Bandi Sanjay: బీసీ జాబితా నుంచి ముస్లింలను తొలగించాలి
ABN , Publish Date - Jul 16 , 2025 | 06:29 AM
బీసీ రిజర్వేషన్ల అమలు అంశం వెనక పెద్ద కుట్ర దాగి ఉంది. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించి..

వారికి 10% రిజర్వేషన్ అమలు చేయొద్దు: సంజయ్
సిరిసిల్ల జూలై 15 (ఆంధ్రజ్యోతి): ‘‘బీసీ రిజర్వేషన్ల అమలు అంశం వెనక పెద్ద కుట్ర దాగి ఉంది. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించి.. అందులో ముస్లింలకు 10% రిజర్వేషన్లు అమలు చేయాలనుకోవడం దుర్మార్గం. బీసీ జాబితా నుంచి ముస్లింలను తొలగించాలి. లేదంటే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తాం’’ అని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ హెచ్చరించారు. మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మోదీ గిఫ్ట్ పేరుతో 10వ తరగతి విద్యార్థులకు ఆయన సైకిళ్లను పంపిణీ చేశారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్రంలో 51% ఉన్న బీసీలకు 32% మాత్రమే రిజర్వేషన్లు అమలు చేస్తామంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం 12% ఉన్న ముస్లింలకు మాత్రం 10% రిజర్వేషన్లు అమలు చేసేందుకు సిద్ధమవడం దుర్మార్గమని మండిపడ్డారు. రిజర్వేషన్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వాస్తవాలను కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తోందని, అవాస్తవాలను మీడియా ద్వారా ప్రజలకు చేరవేస్తోందన్నారు. కొన్ని బీసీ సంఘాలు ప్రభుత్వానికి వత్తాసు పలుకుతూ బీసీలకు అన్యాయం చేస్తున్నాయని ఆరోపించారు. మతపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం అని, అయినా ఆర్డినెన్స్ తీసుకువస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం దుర్మార్గమన్నారు. బీసీ జాబితా నుంచి ముస్లింలను తొలగిస్తేనే.. కేంద్రాన్ని ఒప్పించి బీసీ బిల్లుకు ఆమోదం తెలిపే బాధ్యతను తాము తీసుకుంటామని చెప్పారు. బనకచర్ల ప్రాజెక్టు విషయంలో కేంద్రం రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలతో సమావేశం ఏర్పాటు చేయడాన్ని స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు. ఈ విషయంలో సీఎం రేవంత్‌రెడ్డి తెలంగాణ వాదనను బలంగా వినిపించాలని కోరారు.