HarishRao: భూములు అమ్ముకునేందుకు ప్లాన్ చేశారు.. సీఎం రేవంత్‌పై హరీశ్‌రావు షాకింగ్ కామెంట్స్
ABN , Publish Date - Nov 29 , 2025 | 03:18 PM
తెలంగాణ రాష్ట్రం కోసం మాజీ సీఎం కేసీఆర్ పోరాడారని మాజీ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ కేసీఆర్ పోరాటం గురించి మూర్ఖంగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.
సిద్దిపేట, నవంబరు29 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై మాజీమంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు (HarishRao) సంచలన వ్యాఖ్యలు చేశారు. గ్లోబల్ సమ్మిట్ పెట్టీ భూములు అమ్ముకునేందుకు రేవంత్‌రెడ్డి ప్లాన్ చేస్తున్నారని ఆరోపణలు చేశారు. ఇవాళ(శనివారం) సిద్దిపేట వేదికగా హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. నవంబర్ 29వ తేదీ ఒక చరిత్ర.. ఉద్యమాన్ని మలుపు తిప్పిన రోజు ఇదని చెప్పుకొచ్చారు. ఉద్యమానికి సిద్దిపేటకు అవినాభావ సంబంధం ఉందని గుర్తుచేశారు. సిద్దిపేటలో జరిగిన ఉద్యోగుల గర్జన ఒక చరిత్ర అని వివరించారు. కేసీఆర్ ఆమరణ దీక్ష ఒక చరిత్ర.. ఎన్నో త్యాగాలతో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని పేర్కొన్నారు హరీశ్‌రావు.
కేసీఆర్ పోరాడారు..
‘తెలంగాణ రాష్ట్రం కోసం మాజీ సీఎం కేసీఆర్ పోరాడారు. టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ కేసీఆర్ పోరాటం గురించి మూర్ఖంగా మాట్లాడుతున్నారు. డిసెంబర్ 9వ తేదీ తెలంగాణ రాష్ట్ర ప్రకటన కేసీఆర్ దీక్ష ఫలితమే. మిలియన్ మార్చ్ మా వంతు.. మిలియన్‌ల కొద్దీ డబ్బు మూటలు కట్టి ఢిల్లీకి పంపుడు కాంగ్రెస్ వంతు. తెలంగాణ ఉద్యమ ద్రోహి రేవంత్‌రెడ్డికి కోదండ రామ్ దగ్గర అయ్యారు. మన నిధులు, మన నీళ్లు మనకు దక్కేలా చేసింది కేసీఆర్. కృష్ణానది నీళ్ల పంపకంపై ఆంధ్రప్రదేశ్.. తెలంగాణ ఉద్యమాన్ని కించపరిచేలా ట్రైబ్యునల్ ముందు మూడు రోజులుగా వాదిస్తుంది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎం రేవంత్‌రెడ్డి ఎందుకు ఈ విషయంపై మాట్లాడటం లేదు. తెలంగాణ రాష్ట్ర మూడు కోట్ల ప్రజల ఆత్మగౌరవాన్ని కించపరచాలని చూడొద్దు. తెలంగాణ రావడంతోనే మన రాష్ట్రం పచ్చని మాగాణిగా మారి పంటలు పండుతున్నాయి. రాష్ట్రం ఉన్నంత కాలం కేసీఆర్ పోరాట చరిత్ర ఉంటుంది’ అని హరీశ్‌రావు పేర్కొన్నారు.
సిద్దిపేట అర్బన్ మండలం పొన్నాలలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో ఇవాళ(శనివారం) దీక్ష దివస్ జరిగింది. ఈ కార్యక్రమంలో హరీశ్‌రావు, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీలు దేశపతి శ్రీనివాస్, యాదవ రెడ్డి, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ఇటీవల మరణించిన ఉద్యమకారుడు అందెశ్రీకి నివాళులు అర్పించారు నాయకులు. అంతకుముందు దీక్షా దివస్ సందర్బంగా సిద్దిపేట రూరల్ పోలీస్ స్టేషన్ చౌరస్తా నుంచి పొన్నాల బీఆర్ఎస్ జిల్లా కార్యాలయం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఆవరణలో ఉద్యమ స్ఫూర్తి పైలాన్‌ను తిరిగి ఆవిష్కరించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
టీటీడీ కల్తీ నెయ్యి కేసులో మరో కీలక పరిణామం
డాక్టర్‌ను ట్రాప్ చేసిన సైబర్ కేటుగాళ్లు.. రూ.14 కోట్లు స్వాహా
Read Latest Telangana News And Telugu News