Anam On Unemployed Archakas: అర్చక నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన మంత్రి ఆనం
ABN , Publish Date - Jul 12 , 2025 | 03:39 PM
Anam On Unemployed Archakas: శ్రీవాణి ట్రస్టు ద్వారా రాష్ట్రంలోని పునర్నిర్మాణంలో ఉన్న ఆలయాలకు రూ.147 కోట్లు విడుదల కాకుండా నిలిచిపోయాయని మంత్రి ఆనం అన్నారు. శ్రీవాణి ట్రస్టు ద్వారా మరో రూ.11 కోట్లు నిధులు మిగతా ఆలయాలకు రావాల్సి ఉందన్నారు.

తిరుమల, జులై 12: తిరుమలలో టీటీడీ, దేవాదాయశాఖ సంయుక్త సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి (Minister Anam Ramanarayana Reddy) మాట్లాడుతూ.. టీటీడీ చైర్మన్, ఈవో, అదనపు ఈవో, దేవాదాయ శాఖ అధికారులతో కలిసి సమీక్ష చేశామన్నారు. గతంలో సీఎం చంద్రబాబు (CM Chandrababu) దగ్గర జరిగిన సమావేశంలో ఆలయాలకు సంబంధించిన కొన్ని సమస్యలు ముందుకు వచ్చాయని.. వాటిని చర్చించుకొని రండి అని ముఖ్యమంత్రి ఆదేశించారని తెలిపారు. దేవాదాయ చట్టం ప్రకారం 9 శాతం కామన్ గుడ్ ఫండ్ టీటీడీ నుంచి తీసుకోవాల్సిన నిబంధనలు ఉన్నాయని చెప్పారు. గతంలో 5 శాతం ఉన్న దానిని 9 శాతానికి పెంచామని తెలిపారు.
రాష్ట్రంలో అర్చక నిరుద్యోగులుగా ఉన్న అర్చక స్వాములకు భృతి ఇవ్వాలని మేనిఫెస్టోలో ఉందన్నారు. ఆ మేరకు రాష్ట్రంలో 590 మంది వేద పండితులు నిరుద్యోగులుగా ఉన్నారని.. వారికి 3 వేల రూపాయలు ఇవ్వాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. శ్రీవాణి ట్రస్టు ద్వారా రాష్ట్రంలోని పునర్నిర్మాణంలో ఉన్న ఆలయాలకు రూ.147 కోట్లు విడుదల కాకుండా నిలిచిపోయాయన్నారు. శ్రీవాణి ట్రస్టు ద్వారా మరో రూ.11 కోట్ల నిధులు మిగతా ఆలయాలకు రావాల్సి ఉందని తెలిపారు. వీటన్నింటిపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని బోర్డు, అధికారులు చెప్పారని మంత్రి వెల్లడించారు.
విజయవాడ దుర్గ గుడికి వెళ్లేందుకు మరో రోడ్డు మార్గం వేసేందుకు టీటీడీ సహకారం కావాలని కోరారు. టీటీడీలో అన్యమతస్థులు ఉండేది వాస్తవమని స్పష్టం చేశారు. టీటీడీలో వెయ్యి మంది అన్యమతస్థులు ఉన్నారన్న కేంద్రమంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై విచారణ కొనసాగుతోందన్నారు. టీటీడీ కాలేజీ, పాఠశాలల్లో ఉన్న 192 పోస్టులను ఒప్పంద లెక్చరర్‌లతో భర్తీ చేసేందుకు చర్చించినట్లు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు. కాగా.. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన తొలి సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో టీటీడీ ఈవో, అదనపు ఈవో, దేవాదాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
ఆ ఇద్దరి మాటలు జగన్ అంతరంగంలోనివే: దేవినేని
టీటీడీపై ఇంత బండ వేస్తారా.. బండి సంజయ్‌పై భూమన ఆగ్రహం
Read Latest AP News And Telugu News