Miss World 2025: పిల్లలమర్రిలో అందాల భామల పర్యటన
ABN , Publish Date - May 16 , 2025 | 09:31 PM
Miss World 2025: మహబూబ్‌నగర్ జిల్లాలోని పిల్లలమర్రిలో మిస్ వరల్డ్ పోటీదారులు శుక్రవారం నాడు సందడి చేశారు. అక్కడి పర్యాటక ప్రాంతాలను సందర్శించారు. అందాల భామలకు జిల్లా యంత్రాంగం ఘనంగా స్వాగతం పలికింది.

మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ జిల్లాలోని పిల్లలమర్రిలో ఇవాళ(శుక్రవారం) మిస్ వరల్డ్ పోటీదారులు పర్యటించారు. వారికి సంప్రదాయ నృత్యాలతో కళాకారులు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డి, జిల్లా కలెక్టర్ విజయేంద్రబోయి, మహబూబ్‌నగర్ జిల్లా ఎమ్మెల్యేలు వాకిటి శ్రీహరి, జీఎంఆర్, వీర్లపల్లి శంకర్, చిట్టెం పర్ణికారెడ్డి పాల్గొన్నారు. 16వ శతాబ్దం నాటి రాజరాజేశ్వర సమేత రామలింగేశ్వర స్వామి దేవాలయ విశిష్టతను మిస్ వరల్డ్ పోటీదారులకు చరిత్రకారుడు శివ నాగిరెడ్డి వివరించారు. ఆలయ ప్రాంగణంలో ఉమ్మడి పాలమూరు జిల్లాలో సేకరించిన పలు విగ్రహాల విశిష్టత గురించి తెలిపారు. అలాగే జిల్లా మ్యూజియాన్ని మిస్ వరల్డ్ పోటీదారులు సందర్శించారు. బతుకమ్మలతో వారికి ఘన స్వాగతం పలికారు. స్థానిక మహిళలతో కలిసి పోటీదారులు బతుకమ్మ ఆడారు. పిల్లలమర్రి మహావృక్షం చరిత్ర, విశిష్టతను అటవీశాఖ అధికారి మిస్ వరల్డ్ పోటీదారులకు వివరించారు. డీహైడ్రేషన్‌తో కాస్తా అస్వస్థతకు మిస్ వరల్డ్ చైనా కంటెస్టెంట్ గురయ్యారు.
ఎక్స్‌పీరియం ఎకో పార్క్‌ను సందర్శించిన అందాల భామలు..
హైదరాబాద్ శివారులోని ఎక్స్‌పీరియం ఎకో పార్క్‌ను మిస్ వరల్డ్ - 2024 ఘన విజేత చెక్ రిపబ్లిక్ క్రిస్టినా పిష్కోవాతో పాటు అమెరికా ఖండ ఓసియానియా మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు శుక్రవారం సాయంత్రం సందర్శించారు. మిస్ వరల్డ్ కంటెస్టెంట్‌లకు ఎక్స్‌పీరియం పార్క్ వద్ద డోల్ వాయిద్యం, గజ్జెలతో సాంప్రదాయంగా స్వాగతం పలికారు. పోటీదారులు ఉత్సాహంగా నృత్యం చేస్తూ ఈ సందర్శనలో భాగస్వాములు అయ్యారు. అధికారులు వాహనాల్లో వారిని తీసుకువెళ్లి ఎక్స్‌పీరియం పార్క్ ప్రదేశాలను చూపించారు.
ఈ సందర్శనలో మిస్ వరల్డ్ పోటీదారులకు హైదరాబాద్ పర్యావరణ సమతుల్యత, స్థిరమైన అభివృద్ధి ప్రయత్నాలను అధికారులు వివరించారు. ఎక్స్‌పీరియం ఏకో పార్లో గ్రీన్ టెక్నాలజీ, పర్యావరణ పరిరక్షణ, స్థానిక జీవవైవిధ్యం, సేంద్రీయ వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పించారు. పార్క్‌లోని ప్రకృతి సౌందర్యం, హరిత విహార ప్రాంతాలను పోటీదారులు సందర్శించారు. అద్భుతమైన సూర్యాస్తమయ దృశ్యాలను అందించే ప్రదేశం సండౌనర్ పాయింట్ , ప్రకృతి, ఆధ్యాత్మికత శాంతియుత సంగమం బుద్ధ ఇన్‌సైడ్ ట్రీ స్పాట్ , భూగర్భ శాస్త్రపరమైన అద్భుతం, రెడ్ టైల్ ఫార్మేషన్ స్పాట్, అపూర్వమైన ప్రకృతి ఛాయావృత ప్రదేశం ఓవల్/ఆంబ్రెలా ఆకారపు చెట్టు స్పాట్, హైటీ, డీజే సెషన్‌తో కూడిన రౌండ్ టేబుల్, ఈజిప్షియన్ రాక్ స్పాట్‌ను మిస్ వరల్డ్ పోటీదారులు సందర్శించారు. పార్క్ అందాలను వీక్షించిన మిస్ వరల్డ్ పోటీదారులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు.
ఎక్స్‌పీరియం పార్క్ గురించి అందాల భామలు ఏమన్నారంటే...
మిస్ కెనడా, ఎమ్మా మోరిసన్: ఎక్స్‌పీరియం పార్క్ చాలా అద్భుతంగా ఉంది. నా తల్లిదండ్రులు త్వరలో హైదరాబాద్‌కు వస్తున్నారు. ఎక్స్‌పీరియం పార్క్‌ను వారికి కూడా చూపిస్తాను.
మిస్ యుఎస్, అథెనా క్రాస్బీ: భూమిని రక్షించడం మన బాధ్యత. ఎక్స్‌పీరియం పార్క్, సృజనాత్మక డిజైన్ ద్వారా ప్రకృతితో ఎలా సామరస్యంగా జీవించవచ్చో చూపిస్తుంది.
మిస్ బ్రెజిల్, జెస్సికా పెడ్రోసో: ఎక్స్‌పీరియం పార్క్ చాలా బాగుంది. మా దేశాలు కూడా ఇలాంటి పార్కులను ప్రోత్సహించాలి.
మిస్ గయానా, జలీకా సామ్యూల్స్: ఎక్స్‌పీరియం పార్క్ ప్రకృతిని సంరక్షిస్తూ, అద్భుతాలను సృష్టిస్తోంది. ఎక్స్‌పీరియం పార్క్ ఎంతో బాగుంది. పర్యావరణ అవగాహన, సంస్కృతి, స్థిరత్వాన్ని ప్రోత్సహించే ఒక మార్గదర్శకంగా ఈ పార్క్ నిలిచింది.
తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలను ప్రపంచానికి చాటి చెప్పాలి: మంత్రి జూపల్లి కృష్ణారావు
మిస్ వరల్డ్ పోటీలను తెలంగాణకు తీసుకురావడంలో సీఎం రేవంత్‌రెడ్డి ఎంతో కృషి చేశారని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. ప్రపంచంలోని 22 దేశాల మిస్ వరల్డ్ పోటీ దారులు పిల్లలమర్రి వృక్షాన్ని సందర్శించడం తమ అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు. ప్రముఖ సాధుసంతులు, విద్యావేత్తలు పిల్లలమర్రి మహావృక్షం సందర్శించి జ్ఞానం పొందారని చరిత్ర చెబుతోందని అన్నారు ఇక్కడ మర్రి మహావృక్షం, ప్రముఖ దేవాలయాలు ప్రభుత్వం ఏర్పాటు చేసిందని గుర్తుచేశారు. మిస్ వరల్డ్ పోటీలు అయిపోయిన వెంటనే తెలంగాణలోని చారిత్రాత్మక స్థలాలు, అద్భుతమైన దేవాలయాలు, ప్రముఖ పర్యాటక కేంద్రాలను మిస్ వరల్డ్ పోటీదారులు ప్రత్యేకంగా చూడాలని కోరారు. మిస్ వరల్డ్ పోటీ దారులు తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలను ప్రపంచానికి చాటి చెప్పాలని తెలిపారు. మిస్ వరల్డ్ పోటీ దారులు తెలంగాణ టూరిజాన్ని ప్రమోట్ చేసేందుకు అంబాసిడర్లుగా తాము గౌరవిస్తున్నామని అన్నారు. మిస్ వరల్డ్ పోటీదారులు పిల్లలమర్రికి వచ్చినందుకు ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
పిల్లలమర్రి సంస్కృతి, సంప్రదాయాలను చాటి చెబుతోంది: ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి
పిల్లలమర్రి 700 సంవత్సరాల నాటిదని.. ఈ ప్రాంత సంస్కృతి, సంప్రదాయాలు, చరిత్రకు నిలువెత్తు సాక్ష్యంగా నిలిచిందని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి అన్నారు. మరో 700 సంవత్సరాల పాటు ఇలాగే ఉండాలని ఆశిస్తున్నామని తెలిపారు. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలను మిస్ వరల్డ్ పోటీదారులు తెలుసుకున్నారని చెప్పారు. ఈ జ్ఞాపకాలను ప్రపంచానికి చాటి చెబుతారని ఆశిస్తున్నామని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి అన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
Konda Surekha Comments: కామన్‌గా చెప్పా.. నా వ్యాఖ్యలు వక్రీకరించారు
MP Chamala: యూట్యూబ్ చానల్స్‌తో కేటిఆర్ తప్పుడు ప్రచారం...
Minor Blackmail Case: ఇన్‌స్టాగ్రామ్‌లో ట్రాప్.. అక్కను ప్రేమించాడు.. చెల్లెలు కావాలన్నాడు
Hyderabad: మాజీఎంపీ మధుయాష్కీ సంచలన కామెంట్స్.. ఆయన ఏమన్నారంటే..
Read Latest Telangana News And Telugu News