CP Sajjanar: నగరంలో సీపీ సజ్జనార్ ఆకస్మిక తనిఖీలు.. పోలీసులకు కీలక ఆదేశాలు
ABN , Publish Date - Nov 24 , 2025 | 12:06 PM
హైదరాబాద్ నగర భద్రత కోసం పోలీసులు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని సీపీ సజ్జనార్ దిశానిర్దేశం చేశారు. ప్రజా సమస్యలను పరిష్కరించడానికి త్వరితగతిన స్పందించే విధంగా పోలీసు బృందాలు సిద్ధంగా ఉండాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
హైదరాబాద్, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): నగరంలో రాత్రివేళల్లో పోలీసింగ్‌ను మరింత బలోపేతం చేస్తున్నామని హైదరాబాద్ సీపీ సజ్జనార్ (Hyderabad CP Sajjanar) వ్యాఖ్యానించారు. క్షేత్రస్థాయిలో పోలీసు సిబ్బంది ఎలా స్పందిస్తున్నారనే విషయాన్ని తాను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు ఆకస్మిక పర్యటనలు చేస్తున్నానని పేర్కొన్నారు. పీపుల్ వెల్ఫేర్ పోలీసింగ్‌లో భాగంగా చేపడుతున్న ఈ పర్యటనలు పోలీసు సిబ్బంది బాధ్యతా భావాన్ని పెంపొందించడమే కాకుండా, మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తాయని చెప్పుకొచ్చారు సీపీ సజ్జనార్.

నిన్న(ఆదివారం) అర్ధరాత్రి సౌత్ వెస్ట్ జోన్‌లో సీపీ సజ్జనార్ ఆకస్మిక పర్యటన చేశారు. రాత్రి 12:00 గంటల నుంచి 3:00 గంటల వరకు లంగర్‌హౌస్, టోలిచౌకి పోలీస్ స్టేషన్ల పరిధిలోని రహదారులు, కీలక ప్రాంతాలు, సున్నితమైన పాయింట్లను ప్రత్యక్షంగా పరిశీలించారు. సైరన్, ఎలాంటి ఆర్బాటం లేకుండా ఆ వాహనంలోనే లంగర్ హౌజ్ పీఎస్ పరిధిలోని ఎండీ లైన్స్, ఆశాంనగర్, డిఫెన్స్ కాలనీల్లోని రౌడీ షీటర్ల ఇళ్లకు నేరుగా వెళ్లారు. ఇంట్లోనే ఉన్న రౌడీ షీటర్లను నిద్రలేపి… వారి నేర చరిత్ర, ప్రస్తుత జీవనశైలి, ఉపాధి పరిస్థితులు, సామాజిక వ్యవహార ధోరణులపై ఆరా తీశారు. మళ్లీ నేరాల వైపు అడుగులు వేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నేర ప్రవృత్తి వీడి సన్మార్గంలోకి రావాలని హితవు పలికారు సీపీ సజ్జనార్.

అలాగే, టోలిచౌకి పరిధిలో రాత్రిపూట తెరిచి ఉన్న హోటళ్లు, దుకాణాలు, ఇతర వ్యాపార సంస్థల్లోకి వెళ్లారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా రాత్రివేళల్లో షాపులు తెరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వ్యాపారులకు హెచ్చరికలు జారీ చేశారు.

పెట్రోలింగ్ సిబ్బంది ఎంతమేర అప్రమత్తంగా ఉన్నారు, రాత్రి వేళల్లో ప్రజల భద్రత కోసం ఎలాంటి చర్యలు చేపడుతున్నారనే అంశాలపై క్షేత్రస్థాయిలో నేరుగా ఆరా తీశారు. విధుల్లో ఉన్న కానిస్టేబుళ్లు, అధికారులను స్వయంగా కలుసుకుని, గస్తీ పాయింట్లు, తదితర సమస్యల పరిష్కారంపై వివరాలు తెలుసుకున్నారు సీపీ సజ్జనార్.

అనంతరం.. టోలిచౌకి పోలీస్ స్టేషన్‌ను సందర్శించి.. స్టేషన్ జనరల్ డైరీ, నిన్న రాత్రి చేసిన ఎంట్రీలు, డ్యూటీలోని సిబ్బంది హాజరు వివరాలు, వారికి అప్పగించిన బాధ్యతలను సమగ్రంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా సీపీ సజ్జనార్ మాట్లాడారు. విజిబుల్ పోలీసింగ్‌కు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని సిబ్బందికి సూచించారు. నగరంలో నేరాలపై కఠినమైన పర్యవేక్షణ కొనసాగుతోందని స్పష్టం చేశారు. హైదరాబాద్ నగర భద్రత కోసం పోలీసులు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని దిశానిర్దేశం చేశారు. ప్రజా సమస్యలను పరిష్కరించడానికి త్వరితగతిన స్పందించే విధంగా పోలీసు బృందాలు సిద్ధంగా ఉండాలని సీపీ సజ్జనార్ ఆదేశాలు జారీ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
వీసా రాకపోవడంతో మనస్థాపానికి గురై వైద్యురాలు ఆత్మహత్య
పోలీసుల విచారణకు సహకరించని ఐబొమ్మ రవి
Read Latest Telangana News and National News