Venkaiah Naidu: సిందూర్, మహదేవ్ ఆపరేషన్‌లు చరిత్ర సృష్టించాయి: వెంకయ్యనాయుడు
ABN , Publish Date - Aug 03 , 2025 | 02:40 PM
ఆపరేషన్ సిందూర్ కేవలం ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడి చేయడం కాదని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు వెల్లడించారు. సాధారణ పౌరులకు ప్రమాదం లేకుండా ఆపరేషన్ చేపట్టడం త్రివిధ దళాల ప్రతిభకు నిదర్శనమని వ్యాఖ్యానించారు.

హైదరాబాద్: భారతదేశం సంస్కృతి, సంప్రదాయాలకు నిలయమని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు (Venkaiah Naidu) వ్యాఖ్యానించారు. భారతదేశం ఏ దేశం మీద కావాలని దాడి చేయదని.. ఆత్మరక్షణ కోసం మాత్రమే దాడి చేస్తుందని చెప్పుకొచ్చారు. ఇవాళ(ఆదివారం) గచ్చిబౌలిలో సెల్యూటింగ్ అవర్ హీరోస్ కార్యక్రమం నిర్వహించారు. వాయిస్ ఆఫ్ హైదరాబాద్ అకాడమీషియన్స్ ఆధ్వర్యంలో సెల్యూటింగ్ అవర్ హీరోస్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. డీఆర్టీవో చైర్మన్ సతీష్‌రెడ్డి, పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడారు. పెహల్గాం దాడుల్లో అమరులైన వీరులను స్మరిస్తూ వాయిస్ ఆఫ్ హైదరాబాద్ అకాడమీషియన్స్ కార్యక్రమం నిర్వహించడం మంచి పరిణామమని కొనియాడారు వెంకయ్య నాయుడు.
ఈ కార్యక్రమానికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని వెంకయ్య నాయుడు తెలిపారు. కులాన్ని, మతాన్ని, భాషను, వర్గాన్ని ఉపయోగించి కొన్ని సంస్థలు గొడవలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. నీరు, నింగి, నేల ప్రతి దానికి శక్తి ఉందని తెలిపారు. భారతదేశానికి పోరాడే శక్తి ఉందని.. భారత ప్రభుత్వం ఎప్పటికీ మన దేశ పౌరుల కోసం మాత్రమే పనిచేస్తోందని.. ఇతర దేశాల ఒత్తిడికి లొంగదని ఉద్ఘాటించారు. ఎవరి పని వాళ్లు చిత్తశుద్ధితో చేస్తే అదే దేశభక్తి అవుతుందని సూచించారు. సిందూర్, మహదేవ్ ఆపరేషన్లలో పాల్గొన్న త్రివిధ దళాలకు శుభాకాంక్షలు తెలిపారు. 22 నిమిషాల్లోనే లక్ష్యాన్ని ఛేదించడం, సిందూర్, మహదేవ్ ఆపరేషన్‌లని ముగించడం అద్భుతమని ప్రశంసించారు. ఏబీఆర్ఎస్ఎం అనేది ఒక టీచర్స్ యూనియన్ అని... అయినప్పటికీ ఈ సంస్థ దేశభక్తి కోసం కృషి చేయడం అభినందనీయమని కీర్తించారు. ఆపరేషన్ సిందూర్ కొత్త చరిత్రను సృష్టించిందని ఉద్ఘాటించారు. పెహల్గాంకు బదులుగా భారతసైన్యం ఆపరేషన్ మహదేవ్ చేపట్టి పెహల్గాం ఉగ్రవాదులను మట్టుపెట్టారని పేర్కొన్నారు వెంకయ్య నాయుడు.
ఆపరేషన్ సిందూర్ కేవలం పాకిస్థాన్ ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడి చేయడం కాదని వెంకయ్య నాయుడు వెల్లడించారు. సాధారణ పౌరులకు ప్రమాదం లేకుండా ఆపరేషన్ చేపట్టడం త్రివిధ దళాల ప్రతిభకు నిదర్శనంగా చెప్పొచ్చని వ్యాఖ్యానించారు. ఆపరేషన్ సిందూర్‌కు చాలా దేశాలు ఇండియాకు మద్దతిచ్చాయని చెప్పుకొచ్చారు. మూడు దేశాలు మాత్రమే ఆపరేషన్ సిందూర్‌ను వ్యతిరేకించాయని తెలిపారు. పాకిస్థాన్ చేసే ఎదురు దాడులను భారత త్రివిధ దళాలు సమర్థవంతంగా తిప్పికొట్టాయని ప్రశంసించారు. ఆపరేషన్ సిందూర్ ఆత్మ నిర్భర్ భారత్ ప్రాజెక్ట్‌కు ఆదర్శంగా నిలిచిందని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
లోకేష్ వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రులు ఫైర్..
ఆ పీఠాన్ని టార్గెట్ చేసుకున్న బీఆర్ఎస్.. అసలు ప్లాన్ ఇదేనా..?
Read latest Telangana News And Telugu News