Errabelli Dayakar Rao: సీఎం రేవంత్‌రెడ్డి ఇంటి ముందు ధర్నా చేస్తా.. ఎర్రబెల్లి మాస్ వార్నింగ్
ABN , Publish Date - Jul 18 , 2025 | 11:22 AM
రైతుల సమస్యలను పరిష్కరించడంలో రేవంత్ ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు విమర్శించారు. నాలుగు రోజుల్లో దేవాదుల నీటిని విడుదల చేయాలని.. లేదంటే సీఎం రేవంత్‌రెడ్డి ఇంటిముందు ధర్నా చేస్తానని ఎర్రబెల్లి దయాకర్‌రావు హెచ్చరించారు.

జనగామ: దేవాదుల నుంచి నీటిని విడుదల (Devadula Water Release) చేయడంలో రేవంత్ ప్రభుత్వం (Revanth Government) ఎందుకు నిర్లక్ష్యం చేస్తోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు (Errabelli Dayakar Rao) ప్రశ్నించారు. నాలుగు రోజుల్లో దేవాదుల నీటిని విడుదల చేయాలని.. లేదంటే సీఎం రేవంత్‌రెడ్డి ఇంటిముందు ధర్నా చేస్తానని హెచ్చరించారు. దేవాదుల నుంచి నీటిని విడుదల చేయాలని రేవంత్ ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. ఈ క్రమంలో పాలకుర్తి మండలం మాదాపురం దంతాలతండా నుంచి పాదయాత్రని ఇవాళ(శుక్రవారం) ప్రారంభించారు ఎర్రబెల్లి దయాకర్‌రావు.
పాదయాత్రలో రైతులతో మాట్లాడి వారి సమస్యల గురించి అడిగి ఎర్రబెల్లి తెలుసుకున్నారు. రైతుల సమస్యలను పరిష్కరించడంలో రేవంత్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. బీఆర్ఎస్ రైతుల పక్షానా పోరాడుతోందని ఉద్ఘాటించారు. కేసీఆర్ ప్రభుత్వం రైతులకి మేలు చేసిందని చెప్పుకొచ్చారు ఎర్రబెల్లి దయాకర్‌రావు.
కాగా.. పాలకుర్తిలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. దేవాదుల నుంచి నీటి విడుదలపై అధికార, ప్రతిపక్షాల మధ్య వాటర్ వార్ కొనసాగుతోంది. దేవాదుల నీటిపై కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు పార్టీల మధ్య రాజకీయ రగడ రాజుకుంది. దేవాదుల నీటి విడుదలపై ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు మధ్య దేవాదుల నీటి పంచాయతీ రగులుతోంది. దేవాదుల నీటి విడుదలపై నిన్న(గురువారం) అధికారులతో ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి సమావేశం అయ్యారు. నీటిని విడుదల చేయాలని అధికారులను ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి ఆదేశించారు. ఈ క్రమంలోనే ఎర్రబెల్లి దయాకర్‌రావు పాదయాత్ర చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇవి కూడా చదవండి..
మల్నాడు రెస్టారెంట్ డ్రగ్స్ పార్టీ కేసులో ఈగల్ టీం దూకుడు
ఉగ్రవాద కార్యకలాపాలపై అమెరికా విదేశాంగ శాఖ కీలక ప్రకటన
Read latest Telangana News And Telugu News