Share News

Mahesh Kumar Goud: బనకచర్ల విషయంలో గత కేసీఆర్ ప్రభుత్వం తప్పు చేసింది.. మహేష్ గౌడ్ ఫైర్

ABN , Publish Date - Aug 01 , 2025 | 07:29 PM

బనకచర్ల ప్రాజెక్టు సంపూర్ణంగా పూర్తయితే తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతుందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసి ప్రాజెక్టు నిర్మాణానికి అడ్డుకట్ట వేశామని గుర్తుచేశారు.

Mahesh Kumar Goud: బనకచర్ల విషయంలో గత కేసీఆర్ ప్రభుత్వం తప్పు చేసింది.. మహేష్ గౌడ్ ఫైర్
Mahesh Kumar Goud

వికారాబాద్ జిల్లా: బీఆర్ఎస్ (BRS) అధినాయకత్వంపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) సంచలన ఆరోపణలు చేశారు. బనకచర్ల విషయంలో గత పాలకులదే ముమ్మాటికీ తప్పని విమర్శించారు. బీఆర్ఎస్ నేతలు కేసీఆర్, హరీష్‌రావు తాకట్టు రాజకీయాలు చేసి ఆంధ్రా పాలకులకు మేలు చేశారని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ నేతల తప్పిదాలను సరిదిద్దేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్దంగా ఉందని ఆ దిశగా అడుగులు వేస్తోందని ఉద్ఘాటించారు. తాకట్టు పెట్టిన వాటాను వెనక్కు తేవడానికి ప్రయత్నిస్తుంటే బీఆర్ఎస్ నాయకులు తమ ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు మహేష్ కుమార్ గౌడ్.


ఇవాళ(శుక్రవారం) వికారాబాద్ జిల్లా పరిగిలో మహేష్ కుమార్ గౌడ్ పర్యటించారు. ఈ సందర్భంగా పరిగిలో జనహిత పాదయాత్ర ముగింపు అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌లో 2014 నుంచి మొన్నటి వరకు గత బీఆర్ఎస్ పాలకులు చేసిన తప్పిదాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని తెలిపారు. అప్పటి ఆంధ్రా పాలకులకు కేసీఆర్, హరీష్‌రావు తలొగ్గి కాంప్రమైజ్ అయ్యారని ఫైర్ అయ్యారు మహేష్ కుమార్ గౌడ్.


బనకచర్ల ప్రాజెక్టు సంపూర్ణంగా పూర్తయితే తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతుందని మహేష్ కుమార్ గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసి ప్రాజెక్టు నిర్మాణానికి అడ్డుకట్ట వేశామని గుర్తుచేశారు. బీఆర్ఎస్ నాయకుల తప్పిదాలు బయటకు వస్తాయని పసిగట్టి తమ ప్రభుత్వంపై ముందే ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. బనకచర్ల విషయంలో గత కేసీఆర్ ప్రభుత్వం తప్పు చేసింది... దాన్ని సరిదిద్దే క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

కాళేశ్వరంపై పీసీ ఘోష్ నివేదిక.. సీఎం రేవంత్‌రెడ్డికి సమర్పణ

సృష్టి ఫెర్టిలిటీ సెంటర్‌పై కొనసాగుతున్న విచారణ.. కస్టడీలో డాక్టర్ నమ్రత

Read latest Telangana News And Telugu News

Updated Date - Aug 01 , 2025 | 08:27 PM