Minister Ponguleti:కేసీఆర్ పగటి కలలు కంటున్నారు.. మంత్రి పొంగులేటి విసుర్లు
ABN , Publish Date - Apr 29 , 2025 | 02:29 PM
Minister Ponguleti Srinivasa Reddy: మాజీ సీఎం కేసీఆర్‌పై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం కోసం కేసీఆర్ పగటి కలలు కంటున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శించారు.

కామారెడ్డి: కాంగ్రెస్ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి మాజీ సీఎం కేసీఆర్ తట్టుకోలేక పోతున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మండిపడ్డారు. మళ్లీ అధికారం కోసం కేసీఆర్ పగటి కలలు కంటున్నారని విమర్శించారు. ఇవాళ( మంగళవారం) లింగంపేట్ మండలం షెట్‌పల్లిలో భూ భారతిపై అవగాహన సదస్సు జరిగింది. ఈ సదస్సులో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. భూ భారతి చట్టం పేదలకు చుట్టమని తెలిపారు. భూ భారతి చట్టాన్ని 9 నెలలు మేథోమధనం చేసి రూపొందించామని అన్నారు. పేదల సంక్షేమమే ఇందిరమ్మ సర్కారు లక్ష్యమని తెలిపారు. ధరణి చట్టంలో నాడు ఎలాంటి రూల్స్ లేవని చెప్పారు. భూ భారతి ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్‌గా నిలుస్తుందని అన్నారు. ధరణితో రైతులు కార్యాలయాలకు చెప్పులరిగేలా తిరిగారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
ధరణితో ఏర్పడ్డ భూ వివాదాలన్నీ భూ భారతి ద్వారా పరిష్కారం అవుతాయని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. కింది స్థాయిలో సమస్య పరిష్కారం కాకపోతే స్పెషల్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించవచ్చని తెలిపారు. సర్వే అధికారులు లేనందున చాలా ఇబ్బందులు ఎదురయ్యాయని అన్నారు. త్వరలో 6 వేలమంది ప్రైవేటు సర్వేయర్లను నియమిస్తామని తెలిపారు. పాస్‌బుక్‌లో సర్వే మ్యాప్ ఏర్పాటు చేస్తామని అన్నారు. పైలెట్ గ్రామాల్లో జూన్ 2వ తేదీ నాటికి వందశాతం భూ సమస్యలన్నీ తొలగిపోతాయని చెప్పారు. జూన్ 2వ తేదీ నుంచి ఆగస్టు 15వ తేదీ వరకు అన్ని మండలాల్లో భూ వివాదాల పరిష్కారమవుతాయని తెలిపారు. మే 5వ తేదీ లోగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని.. ఇది నిరంతర ప్రక్రియ అన్నారు. రాబోయే ఐదేళ్లు 20 లక్షల ఇళ్లు నిర్మిస్తామని ప్రకటించారు. తరతరాల నుంచి సాగు చేస్తున్న భూములకు హక్కు పత్రాలు ఇస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు.
ఇవి కూడా చదవండి
Rahul letter to PM: పహల్గామ్ ఉగ్రదాడిపై ప్రధానికి రాహుల్ లేఖ
Pakistani Citizens: హైదరాబాద్‌ను వీడిన పాకిస్థానీలు
Read Latest Telangana News And Telugu News