Congress Leader Shot Dead: కాంగ్రెస్ నేత హత్య కేసులో కీలక విషయాలు
ABN , Publish Date - Jul 15 , 2025 | 11:38 AM
Congress Leader Shot Dead: హైదరాబాద్‌లోని ప్రముఖ నిర్మాణ సంస్థ యజమానులతో అనిల్‌కు ఓ భూమి విషయంలో వివాదం నడుస్తోంది. నానక్‌రామ్ గూడాలోని ఆరు గుంటల స్థలం విషయంలో వారి మధ్య పది రోజుల క్రితం గొడవ జరిగినట్లు సమాచారం.

మెదక్, జులై 15: జిల్లాలోని కొల్చారం మండలం వరిగుంతం శివారులో గత రాత్రి కాల్పుల్లో మరణించిన కాంగ్రెస్ నేత అనిల్ హత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. అనిల్ ప్రయాణిస్తున్న కారును హైదరాబాద్ నుంచి మరో కారు, ఆటో వెంబడించినట్లు సీసీ టీవీ ఫుటేజ్ ద్వారా బయటపడింది. అనిల్ కారు నిర్మానుష్య ప్రాంతానికి రాగానే ఆయనపై దుండుగులు కాల్పులు జరిపారు. కారులోనే అనిల్ మృతిచెందాడు. అయితే కడప జిల్లాకు చెందిన ఎమ్మెల్యే కుటుంబంతో గత కొన్నేళ్లుగా అనిల్‌కు వివాదాలు ఉన్నట్లు తెలుస్తోంది. డబ్బు, భూ వివాదాలలో సదరు ఎమ్మెల్యే కుటుంబానికి చెందిన కారును అనిల్ లాక్కొచ్చినట్లు సమాచారం.
మరోవైపు హైదరాబాద్‌లోని ప్రముఖ నిర్మాణ సంస్థ యజమానులతో అనిల్‌కు ఓ భూమి విషయంలో వివాదం నడుస్తోంది. నానక్‌రామ్ గూడాలోని ఆరు గుంటల స్థలం విషయంలో వారి మధ్య పది రోజుల క్రితం గొడవ జరిగినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో అనిల్ హత్యకు కారణాలపై అన్ని కోణాల్లోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అలాగే అనిల్ చనిపోతూ తన ఎడమ చేతిపై ఓ ఫోన్ నెంబర్‌ను రాసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఫోన్ నెంబర్‌కు అనిల్‌కు ఎలాంటి సంబంధం ఉందనే విషయంపై కూడా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం మెదక్ ప్రభుత్వ ఆసుపత్రిలో అనిల్ మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి అయ్యింది. ప్రభుత్వాస్పత్రి మార్చురీ వద్ద కాంగ్రెస్ నేత కుటుంబీకులను గ్రంధాలయ చైర్మన్ సుహాసిని రెడ్డి, నర్సాపూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ ఆవుల రాజిరెడ్డి పరామర్శించారు.
కాగా.. గత రాత్రి గాంధీభవన్‌లో ఓ మీటింగ్‌ను ముగించుని ఇద్దరితో కలిసి అనిల్ స్వగ్రామానికి బయలుదేరారు. తనతో పాటు ఉన్న ఇద్దరిని వారి ఇంటి వద్ద దించి.. గ్రామానికి వెళ్తుండగా మార్గమధ్యలో నిర్మానుష్య ప్రాంతంలో కాల్పులు చోటు చేసుకున్నాయి. అనిల్ ప్రయాణిస్తున్న కార్ ముందు ఒక వాహనం, వెనకాల ఒక వాహనం ఫాలో అయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనా స్థలానికి సమీపంలో పాడుబడిన రైస్ మిల్లులో ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్‌ను పోలీసులు స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కారు నడుపుతన్నది అనిల్‌గా గుర్తించారు. కారు అద్దాలను దించి మాట్లాడుతున్న సమయంలోనే కాల్పులు జరిపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వెంటనే వారి నుంచి తప్పించుకునే క్రమంలో అనిల్ తన కారును పక్కనే ఉన్న పొలాల్లోకి తీసుకెళ్లినట్లు సమాచారం. దీన్ని గుర్తించిన స్థానికులు అనిల్‌ను ఆస్పత్రికి తరలించే లోపే మార్గమధ్యలోనే మృతిచెందాడు. కాంగ్రెస్ నేత మృతిపై పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేపట్టారు.
ఇవి కూడా చదవండి..
బనకచర్లపై చర్చ అనవసరం.. తేల్చేసిన తెలంగాణ సర్కార్
వాకింగ్ చేస్తున్న నేతపై కాల్పులు.. హైదరాబాద్‌లో దారుణం
Read latest Telangana News And Telugu News