Congress Leader: కాంగ్రెస్ కీలక నేత హత్య కేసు.. వెలుగులోకి సంచలన విషయాలు
ABN , Publish Date - Jul 21 , 2025 | 07:49 PM
ఈనెల 14న రాత్రి 8 గంటలకు వరిగుంతం వద్ద కాంగ్రెస్ కీలక నేత అనిల్ హత్యకు గురయ్యారు. ఈ కేసుకు సంబంధించిన సంచలన విషయాలను మెదక్ ఎస్పీ శ్రీనివాసరావు వెల్లడించారు.

మెదక్ జిల్లా: కాంగ్రెస్ కీలక నేత అనిల్ హత్య కేసును (Congress Leader Anil Case) పోలీసులు ఛేదించారు. ఈ హత్య కేసులో ప్రధాన నిందితుడు కాంగ్రెస్ నేత రవీందర్ రెడ్డిగా (Ravinder Reddy) పోలీసులు గుర్తించారు. గతంలో రవీందర్‌రెడ్డికి అనుచరుడిగా అనిల్ ఉన్నారు. ఇద్దరూ ఒకే గ్రామానికి చెందిన వారని పోలీసులు తెలిపారు. ఇవాళ(సోమవారం జులై 21) మెదక్‌లోని తన కార్యాలయంలో ఎస్పీ శ్రీనివాసరావు (Medak SP Srinivas Rao) మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. అనిల్ హత్య కేసుకి సంబంధించిన కీలక వివరాలను వెల్లడించారు. ఈనెల(జులై) 14న కాంగ్రెస్ నేత అనిల్‌పై కాల్పులు జరిపి హత్య చేశారని చెప్పుకొచ్చారు.
ఐదుగురిని అరెస్టు చేశాం..
ఈ కేసులో ఏ1గా కాంగ్రెస్ నేత రవీందర్ రెడ్డి, ఏ2 నాగరాజు, ఏ3 నాగభూషణంని చేర్చామని మెదక్ ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. ఈ కేసులో ఐదుగురిని అరెస్టు చేశామని... మరో ఇద్దరిని త్వరలోనే పట్టుకుంటామని చెప్పారు. ముగ్గురికీ అనిల్ అంటే ద్వేషం ఉందని.. అనిల్ హైదరాబాద్‌తో సహా పలుచోట్ల ల్యాండ్ సెటిల్‌మెంట్లు చేశారని తెలిపారు. గతంలో కాంగ్రెస్ నేత రవీందర్ రెడ్డి, అతని భార్య లక్ష్మీకు అనుచరుడిగా అనిల్ ఉన్నారని వివరించారు. లక్ష్మీ మరణం తర్వాత రవీందర్‌రెడ్డికి, అనిల్‌కు విభేదాలు వచ్చాయని తెలిపారు. పెట్రోల్ బంకు విషయంలో ఇద్దరికీ గొడవలు జరుగుతున్నాయని.. రవీందర్ రెడ్డికి సంబంధించిన 12 ఎకరాల భూమి విషయంలోనూ వివాదం ఉందని వెల్లడించారు. గ్రామంలోనూ తనపై అనిల్ దుష్ప్రచారం చేస్తున్నారని రవీందర్ రెడ్డి కోపం పెంచుకున్నారని పేర్కొన్నారు. నాగభూషణం, నాగరాజుకీ అనిల్‌తో గొడవలు ఉన్నాయని మెదక్ ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు.
ఘటనా స్థలంలో 4 బుల్లెట్లు..
ఈ సందర్భంగా ఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ‘ఈనెల 14న రాత్రి 8గంటలకు వరిగుంతం వద్ద అనిల్ అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. ముందు యాక్సిడెంట్ అనుకున్నాం. కానీ, అక్కడికి వెళ్లి చూస్తే అనిల్ శరీరంపై బుల్లెట్ గాయాలు ఉన్నాయి. ఘటనా స్థలంలో 4 బుల్లెట్ షెల్స్ లభించాయి. దీంతో ఇద్దరు డీఎస్పీలు, ఏడుగురు సీఐలతో దర్యాప్తు ప్రారంభించాం. అనిల్ హత్య కేసుని లోతుగా దర్యాప్తు చేశాం. కుటుంబసభ్యులను విచారణ చేసి అనుమానితులను విచారించాం. విచారణలో రవీందర్ రెడ్డి, నాగరాజు, ఫరీద్ విజయవాడకు చెందిన చిన్న హత్యలో పాలు పంచుకున్నట్లు గుర్తించాం. మొత్తం ఏడుగురు అనిల్ హత్యలో పాల్గొన్నారు. రవీందర్ రెడ్డి, అనిల్ మధ్య మొదట్లో మంచి సంబంధాలే ఉండేవి. రాను రాను ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయి. రవీందర్ రెడ్డి భూముని అనిల్ కౌలుకు తీసుకున్నాడు. ఆ సమయంలో వివాదం ఏర్పడింది. రవీందర్ రెడ్డి, అనిల్ మధ్య గ్రామంలో గొడవలు మొదలయ్యాయి. రవీందర్ రెడ్డి భూమిని అమ్మనివ్వకుండా అనిల్ అడ్డుపడ్డాడు. నాగరాజు అనే వ్యక్తి సర్పంచ్‌గా పోటీ చేస్తానంటే అనిల్ బెదిరించాడని’ తెలిపారు.
వారితో గొడవలు..
‘అనిల్‌కి గత కొంతకాలంగా ఏ1, ఏ2, ఏ3లతో గొడవలు ఉన్నాయి. ముగ్గురు కలిసి అనిల్‌ని చంపేయాలని అనుకున్నారు. కత్తులతో హత్య చేస్తే అనిల్ తిరిగి దాడి చేసే అవకాశం ఉందని గన్‌తో కాల్చి చంపాలని అనుకున్నారు. బిహార్‌లో సుచిత్ అనే వ్యక్తి వద్ద గన్ కొనుగోలు చేసి ఫరీద్ అనే వ్యక్తి నేపాల్ సరిహద్దుల్లో ఫైరింగ్ ప్రాక్టీస్ చేశాడు. గన్‌తో జమ్మికుంటలో ట్రైన్ దిగిన ఫరీద్‌ని నాగరాజు పికప్ చేసుకున్నాడు. అనిల్‌తోపాటు శేఖర్, నాగభూషణం అనే ఇద్దరూ ఈనెల 14న హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌కి వెళ్లారు. హైదరాబాద్‌లో ఓ సెటిల్‌మెంట్ కోసం ముగ్గురు కలిసి వెళ్లారు. హత్య జరిగే వరకూ నిందితులు అనిల్‌తోనే ఉన్నారు. ఓ ఆల్టో కారు, మరో కారులో అప్పటికే అనిల్‌ని హత్య చేయాలని ప్లాన్ చేసుకున్నారు. వరిగుంతం వద్ద షాబుద్దిన్ అనే వ్యక్తి అనిల్‌పై కాల్పులు జరిపి హత్య చేశారు. ఈ కేసులో ఐదుగురు నిందితులని అరెస్ట్ చేశాం. ఇద్దరు పరారీలో ఉన్నారు. వారిని త్వరలో పట్టుకుంటాం’ అని మెదక్ ఎస్పీ శ్రీనివాసరావు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
వారికి గుడ్‌న్యూస్.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
స్థానిక ఎన్నికలపై హరీష్‌రావు కీలక వ్యాఖ్యలు
Read latest Telangana News And Telugu News