Ujjaini Mahankali: బోనమెత్తిన లష్కర్.. తొలి బోనం సమర్పించిన మంత్రి ప్రభాకర్ దంపతులు
ABN , Publish Date - Jul 13 , 2025 | 07:48 AM
ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. అమ్మవారి ఆలయాన్ని అధికారులు సుందరంగా తీర్చిదిద్దారు. అమ్మవారి కీర్తనలతో గుడి పరిసరాలు హోరెత్తుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం తరఫున అమ్మవారికి మంత్రి పొన్నం ప్రభాకర్ దంపతులు తొలి బోనం సమర్పించారు.

సికింద్రాబాద్: ఉజ్జయిని మహంకాళి అమ్మవారి(లష్కర్) బోనాలు (Secunderabad Ujjaini Mahankali Bonalu) ఇవాళ (ఆదివారం, జులై 13)న ఘనంగా ప్రారంభమయ్యాయి. అమ్మవారి ఆలయాన్ని అధికారులు సుందరంగా తీర్చిదిద్దారు. అమ్మవారి కీర్తనలతో గుడి పరిసరాలు హోరెత్తుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం తరఫున అమ్మవారికి మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) దంపతులు తొలి బోనం సమర్పించారు. అనంతరం మంత్రి దంపతులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉజ్జయినికి బోనాలు సమర్పించడానికి భక్తులు భారీగా తరలి వస్తున్నారు. దీంతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి. అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తుల సౌకర్యార్థం ఆరు క్యూలైన్లు ఏర్పాటు చేశారు.
అలాగే బోనాలు సమర్పించడానికి వచ్చే భక్తుల కోసం ప్రత్యేకంగా రెండు క్యూలైన్లు ఏర్పాటు చేశారు. శివసత్తులకు ప్రత్యేకంగా మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మూడు గంటల వరకు ఆర్పీరోడ్, బాట షో రూం నుంచి ప్రవేశం కల్పించారు. దేవాలయానికి భక్తులు వెళ్లేందుకు వివిధ మార్గాల్లో పార్కింగ్ సదుపాయాలు ఏర్పాటు చేశారు. లష్కర్ బోనాల జాతర ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు పటిష్ట ఏర్పాట్లు చేశారు. ఉజ్జయిని మహంకాళి బోనాలకు పోలీసులు పటిష్టమైన బందోబస్తు నిర్వహిస్తున్నారు.
సుమారు 2500 మంది పోలీసులు బందోబస్తు చేస్తున్నారు. లా అండ్ ఆర్డర్, షీ టీమ్స్, టాస్క్‌ఫోర్స్ పోలీసులు బందోబస్తులో పాల్గొన్నారు. ప్రత్యేకంగా 200 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని ఇవాళ (ఆదివారం, జులై 13)న దర్శించుకోనున్నారు. సీఎం రానున్న దృష్ట్యా ఆలయం వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. సీఎంతో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకోనున్నారు. ఆలయానికి మంత్రులతోపాటు పలువురు వీఐపీలు కూడా రానున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
వికసిత్ తెలంగాణ బీజేపీకే సాధ్యం
Read Latest Telangana News And Telugu News