Police Investigation: సీపీఐ నేతపై కాల్పులు... నిందితులను గుర్తించిన పోలీసులు
ABN , Publish Date - Jul 16 , 2025 | 09:35 AM
Police Investigation: సీపీఐ నేత చందు నాయక్‌పై కాల్పులు జరిపిన నిందితులను పోలీసులు గుర్తించారు. భూతగాదాల వల్లే సీపీఐ నేతపై కాల్పులు జరిపినట్లు నిర్ధారించారు.

హైదరాబాద్, జులై 16: నగరంలోని మలక్‌పేటలో సీపీఐ నేత చందు నాయక్‌పై (CPI Leader Chandu Naik) కాల్పుల కేసులో పోలీసుల విచారణ కొనసాగుతోంది. చందుపై కాల్పులు జరిపింది రాజేష్, సుధాకర్, శివ, బాషాగా పోలీసులు గుర్తించారు. కాల్పులకు కుంట్లూర్‌లోని భూతగాదాలే కారణమని నిర్ధారించారు. భూమి విషయమై గత కొద్ది రోజుల నుంచి రాజేష్‌కు చందు నాయక్‌కు మధ్య విభేదాలు నడుస్తున్నాయి. కుంట్లూరులోని రావి నారాయణరెడ్డి నగర్‌లో చందు నాయక్ అనుచరులు గుడిసెలు వేయడంతో రాజేష్ కక్ష పెంచుకున్నాడు. సీపీఐ పార్టీలో చందు నాయక్ ప్రస్తుతం కౌన్సిల్ నెంబర్‌గా ఉన్నారు. సీపీఐ నేతతో కలిసి తిరిగిన రాజేష్ ఈ దారుణానికి పాల్పడడంతో అతడిని కఠినంగా శిక్షించాలని కుటుంబ సభ్యులు, సీపీఐ నాయకులు పోలీసులను కోరారు.
నిందితులను పట్టుకోవడానికి పది ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి మరీ గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. నిందితులు చౌటుప్పల్ వైపు పారిపోయినట్టు సీసీ కెమెరాల్లో గుర్తించారు పోలీసులు. ఘటనా స్థలంలో ఏడు రౌండ్ల బుల్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చందు నాయక్ తనకు ప్రాణహాని ఉన్నా కూడా పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. మరోవైపు ఈరోజు (బుధవారం) చందు నాయక్ స్వగ్రామం నర్సాయపల్లిలో కుటుంబసభ్యులు అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
కాగా.. నిన్న(మంగళవారం) ఉదయం కుటుంబసభ్యులు, స్నేహితులతో కలిసి వాకింగ్ చేస్తున్న చందునాయక్‌పై కొందరు వ్యక్తులు కాల్పులు జరిపారు. పథకం ప్రకారం ముందుగా చందు నాయక్ కళ్లలో కారం కొట్టారు. దీంతో సీపీఐ నేత ప్రాణ భయంతో అక్కడి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించారు. కానీ ప్రత్యర్థులు అతడిని వెంటాడి మరీ తుపాకీతో కాల్పులు జరిపారు. దీంతో చందు నాయక్ అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇవి కూడా చదవండి..
నెలవారీ ఖర్చులకూ క్రెడిట్ కార్డులే దిక్కు
Liquor Commission Scandal: ఆ ఐదేళ్లూ బాదుడే
Read Latest Telangana News And Telugu News