Share News

Gurukula Meal Menu: విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఇకపై మెనూలో..

ABN , Publish Date - Nov 15 , 2025 | 01:15 PM

గ్రామీణ ప్రాంతాల్లో పశుసంపద అభివృద్ధి జరిగేలా గోపాల మిత్రలు ఎంతో కృషి చేస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశంసించారు. వారి సమస్యలు వెంటనే పరిష్కరించాలని సంబంధిత మంత్రి శ్రీహరిని కోరుతున్నానని పేర్కొన్నారు.

Gurukula Meal Menu: విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఇకపై  మెనూలో..
Gurukula Mid Day Meal Menu

సిద్దిపేట జిల్లా, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): గురుకుల విద్యార్థులకు మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) శుభవార్త తెలిపారు. విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా మటన్, చికెన్‌లాగా.. ఇప్పటి నుంచి చేపలు కూడా మెనూలో ఉండేలా.. చూస్తామని పేర్కొన్నారు. విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకంలో చేపల కూరతో కూడిన భోజనం కూడా ఉండాలని తన దృష్టికి మంత్రి వాకిటి శ్రీహరి తీసుకువచ్చారని గుర్తుచేశారు.


చేప పిల్లల పెంపకంలో పొరపాట్లు: మంత్రి పొన్నం ప్రభాకర్

Ponnam-prabhakar.jpg

మంత్రి శ్రీహరి ఆకాంక్షలకు అనుగుణంగా గురుకుల మధ్యాహ్న భోజన మెనూలో చేపల కూరతో కూడిన భోజనాన్ని వడ్డించేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇవాళ(శనివారం) హుస్నాబాద్‌లో తెలంగాణ మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడారు. చేప పిల్లల పెంపకంలో గత ప్రభుత్వంలో కొన్ని పొరపాట్లు జరిగాయని విమర్శించారు. చేప పిల్లల సైజు చిన్నగా ఉండటంతో కొంత ఇబ్బందులు వచ్చాయని పేర్కొన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్.


హుస్నాబాద్‌కు ఇప్పుడు మూడు లక్షల చేప పిల్లలు ఇచ్చామని వివరించారు. ఇంకో 60 వేల చేప పిల్లలు ఇవ్వాలని సంబంధిత మంత్రి వాకిటి శ్రీహరికి విజ్ఞప్తి చేశారు. ఎల్లమ్మ చెరువుని సందర్శించడానికి వచ్చే టూరిజం పర్యాటకులు చేపలు కొనుక్కునేలా చేపల మార్కెట్ ఉండాలని సూచించారు. అక్కన్నపేట ఫోర్ లైన్ రోడ్డుకు రూ.50 కోట్ల నిధులు మంజూరయ్యాయని వెల్లడించారు మంత్రి పొన్నం ప్రభాకర్.


గ్రామీణ ప్రాంతాల్లో పశుసంపద అభివృద్ధి జరిగేలా గోపాల మిత్రలు ఎంతో కృషి చేస్తున్నారని ప్రశంసించారు. వారి సమస్యలని వెంటనే పరిష్కరించాలని మంత్రి శ్రీహరిని కోరుతున్నానని పేర్కొన్నారు. హుస్నాబాద్‌‌లో నిర్మించే వెటర్నరీ హాస్పిటల్ నూతన భవనాన్ని అన్ని సౌకర్యాలతో నిర్మించాలని మంత్రి శ్రీహరికి విజ్ఞప్తి చేశారు. అసంపూర్తిగా ఉన్న మోడరన్ చేపల మార్కెట్‌ను కూడా పూర్తి చేయాలని కోరారు. ఇక్కడ వెటర్నరీ పోస్టును వెంటనే మంజూరు చేయాలని మంత్రి శ్రీహరికి వినతి పత్రం సమర్పించారు పొన్నం ప్రభాకర్.


హుస్నాబాద్ అభివృద్ధికి కృషి చేస్తా: మంత్రి వాకిటి శ్రీహరి

VAKITI-SRIHARI.jpg

వెనుకబడిన వర్గాల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తోందని మంత్రి వాకిటి శ్రీహరి వ్యాఖ్యానించారు. మత్స్య పరిశ్రమ అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రూ.122.22 కోట్లు కేటాయించారని పేర్కొన్నారు. ఈ బడ్జెట్‌లో 84 కోట్ల చేపపిల్లలు, 10 కోట్ల రొయ్య పిల్లలని రాష్ట్రంలో ఉన్న 26వేల చెరువుల్లో ఉచిత చేప పిల్లలు పంపిణీ చేశామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోని ఐదు లక్షల మంది మత్స్య కారుల కుటుంబాలు మత్స్య సంపదపై ఆధారపడి జీవిస్తున్నాయని వివరించారు మంత్రి వాకిటి శ్రీహరి.


చేపల ఉత్పత్తి కేంద్రాలని పెంచి గణనీయంగా ఇతర ప్రాంతాలకు సరఫరా చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు. అత్యాధునిక సదుపాయాలతో ఫిష్ మార్కెట్లు కూడా ఏర్పాటు చేస్తామని వ్యాఖ్యానించారు. గుర్తింపు పొందిన మత్స్యకారులకు రూ.1.40 లక్షలతో ఇన్సూరెన్స్ పాలసీ తీసుకువచ్చామని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రుల సహకారంతో హాస్టల్స్‌లో ఉండేలా మధ్యాహ్న భోజనంలో చేపల వంటకం అమలు అయ్యేలా కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. హుస్నాబాద్ అభివృద్ధికి తన వంతుగా కృషి చేస్తానని మంత్రి వాకిటి శ్రీహరి పేర్కొన్నారు.



ఈ వార్తలు కూడా చదవండి..

హైదరాబాద్‌లో ఫైఓవర్‌పై ఘోర రోడ్డు ప్రమాదం

బీఆర్ఎస్ అగ్ర నేతలు అక్రమాలకు పాల్పడ్డారు.. కవిత షాకింగ్ కామెంట్స్

Read Latest Telangana News and National News

Updated Date - Nov 15 , 2025 | 01:52 PM