీలక వ్యాఖ్యలు!
పదవి పోయిన తర్వాత ఏపీలో ఎన్ని రోజులు ఉన్నావ్ జగన్: అనిత
Read Latest AP News And Telugu News