CM Chandrababu: మనదేశానికి బలమైన ఆర్థిక వనరు జనాభానే..
ABN , Publish Date - Jul 11 , 2025 | 01:05 PM
జనాభా పెరుగుదలను తాను సమర్థస్తున్నానని ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. పరిస్థితుల ఆధారంగా సరైన నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. నేడు ఏ దేశంలో జనం ఉంటే వారికే ఎక్కువ గౌరవమని ఉద్ఘాటించారు. మన దేశానికి బలమైన ఆర్థిక వనరు జనాభానే అని సీఎం చంద్రబాబు అభివర్ణించారు.

అమరావతి: భారతదేశానికి బలమైన ఆర్థిక వనరు జనాభానే అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) ఉద్ఘాటించారు. ‘దేశమంటే మట్టి కాదోయ్.. దేశం అంటే మనుషులోయ్’ అని గురజాడ అప్పారావు చెప్పారని ముఖ్యమంత్రి గుర్తుచేసుకున్నారు. ఆయన స్పూర్తిని అర్థం చేసుకుని మనం ముందుకెళ్లాలని సూచించారు.
ఏపీ సచివాలయంలో ఇవాళ (జులై 11, శుక్రవారం) ప్రపంచ జనాభా దినోత్సవ సదస్సులో (World Population Day) సీఎం చంద్రబాబు పాల్గొని ప్రసంగించారు. ఏపీలో జనాభా పెరుగుదలపై ఫోకస్ చేశామని చెప్పుకొచ్చారు. గతంలో ఇద్దరు పిల్లల కంటే.. ఎక్కువ మంది ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి వీలు లేదనే చట్టం తెచ్చానని గుర్తుచేశారు. ఈరోజు తానే జనాభా పెరుగుదలను సమర్థిస్తున్నానని వ్యాఖ్యానించారు. ఒకప్పుడు జనాభా ఎక్కువ ఉన్న దేశాలను చులకనగా చూసేవారని చెప్పుకొచ్చారు సీఎం చంద్రబాబు.
ఇప్పుడు ఏ దేశంలో జనం ఉంటే వారికే ఎక్కువ గౌరవం దక్కుతోందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ప్రపంచంలో ఎక్కువ జనాభా ఉన్న దేశం భారతదేశమని.. మన దేశంలో సుమారు 143 కోట్లమంది ఉండగా.. చైనా జనాభా 130 కోట్లని తెలిపారు. ప్రపంచంలో పాపులేషన్ పడిపోతోందని పేర్కొన్నారు. అమెరికాలో ఫెర్టిలిటీ(సంతానోత్పత్తి) రేటు 1.62 మాత్రమేనని.. 2.1 ఫెర్టిలిటీ రేటు ఉంటే రీప్లేస్‌మెంట్ ఉంటుందన్నారు. లేనిపక్షంలో రోజురోజుకూ జనాభా తగ్గిపోతుందని తెలిపారు. మన దేశంలో బిహార్ 3.0, మేఘాలయ 2.9, వంటి రాష్ట్రాల్లో ఎక్కువ ఫెర్టిలిటీ రేటు ఉందని తెలిపారు. అలాగే ఏపీలో అది 1.7కి చేరుకుందని సీఎం చంద్రబాబు వెల్లడించారు.
లోక్‌సభ సీట్లు పెరుగుతాయి..
‘రాబోయే రోజుల్లో లోక్‌సభ సీట్లు పెరుగుతాయి. దక్షిణాదిలో జనాభా పెరగకపోవడంతో లోక్‌సభ సీట్లు తగ్గుతాయని అంటున్నారు. జనాభా నియంత్రణ చేయాలంటే అమ్మాయిలు చదువుకోవాలి. ఆర్థిక స్థితిగతులు పెంచే ప్రయత్నం మా ప్రభుత్వం చేస్తోంది. మనిషిని రీప్లేస్ చేసేది భవిష్యత్తులో కూడా ఏదీ రాదు. ఉమ్మడి రాష్ట్రంలో సీఎం అయ్యాక తనకు చాలా సమస్యలు ఉన్నాయి. జీతాలు కూడా ఇవ్వలేని పరిస్ధితి నాది. మూడు నెలలకు ఒకసారి జీతాలు ఇచ్చేవాళ్లం. అప్పట్లో పీపీపీ మోడల్‌లో ఎన్నో ఏర్పాటు చేశాం. 17శాతం హైదరాబాద్ ఆదాయానికి ఎయిర్‌పోర్టు కారణం. అప్పట్లో వరుసగా నాకు అవకాశం ఇచ్చారు. అందుకే హైదరాబాద్ అభివృద్ధి చేయగలిగాం. ఏపీలో రెండోసారి జగన్ అధికారంలోకి వచ్చి.. ఉంటే ఎలా ఉండేదో ఆలోచించండి. ఎక్కువ మంది పిల్లలు ఉన్న దేశాల్లో ప్రోత్సాహకాలు. ఫ్రాన్స్‌లో చైల్డ్ అలవెన్స్ కింద ప్రత్యేక ప్యాకేజీలు. హంగేరీలో పెద్ద కుటుంబాలకు కార్ల బహుమతులు. చైనాలో ఇద్దరు పిల్లలు ఉంటే రూ.12 లక్షల ఆర్థిక సాయం అందిస్తున్నారు. భారత జనాభాలో 50 శాతం మహిళలే.. వీరు ఇంటికే పరిమితమైతే ఆర్థికంగా పైకి రాలేం. ఆర్టీసీ కండక్టర్లుగా ఆడపిల్లలను ఎంపిక చేసింది నేనే. ఆర్టీసీ డ్రైవర్లుగా కూడా రావాలని కోరా. వచ్చేవి ఎలక్ట్రికల్ వెహికల్స్.. డ్రైవింగ్ చేయడం సులభం. ఒకప్పుడు జనాభా నియంత్రణ.. ఇప్పుడు జనాభా నిర్వహణ. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ కోసం పాలసీలు తీసుకువస్తాం’ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
గుడ్ న్యూస్.. జర్నలిస్ట్ అవ్వాలనుకుంటున్నారా.. యువతకు ఆంధ్రజ్యోతి ఆహ్వానం
Read Latest AP News And Telugu News