Laxman: మరోసారి బీసీలని మోసం చేస్తున్న రేవంత్ సర్కార్.. లక్ష్మణ్ ఫైర్
ABN , Publish Date - Jul 12 , 2025 | 01:21 PM
బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చేందుకు రేవంత్‌రెడ్డి మంత్రివర్గంలో తీర్మానం చేయడం బీసీలను మరోసారి మోసగించడమేనని బీజేపీ రాజ్యసభ సభ్యులు డాక్టర్ కే. లక్ష్మణ్ విమర్శించారు. రేవంత్‌రెడ్డి సర్కార్‌కి కనీస ఇంగిత జ్ఞానం లేదని, బీసీల జీవితాలతో చెలగాటం ఆడుతూ వారిని రాజకీయ ఆస్త్రాలుగా మార్చుకునే ప్రయత్నం చేస్తోందని లక్ష్మణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఢిల్లీ: బీసీలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) మరోసారి మోసం చేస్తున్నారని బీజేపీ రాజ్యసభ సభ్యులు డాక్టర్ కే. లక్ష్మణ్ (Laxman) ఆరోపించారు. బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చేందుకు రేవంత్‌రెడ్డి మంత్రివర్గంలో తీర్మానం చేయడం అంటే బీసీలను మరోసారి మోసగించడమేనని విమర్శించారు. ఇవాళ(శనివారం) ఢిల్లీ వేదికగా లక్ష్మణ్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం పంపించిన బిల్లు రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉన్నప్పటికీ ఆ బిల్లుపై ఏమి తేల్చకుండా ఆర్డినెన్స్ తీసుకురావడంలో ఉన్న మతలబు ఏంటని ప్రశ్నించారు. బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసి పూర్తి స్వేచ్ఛ ఆయా రాష్ట్రాలకు ఉందని నొక్కిచెప్పారు లక్ష్మణ్.
రిజర్వేషన్లు కల్పించేందుకు ఒక ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేసి రాష్ట్రంలో ఏ కులానికి సంబంధించిన జనాభా ఎంత ఉందో లెక్కలు తేలిస్తే న్యాయస్థానాల్లో వాదన నిలబడే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. రిజర్వేషన్లలో వివిధ కులాలకు సంబంధించిన గణాంకాలను రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు బయట పెట్టడం లేదని నిలదీశారు. కులాలకు సంబంధించిన జనాభా ప్రామాణిక గణాంకాలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తే కోర్టులో రాష్ట్ర ప్రభుత్వ వాదన నిలబడే అవకాశం ఉందని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన బుర్ర వెంకటేశం ఆధ్వర్యంలో కమిషన్ బాధ్యతలను ఎందుకు సరిగ్గా నిర్వర్తించలేదని ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వివిధ కులాలకు సంబంధించిన ప్రామాణిక గణాంకాలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు లక్ష్మణ్.
2021లో వికాస్ కిషన్‌రావు వర్సెస్ మహారాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన కేసులో స్థానిక సంస్థల రిజర్వేషన్లకు సంబంధించి సుప్రీంకోర్టు మార్గదర్శకాలు స్పష్టంగా ఉన్నాయని చెప్పుకొచ్చారు. ఎస్సీ, ఎస్టీలతో పాటు బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కేటాయించినప్పుడు 50 శాతానికి మించకూడదనే నిబంధనను రేవంత్‌రెడ్డి ప్రభుత్వం పాటించిందా అని నిలదీశారు. బీఆర్ఎస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు రిజర్వేషన్ల పేరుతో బీసీలను గతంలో వంచించాయని మండిపడ్డారు. ఇప్పుడు ఇదేవిధంగా రేవంత్‌రెడ్డి బీసీలను దగా చేసి ఓట్లు దండుకొనే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు లక్ష్మణ్.
కామారెడ్డి డిక్లరేషన్‌లో ఇచ్చిన వాగ్దానాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు నిలపెట్టుకోవడం లేదని ప్రశ్నించారు. ఇప్పటి వరకు నిర్వహించిన అసెంబ్లీ సమావేశాల్లో బీసీ డిక్లరేషన్‌కు సంబంధించిన కనీస ప్రస్తావన ఎందుకు చేయలేదని నిలదీశారు. సెప్టెంబర్‌లోపు బీసీ రిజర్వేషన్లను తేల్చాలని తెలంగాణ హై కోర్టు ఆదేశించిందని.. కాబట్టే ఎన్నికలు త్వరగా నిర్వహించి మరోసారి బీసీలని మోసం చేయడానికే రేవంత్‌రెడ్డి సర్కార్ సిద్ధమవుతోందని విమర్శించారు. రాష్ట్రపతి దగ్గర 42శాతం రిజర్వేషన్‌లకు సంబంధించిన బిల్లు పెండింగ్‌లో ఉన్నప్పుడు ఆర్డినెన్స్ తీసుకువస్తే.. ఆ బిల్లుకి గవర్నర్ ఎలా ఆమోదం తెలుపుతారని ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డి సర్కార్‌కి కనీస ఇంగిత జ్ఞానం లేదని, బీసీల జీవితాలతో చెలగాటం ఆడుతూ వారిని రాజకీయ ఆస్త్రాలుగా మార్చుకునే ప్రయత్నం చేస్తోందని లక్ష్మణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి..
రీసెర్చ్ సెంటర్ ప్రాంగణంలో చిరుతల కలకలం
కల్తీ కల్లు బాధితులకు డయాలసిస్..
Read Latest Telangana News And Telugu News