Pawan Kalyan: తెలుగు సినిమా రక్షణలో సజ్జనార్ చర్యలు కీలకం: పవన్ కల్యాణ్
ABN , Publish Date - Nov 17 , 2025 | 02:41 PM
తెలుగు సినిమా రక్షణలో హైదరాబాద్ సీపీ సజ్జనార్ చర్యలు కీలకమైనవని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రశంసించారు. ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్టు స్వాగతించదగ్గ పరిణామమని పేర్కొన్నారు.
అమరావతి, నవంబరు17 (ఆంధ్రజ్యోతి): సినిమా పైరసీ ముఠాను అరెస్ట్ చేసిన హైదరాబాద్ పోలీసులకు, సిటీ కమిషనర్ వీసీ సజ్జనార్‌కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అభినందనలు తెలిపారు. డబ్బుల రూపంలోనే కాదని, సృజనాత్మకతనూ పెట్టుబడిగా పెట్టి నిర్మించే సినిమాలను విడుదలైన రోజునే పైరసీ చేస్తున్నారని పేర్కొన్నారు. ఇంటర్నెట్‌లో మూవీలను పోస్ట్ చేస్తున్న ముఠాలతో చిత్ర పరిశ్రమ తీవ్రంగా నష్టపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు పవన్ కల్యాణ్.
చిత్రాలు విడుదలే ఒక మహా యజ్ఞంగా మారిపోయిన తరుణంలో పైరసీ ముఠాలను కట్టడి చేయడం దర్శకనిర్మాతలకు సాధ్యం కావడం లేదని వాపోయారు. పైరసీలో కీలకంగా ఉన్న ఐబొమ్మ, బప్పమ్ వెబ్‌సైట్ల నిర్వాహకుడు ఇమ్మడి రవిని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారని వివరించారు. రవితోనే వాటిని మూయించడం స్వాగతించదగ్గ పరిణామమని పేర్కొన్నారు. పోలీసులకు సవాల్ విసిరే స్థాయికి పైరసీ ముఠాలు వచ్చిన తరుణంలో హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసు బృందం చేసిన ఆపరేషన్ విజయవంతమైందని ప్రశంసించారు పవన్ కల్యాణ్.
ఈ ఆపరేషన్‌లో భాగమైన హైదరాబాద్ పోలీసులకు, సీపీ సజ్జనార్‌కి అభినందనలు తెలిపారు. బెట్టింగ్ మాఫియా, పొంజీ స్కీమ్స్ లాంటివాటిపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారని వివరించారు. వాటి వల్ల ప్రజలు ఏ విధంగా ఆర్థికంగా చితికిపోతున్నారనే విధంగా పోలీసులు చైతన్యపరుస్తున్నారని కీర్తించారు. సజ్జనార్‌తో ఓ సందర్భంలో సమావేశమైనప్పుడు పొంజీ స్కీమ్స్ మూలంగా ప్రజలు ఆర్థికంగా ఏ విధంగా మోసానికి గురై నష్టపోతున్నారో వివరించారని గుర్తుచేశారు. అలాగే బెట్టింగ్ యాప్స్‌ను నియంత్రించేందుకు సజ్జనార్ చేపట్టిన కార్యక్రమం అన్ని రాష్ట్రాల్లోనూ ఓ కదలిక తీసుకువచ్చిందని కొనియాడారు. సజ్జనార్ నేతృత్వంలో చేపట్టే చర్యలు కచ్చితంగా తెలుగు సినిమాకే కాదు యావత్ భారతీయ చిత్ర పరిశ్రమకు మేలు చేస్తాయని పవన్ కల్యాణ్ ప్రశంసించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఐ బొమ్మ నిర్వాహకుడు రవి అరెస్ట్.. సీవీ ఆనంద్ ఏమన్నారంటే..
షాకింగ్ .. ఐబొమ్మ, బప్పం టీవీ వెబ్‌సైట్లు బంద్..
Read Latest Telangana News and National News