Harish Rao: రేవంత్ ప్రభుత్వానికి రైతు బంధుపై చిత్తశుద్ది లేదు.. హరీశ్‌రావు ఫైర్
ABN , Publish Date - Nov 30 , 2025 | 09:19 PM
కేసీఆర్ హయాంలో దసరా పండుగకు చీరలు ఇస్తే సీఎం రేవంత్‌రెడ్డి మాత్రం ఓట్లకు చీరలు ఇస్తున్నారని మాజీ మంత్రి హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. మహిళలకు ఇచ్చిన చీరలు యూనిఫామ్ చీరల్లాగా ఉన్నాయని విమర్శించారు. కేసీఆర్ పలు రంగుల చీరలు ఇచ్చారని... కోటి 30 లక్షల చీరలను ప్రతి బతుకమ్మకు కేసీఆర్ హయాంలో ఇచ్చామని గుర్తుచేశారు.
సంగారెడ్డి జిల్లా, నవంబరు30 (ఆంధ్రజ్యోతి): సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ని (Congress) ఓడగొడితేనే రెండు పంటలకు రైతుబంధు వస్తుందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు (Harish Rao) హెచ్చరించారు. సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం రైతులను తీవ్రంగా ఇబ్బంది పెడుతోందని ధ్వజమెత్తారు. ముల్లు కర్రతో పొడిచినా ఈ ప్రభుత్వానికి చలనం లేదని ఎద్దేవా చేశారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి రైతుబంధుపై ఒక విధానం లేదా..? అని ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డిది ఒకటే సూత్రం.. ధరలు పెంచుడు.. కమీషన్లు దంచుడు.. కేసీఆర్ తెచ్చిన పథకాలు బంద్ పెట్టుడు తప్పా ఆయన చేసిందేమీ లేదని సెటైర్లు గుప్పించారు హరీశ్‌రావు.
రైతుబంధుపై కాంగ్రెస్ సర్కార్ కుట్ర..
యాసంగిలో సగం మంది రైతులకు రైతుబంధు కోత.. సాగు చేసిన భూమికే అనే సాకుతో 70 లక్షల ఎకరాలకు రైతుబంధు ఎగ్గొట్టేందుకు సర్కారు కుట్ర చేస్తోందని ఆరోపించారు. పత్తి, చెరుకు, తోటల రైతులకు ఇకపై ఏడాదికి ఒకసారి మాత్రమే రైతుబంధు ఇస్తారా అని ప్రశ్నల వర్షం కురిపించారు. రేవంత్‌రెడ్డి కుట్రలను రైతులు తిప్పికొట్టాలని హెచ్చరించారు. సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఓడించకపోతే రైతుబంధు పథకం పూర్తిగా బంద్ కావడం ఖాయమని హెచ్చరించారు. ఇవాళ(ఆదివారం) నారాయణఖేడ్‌లో హరీశ్‌రావు పర్యటించారు. పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. అనంతరం స్థానిక సంస్థల ఎన్నికలపై గులాబీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు హరీశ్‌రావు.
ఆ ప్రాజెక్టులను పక్కన పెడితే ఊరుకోం..
‘బసవేశ్వర, సంగమేశ్వర ఎత్తిపోతల ప్రాజెక్టులను పక్కనబెడితే ఊరుకోం. ఈ పనులు వెంటనే మొదలుపెట్టకపోతే రైతుల పక్షాన త్వరలో పాదయాత్ర చేపడుతాం. బసవేశ్వర, సంగమేశ్వర ప్రాజెక్టులు ఎప్పుడు పూర్తి చేస్తారో రేవంత్‌రెడ్డి చెప్పాలి. ఈ రెండు ప్రాజెక్టుల పనులను వెంటనే ప్రారంభించాలని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. సంగారెడ్డి జిల్లా అభివృద్ధిని ఎందుకు అడ్డుకుంటున్నారు. ఎందుకు సంగమేశ్వర, బసవేశ్వర ప్రాజెక్టులు పూర్తి చేయడం లేదో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమాధానం చెప్పాలి. రూ. 1150 కోట్లను యాసంగి బోనస్ కింద సన్నవడ్లకు చెల్లించాలి. సాగు చేసిన భూమికే రైతుబంధు ఇస్తామని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు’ అని ఫైర్ అయ్యారు హరీశ్‌రావు.
రైతు బోనస్, పంటల బీమా ఎగ్గొట్టారు..
‘మూడు పంటలకు రైతుబంధు ఇవ్వాలని చెప్పిన రేవంత్‌రెడ్డి ఇప్పుడు సాగుచేసిన భూమికే రైతు బంధు ఇస్తామని అంటున్నారు. 55 లక్షల ఎకరాల్లో పత్తి పంట పండుతుంది. 8 నెలలకు ఒకసారి పంట వస్తుంది. అంటే పత్తి రైతుకు సంవత్సరానికి ఒకసారి రైతుబంధు ఇస్తావా. చెరుకు అనేది 11 నెలల పంట. చెరుకుకు ఒక్కసారే రైతుబంధు ఇస్తామని ప్రభుత్వం అంటోంది. పంట తోటలకు ఒక పంటకే ఇస్తారా..? 7 లక్షల ఎకరాల్లో కందులు సాగవుతోంది. పసుపు, పత్తి, ఆయిల్ పామ్, పండ్ల తోటలకు ఒకసారి మాత్రమే రైతుబంధు ఇస్తానని ప్రభుత్వం చెబుతోంది. రైతుబంధు ఎగ్గొట్టే ప్లాన్‌లో రేవంత్‌రెడ్డి ఉన్నారు. ఇప్పటికే రైతు బోనస్, పంటల బీమా ఎగ్గొట్టారు. ఈ యాసంగిలో సాగు చేసిన వారికే రైతు బంధు ఇస్తామని ప్రభుత్వం చెబుతోంది. కేసీఆర్ హయాంలో కరోనా కష్టకాలంలో కూడా రైతులకు రైతుబంధు ఇచ్చాం’ అని హరీశ్‌రావు గుర్తుచేశారు.
కేసీఆర్ హయాంలో రైతులందరికీ రైతుబంధు...
‘కేవలం వరికి మాత్రమే రైతుబంధు ఇస్తారా..? యాసంగిలో కోటి 46 లక్షల మందికి ఇస్తారా..? లేదా సగం మందికి ఎగ్గొడతారా..? కేసీఆర్ హయాంలో రైతులందరికీ రైతుబంధు సంవత్సరానికి రెండుసార్లు ఇచ్చాం. దేశంలో పత్తి దిగుబడి చాలా తగ్గిపోయిందని.. వారిని వెంటనే ఆదుకోవాలి. యాసంగికి పత్తి రైతులకు రైతుబంధు ఎగ్గొట్టాలని రేవంత్ రెడ్డి ప్లాన్ చేస్తున్నారు. కేసీఆర్ దసరా పండుగకు చీరలు ఇస్తే రేవంత్ రెడ్డి మాత్రం ఓట్లకు చీరలు ఇస్తున్నారు. మహిళలకు ఇచ్చిన చీరలు యూనిఫామ్ చీరల్లాగా ఉన్నాయి. కేసీఆర్ హయాంలో పలు రంగుల చీరలు ఇచ్చాం. కోటి 30 లక్షల చీరలను ప్రతి బతుకమ్మకు ఇచ్చాం. ఈ ప్రభుత్వం ఇస్తుంది 50 లక్షల చీరలే. మహిళలకు నెలకు రూ.2500 ఇస్తానని చెప్పి ఇవ్వకుండా ఎగ్గొట్టారు. రెండేళ్లకు రూ. 60,000లు ప్రతి మహిళకు బాకీపడ్డారని.. రేవంత్‌రెడ్డి ముందు బకాయిలు చెల్లించాలి’ అని హరీశ్‌రావు డిమాండ్ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
సీఎం రేవంత్‌రెడ్డి ఎన్నికల నిబంధనను ఉల్లంగిస్తున్నారు.. కవిత ఫైర్
నదీ జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం: ఎంపీ సురేశ్‌రెడ్డి
Read Latest TG News and National News